Begin typing your search above and press return to search.

ఆఫీసులో సర్కారు ఉద్యోగులు సెల్ ఫోన్ల వాడకంపై షాకిచ్చిన మద్రాస్ హై కోర్టు

By:  Tupaki Desk   |   15 March 2022 9:29 AM GMT
ఆఫీసులో సర్కారు ఉద్యోగులు సెల్ ఫోన్ల వాడకంపై షాకిచ్చిన మద్రాస్ హై కోర్టు
X
ఎన్నో సంచలన తీర్పులిచ్చిన మద్రాస్ హైకోర్టు మరోసారి అదే తరహా తీర్పును వెలువరించింది. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ పని వేళల్లో సెల్ ఫోన్ వాడకం అంశంపై కోర్టు కీలక తీర్పు చెప్పింది. వాస్తవానికి ఈ తీర్పు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు సంబంధించినది అయినా.. ప్రైవేటు కార్యాలయాలకూ వర్తిస్తుందనడంలో సందేహం లేదు. అందులోనూ సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలంలో ఆఫీసుల్లో సెల్ ఫోన్ల వాడకం ఎంతైనా ఇబ్బందికరమే అనడంలో సందేహమే లేదు. ఇలా చేయడం ఆఫీసుకు పనిగంటల ఆదా చేస్తుంది. అంతేకాక సిబ్బంది ఏకాగ్రత కూడా చెదరకుండా ఉంటుంది. వారి వ్యక్తిగత గోప్యత విషయం వివాదాస్పదం కాదు.

ఇంతకూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమంటే.. తమిళనాడు తిరుచిరాపల్లిలోని హెల్త్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌ సూపరింటెండెంట్.‌. ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. దీంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్‌ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాసు హైకోర్టు గట్టి షాకే ఇచ్చినట్లయింది.

ప్రభుత్వ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్‌ ఫోన్స్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణియమ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సహోద్యోగులకు ఇబ్బందే..
‘‘ఆఫీసుల్లో మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తుండడ, ఫోన్లలో వీడియోలు తీయడం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఇవన్నీ తోటి ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగించడమే. కార్యకలాపాలకు ఆటంకం కూడా. ప్రభుత్వం దీన్నితీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలి. మొబైల్‌ ఫోన్లను వీలైతే స్విఛాఫ్‌ చేయాలి.

లేదా వైబ్రేషన్‌/సైలెంట్‌ మోడ్‌లో పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లి మాట్లాడి రావాలి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్క్యులర్‌ జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.

సెల్ ఫోన్.. పనికి ఆటంకమే ప్రభుత్వ అనే కాదు.. ప్రయివేటు కార్యాలయాల్లోనూ సెల్ ఫోన్ వాడకం నష్టదాయకమే. సిన్సియర్ గా పనిచేసే ఉద్యోగులు తప్ప మిగతావారంతా మొబైల్ ఫోన్స్ లో కాలక్షేపం చేస్తూ పనిని విస్మరిస్తుంటారు. దీంతో పనిలో ఎఫెక్టివ్ నెస్ అనేది తగ్గుతుంది. అంతేకాక గంటలో చేయాల్సిన పనిని రెండు గంటలు చేస్తుంటారు. ఇప్పుడు మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పు.. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు కార్యాలయాలకూ మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.