Begin typing your search above and press return to search.

ఆ ఊళ్లో ఎక్కడ చూసినా విడోసే కనిపిస్తారు..? ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   18 Feb 2022 8:30 AM GMT
ఆ ఊళ్లో ఎక్కడ చూసినా విడోసే కనిపిస్తారు..? ఎందుకంటే..?
X
ఏదైనా శుభాకార్యం చేసుకోవాలంటో కొంత మంది ముత్తైదువులను పిలుస్తాం.. మన ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్లను పిలుస్తాం.. కానీ ఆ ఊరివాళ్లు ముత్తైదువుల కోసం పక్క ఊళ్లకు వెళ్లాల్సి వస్తోంది.. కాళ్లా వేళ్లా పడి ముత్తైదువుల కోసం ప్రాథేయపడుతున్నారు.

ఎందుకంటే ఆ ఊరిలో ముత్తైదువు చూద్దామన్నా కనిపించదు. అయితే ఇక్కడ అసలు స్టోరీ ముత్తైదువు కోసం కాదు. ఆ ఊరిలో ఉన్న ఆడాళ్లు మొత్తం ఇలా విడోస్ కావడానికి కారణమేంటని.. వీరి తాళిబొట్లు తెగడానికి ప్రధాన కారణ వారి ఊరికి ఆనుకొని ఉన్న జాతీయ రహదారే.. ఈరోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో ఊరికి చెందిన చాలా మంది మొగాళ్లు మరణించారు. ఇంతకీ ఈ ఊరు ఎక్కడా..? అసలు స్టోరీ ఏంటి..?

రంగారెడ్డి జిల్లా పెద్దకుంట తండా.. ఊరి గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 44వ జాతీయరహదారిని అనుకొని ఉన్న ఈ గ్రామంలో ఒక్క మహిళ నుదుట బొట్టుకనిపించదు. దేశంలోని అతిపెద్ద జాతీయ రహదారి 44 ఈ ఊరి పక్కనుంచే వెళ్తుంది.

ఇదే వారు చేసుకున్న పాపం. ఎందుకంటే ఈ ఊళ్లోని వాళ్లలో చాలా మంది హైవే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారే ఉన్నారు. తండాకు చెందిన అసలీ అనే మహిళకు చెందిన భర్త, అన్న, తండ్రి ముగ్గురూ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఆమెది తల్లిగారు, అత్తగారు ఇదే ఊరుకావడం ఆమె జీవితాన్ని విషాదంలోకి నెట్టింది.

పెద్దకుంట తండాలో 45 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 37 కుటుంబాల్లో మొగవారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఈ ప్రమాదాలు జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కుటుంబాలకు చెందిన మహిళలు కోలుకోలేకపోతున్నారు. తమకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇంటి పనులు చేసేందుకు ఊళ్లో మొగవారు కరువయ్యారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు ఇతర గ్రామానికి వెళ్లాలన్నా. పనుల కోసం బయటికి వెళ్లాలన్న హైవే ఎక్కాల్సిందే. అందుకే చాలా మంది ఈ గ్రామంలోని వారు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు.

ఊరి నుంచి సాయంత్రం వస్తానని ఎవరన్నా బయటకు వెళితే.. తిరిగి ఇంటికి వచ్చే వరకూ భయంగానే ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ భయానికి గ్రామంలోని పిల్లలు చదువు మానేశారు. రోడ్డుపై ఎక్కాలంటే వణికిపోతున్నారని అంటున్నారు. బస్సు కోసం వెళ్లాలన్నా రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గతంలో ఇక్కడ చాలా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. కానీ ప్రాణాలు పోయేవి కావు. కానీ హైవే ఏర్పడిన తరువాత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు దక్కడం లేదు.

అయితే తమ ఊరిని రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడే మార్గం ఆలోచించాలని ప్రభుత్వానికి ఎన్నో సార్లు మొర పెట్టుకున్నారు. కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమ ఊరికి మట్టి రోడ్డు పడడానికే ఎన్నో ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక రక్షణ మార్గాలు ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందోనని అంటున్నారు.