Begin typing your search above and press return to search.

జనసేన పెద్ద పార్టీయే.. ఓట్ల షేర్ ఇదే... ?

By:  Tupaki Desk   |   16 March 2022 5:30 AM GMT
జనసేన పెద్ద పార్టీయే.. ఓట్ల షేర్ ఇదే... ?
X
ఏపీలో రాజకీయ పార్టీలు మాట్లాడితే మాకు అన్ని ఓట్లు వచ్చాయి, ఇన్ని ఓట్లు వచ్చాయని చెప్పుకుంటారు. దానితోనే రాజకీయాలను చేస్తారు. ఇక ఏపీలో వైసీపీకి చూస్తే 2019 ఎన్నికల్లో 49.95 ఓటు షేర్ వచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల్లో అది 50 శాతం పై దాటింది అని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే 39 శాతం ఓటు షేర్ 2019లో వస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో అది కాస్తా 35 శాతానికి తగ్గిందని అంటారు. అయితే జెడ్పీటీసీ వంటి ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. అది కూడా ఇక్కడ చూడాలి.

ఇదిలా ఉంటే జనసేనకు 2019 ఎన్నికల్లో 7 శాతం ఓటింగ్ షేర్ ఉంటే లోకల్ బాడీ ఎన్నికల తరువాత అది కాస్తా ఏపీవ్యాప్తంగా 27 శాతానికి పెరిగింది అని అంటారు. ఇక గోదావరి జిల్లాలలో 36 శాతం ఓట్ల షేర్ ఉంటే గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో 32 శాతం ఓట్ల షేర్ ఉందని ఆ పార్టీ లెక్కలు చెబుతున్నాయి.

దీని మీదనే రానున్న ఎన్నికల్లో పొత్తులు అయినా సీట్ల బేరాలు అయినా ఉంటాయని జనసేన నాయకులు చెబుతున్నారు. ఓట్లు ప్రతీ ఎన్నికకూ మారుతూంటాయి. అది స్థిరంగా ఉండడానికి ఓటర్లు ఏ ఒక్క పార్టీ సొత్తు కారని జనసేన నేతలు అంటున్నారు. ఇక గతంతో పోలిస్తే జనసేన ఏపీలో బాగా బలపడిందని కూడా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ అంటున్నారు.

తమ పార్టీని కేవలం ఏడు శాతం ఓట్ల షేర్ తో చూడవద్దని, మూడేళ్ల వ్యవధిలో 27 శాతానికి చేరుకున్నామని, రానున్న రోజుల్లో రాజ్యాధికారాన్ని సాధించే దిశగా భారీ ఎత్తున ఓట్ల షేర్ తమ సొంతం అవుతుందని తాజాగా జరిగిన ఒక చానల్ డిబేట్ లో శివశంకర్ చెప్పుకొచ్చారు. అందువల్ల ఏది పెద్ద పార్టీ ఏది చిన్న పార్టీ అన్న ప్రసక్తే పొత్తుల మధ్య ఉండకూడదు అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

దీన్ని బట్టి చూస్తే టీడీపీతో రేపటి రోజున పొత్తులు కనుక కుదిరితే జనసేన కచ్చితంగా భారీ వాటానే అడుగుతుంది అని అంటున్నారు. అదే విధంగా తామెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని ఆ పార్టీ నేతలు గట్టిగానే అంటున్నారు. ఏపీ జనాలు మార్పు కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగా జనసేనను గెలిపిస్తారని చెబుతున్నారు.

ఇక ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ రాష్ట్రం బాధ్యతలను తానే స్వయంగా తీసుకుంటానని చెప్పడం వెనక అర్ధం ముఖ్యమంత్రి కావడమే అని కూడా అంటున్నారు. ఈ విషయంలో మాత్రం జనసేన ఈసారి ఎవరిన్ని చెప్పినా తగ్గేది లేదు అన్నట్లుగానే ఉంటుందని అంటున్నారు.

మరి ఏపీలో చూసుకుంటే ఈ రోజుకీ విపక్షంలో పెద్ద పార్టీగా టీడీపీని చూస్తారు. మరి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుని టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు అనే అంటున్నారు. కానీ జనసేన నేతల వైఖరి చూస్తే మా ఓట్ల షేర్ పెరిగింది కాబట్టి సీట్లు కూడా ఎక్కువగానే కోరుతామని అన్నట్లుగా ఉంది. ఆ విధంగా పవన్ సీఎం అవుతారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే కనుక లడాయిగా మారితే వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక సంగతి పక్కన పెడితే మిత్రుల మధ్య సీట్ల పంచాయతీ పెద్ద ఇష్యూ అయ్యేలా ఉందని అంటున్నారు. అలాగే ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అన్న దాని మీద కూడా జనసేన పట్టు గట్టిగానే బిగిస్తోంది.

ఇక్కడ కర్నాటకలో 2018లో జరిగిన అధికార పంపిణీని కూడా జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ కి 70కి పైగా సీట్లు వచ్చినా 38 సీట్లు వచ్చిన జేడీఎస్ కే ముఖ్యమంత్రి పదవి అప్పగించిన సందర్భాన్ని కూడా ఉదహరిస్తున్నారు. ఆ విధంగా చూస్తే రేపటి రోజున టీడీపీ ఎక్కువ సీట్లు గెలిచినా జనసేనకే పీఠం అప్పగించాల్సి ఉంటుందన్న మాటను పదే పదే చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.