Begin typing your search above and press return to search.

అమరావతి తీర్పుపై ఆగమాగం అవుతునోళ్లు.. ‘విజయవాడ’ అన్న జగన్ వీడియో చూడరా?

By:  Tupaki Desk   |   9 March 2022 4:29 AM GMT
అమరావతి తీర్పుపై ఆగమాగం అవుతునోళ్లు.. ‘విజయవాడ’ అన్న జగన్ వీడియో చూడరా?
X
ఏపీ రాజధానిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు వైసీపీ నేతలు.. ఆ పార్టీ హార్డ్ కోర్ మద్దతుదారులు.. ఆ పార్టీ తరఫున తమ వాదనల్ని ఒంటెద్దు రీతిలో వినిపించే వారంతా ఇప్పుడు గుండె పగిలినట్లుగా పొర్లి పొర్లి రోదిస్తున్న వైనం కనిపిస్తోంది. అమరావతి తీర్పు కొందరికి ఆనందం కలిగించినా.. మూడు రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయని ఆశించిన కోట్లాది మందికి మాత్రం తీర్పు నిరాశను కలిగించిందంటూ కోర్టు తీర్పుపైనా రాస్తున్న రాతలు చూస్తే.. తాము అనుకున్నది జరగకపోవటంపై పడుతున్న వేదన ఏంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఇలా చెప్పేటోళ్లు.. రాసేటోళ్లు.. ఎన్నికల ముందు విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అప్పటి విపక్ష నేత.. వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి వచ్చిన మాటల మాటేంటి? అన్న ఆలోచన లేకుండా మాట్లాడటం గమనార్హం. గతంలో ఎవరైనా ఏదైనా చెప్పారన్న దానికి నిదర్శనంగా పేపర్ కటింగ్ చూపించేటోళ్లు. ఇప్పుడు అలా చూపించినంతనే.. ఏదో ఒక పేరు పెట్టేసి.. దాని విశ్వసనీయ ఊపిరి నులిమేసే ప్రక్రియ జోరుందుకున్న సంగతి తెలిసిందే. అందుకే మారిన కాలానికి తగ్గట్లు.. వీడియోల్ని యథాతధంగా చూపిస్తున్న వైనం పెరుగుతోంది.

ఏపీ రాజధానిగా అమరావతి అన్న హైకోర్టు తీర్పును కాసేపు పక్కన పెడితే.. ఎన్నికల వేళ.. ప్రజల్ని ఓట్లు అడగటానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. వేలాది ముందు మైకు పట్టుకొని.. 'విజయవాడ' అంటూ పెద్ద ఎత్తున నినదించటం.. ఆ తర్వాత 'గుంటూరు' అని నినదించటమే కాదు.. చాలా స్పష్టంగా.. సూటిగా ఏపీ రాజధాని అమరావతినే అని స్పష్టం చేయటం కనిపిస్తుంది.

అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని కాకుండా చేసి.. వేరే ప్రాంతానికి తరలిస్తామన్న విష ప్రచారం చేస్తున్నట్లుగా పేర్కొన్న జగన్.. అమరావతి పేరును ప్రస్తావించకుండా.. విజయవాడ - గుంటూరు మధ్యనున్న ప్రాంతాన్ని రాజధానిగా తాము అంగీకరిస్తున్నట్లుగా చెప్పటం కనిపిస్తుంది.

అధికారంలో చేతిలో లేనప్పుడు విజయవాడ - గుంటూరు మధ్యన రాజధాని ఉందని ఘంటాపథంగా చెప్పిన జగన్ కు.. అప్పుడు మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు డెవలప్ చేయొచ్చన్న మాటను ఎందుకు చెప్పలేదు? తాము వస్తే రాజధానిని తరలిస్తామన్న అబద్ధపు ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడిన జగన్ సంగతిని వదిలేద్దాం.

తమ అధినేత తరపున అర్థం లేని వాదనలు వినిపించే వారంతా.. ఇలాంటివీడియోలు యూ ట్యూబ్ లోనూ.. సోషల్ మీడియాలోనూ భారీగా ఉన్నాయని.. అలాంటి మాటల్నిస్వయంగా వింటున్న ప్రజలకు.. తమ రాతలు.. వాదనలు వెగటు పుట్టిస్తాయన్న లాజిక్ ను ఎలా మిస్ అవుతున్నట్లు?