Begin typing your search above and press return to search.

మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తంగా కర్మన్ ఘాట్

By:  Tupaki Desk   |   23 Feb 2022 5:39 AM GMT
మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తంగా కర్మన్ ఘాట్
X
ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కర్మన్ ఘాట్.. మంగళవారం అర్ధరాత్రి వేళ ఒక్కసారి పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అప్పుడప్పుడే నిద్ర దేవత ఒడిలో సేద తీరేందుకు సిద్ధమవుతున్న ఆ ప్రాంత వాసులు అనూహ్యంగా అక్కడ చోటు చేసుకున్న పరిణామంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవటమే కాదు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవటమే. అసలేం జరిగిందంటే..

మంగళవారం రాత్రి 9-10 గంటల సమయంలో కొందరు గోవులను వాహనంలో తరలిస్తున్నారు. దీంతో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు భజరంగ్ దళ్.. గో సంరక్షక్ సభ్యులు. కర్మాన్ ఘాట్ లోని ఇన్నర్ రింగు రోడ్డు గాయత్రీ నగర్ సమీపంలోకి రాగానే వాహనాన్ని నిలిపేశారు. దీంతో గోవులను తరలిస్తున్న వారికి.. గోరక్షక్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇదే సమయంలో మరికొందరు బొలేరో వాహనంలో అక్కడకు చేరుకున్నారు. గోరక్షక్ సభ్యులకు చెందిన ఇన్నోవా వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. అనంతరం వారిపై కత్తులు.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో గోరక్షక్ సభ్యులు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలోకి పరుగులు తీశారు. ఆలయ భద్రతా సిబ్బంది.. ఇతరులు దుండగుల్ని అడ్డుకోవటంతో వారు గోవులతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పలు హిందూ సంఘాల నేతలు.. బీజేపీ నేతలు.. కార్యకర్తలు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దుండగుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ ఉద్రిక్తత అంతకంతకూ పెరిగిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు.

ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. పలువురుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. కర్మన్ ఘాట్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.