Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు హెచ్‌1బీ షాక్‌..కోర్టును ఆశ్ర‌యించిన ఐటీ కంపెనీలు

By:  Tupaki Desk   |   28 Jan 2020 2:30 PM GMT
ట్రంప్‌ కు హెచ్‌1బీ షాక్‌..కోర్టును ఆశ్ర‌యించిన ఐటీ కంపెనీలు
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు ఊహించ‌ని షాక్‌. నిబంధ‌న‌లు మార్పు చేస్తూ...దూకుడుగా ముందుకు సాగుతున్న ఆయ‌న స‌ర్కారు తీరుకు మూకుతాడు వేయాల‌ని ఐటీ కంపెనీలు కోర్టును ఆశ్ర‌యించాయి. అయితే, అవి మ‌న దేశంలోని ఐటీ కంపెనీలు కావు. అమెరికాకు చెందిన‌వే. త‌మ ద‌గ్గ‌ర హెచ్‌1బీ వీసాల‌కు అధిక ఫీజులు వ‌సూలు చేశార‌ని పేర్కొంటూ వాటిని తిరిగి ఇప్పించాల‌నే డిమాండ్‌ తో ఈ సంస్థ‌లు న్యాయ‌స్థానం మెట్లు ఎక్కాయి.

యూఎస్‌ సిటీజన్‌ షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌ సీఐఎస్‌) త‌ను జారీచేసే హెచ్‌1బీ వీసాల విష‌యంలో కొద్దికాలం క్రితం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. స‌హ‌జంగా ఈ వీసాల ఫీజులు 2000 డాల‌ర్లు కాగా, అమెరికా స‌రిహ‌ద్దుల్లో ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌యోగించే బోర్డ‌ర్ అడ్మిష‌న్ ఫీజు పేరుతో L-1A మ‌రియు L-1B విభాగంలోని వీసాల‌కు ఇంకో 4000 డాల‌ర్లు అధ‌నంగా చెల్లించాల‌ని ఆదేశాలు జారీచేసింది. 50 మందికి మించి ఉద్యోగుల కంపెనీలు ఈ మేర‌కు చెల్లించాల్సిందేన‌ని ఆర్డ‌ర్ వేసింది.

అయితే, యూఎస్‌ సీఐఎస్ ఆదేశాల మేర‌కు గ‌తంలో ఫీజు చెల్లించిన ఐటీ కంపెనీలు ఇప్పుడు అమెరికా స‌ర్కారుకు వ్య‌తిరేకంగా కోర్టు మెట్లెక్కాయి. అమెరికాలోని ఐటీ కంపెనీల అతిపెద్ద వేదిక అయిన ఐటీ స‌ర్వ్ అల‌య‌న్స్ - దాని భాగ‌స్వామ్య కంపెనీలు అయిన ఐటెక్ యూఎస్ - స్మార్ట్ వ‌ర్క్స్ మ‌రియు సాక్సాన్ గ్లోబ‌ల్ సంస్థ‌లు ఈ మేర‌కు యూఎస్‌ సీఐఎస్ ఫీజు వ‌సూలు నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టాయి. త‌క్ష‌ణ‌మే ఫీజు వ‌సూలును ఆపివేయాల‌ని కోర‌డ‌మే కాకుండా గ‌తంలో వ‌సూలు చేసిన ఫీజు సైతం త‌మ‌కు తిరిగి చెల్లించేలా ఆదేశించాల‌ని కోరాయి. కాగా, ఫిర్యాదుదారుల‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే దాదాపు 350 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఫీజు యూఎస్‌ సీఐఎస్ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని స‌మాచారం.