Begin typing your search above and press return to search.

గంటాకు ఎందుకింత తొందర ?

By:  Tupaki Desk   |   15 March 2022 5:01 AM GMT
గంటాకు ఎందుకింత తొందర ?
X
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కు లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా పోయిన ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాను రాజీనామా చేసి ఏడాది దాటిపోయినా ఇంకా ఆమోదం పొందలేదని గుర్తుచేస్తూ గంటా స్పీకర్ కు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల పోరాటానికి నైతిక మద్దతుగా ఉంటుంది కాబట్టి తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ ను గంటా తన లేఖలో రిక్వెస్ట్ చేసుకున్నారు.

నిజానికి ఎవరి పోరాటాలకో నైతిక మద్దతుగా రాజీనామా చేసేంత సీన్ గంటాకు లేదు. ఎన్నికకు ఒక నియోజకవర్గానికి మారిపోయే గంటాకు లోలోపల ఏదో ప్లానే ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ఎంఎల్ఏగా గెలిచిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.

వైసీపీలోకి దూకటానికి పెద్ద ప్రయత్నాలే చేశారు. అయితే ఆయనకు ఒకపుడు ఆప్తమిత్రుడు, ఇపుడు ప్రత్యర్ధయిన మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు.

జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఏదో కారణాల వల్ల అదీ జరగలేదు. బీజేపీవైపు గంటా చూస్తున్నారన్న ప్రచారం జరిగినా అదీ కాలేదు. దాంతో గంటా చేరటానికి ఇక పార్టీలంటు ఏవీ మిగలలేదు.

ఇపుడు కాపు ఉద్యమం అని, కాపులకే రాజ్యాధికారమనే సమావేశాలు జరుగుతున్నాయి. ఫోరం ఫర్ బెటర్ ఏపీ అనే వేదికను ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుని రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలని కాపు ప్రముఖుల్లో కొందరు వరసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో గంటా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే గంటాకు అధికారమే ముఖ్యం. అధికారంలో ఉన్న పార్టీలో మాత్రమే ఉండాలని గంటా అనుకుంటారు. కాబట్టి ఇపుడు చేస్తున్న హడావుడంతా ఏదో పైపైన చేస్తున్న షో మాత్రమే అని అనుమానంగా ఉంది. రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో ఇప్పటికైతే సస్పెన్సే.

ఏదేమైనా స్టీల్ ఫ్యాక్టరీ సెంటిమెంటును క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతోనే ముందు జాగ్రత్తగా రాజీనామా చేసినట్లు అనిపిస్తోంది. అందుకనే అవసరం లేకపోయినా తన రాజీనామా ఆమోదం కోసం స్పీకర్ కు లేఖ రాశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.