Begin typing your search above and press return to search.

జాతీయ నేతల్లో కేసీఆర్ బ్రాండ్ కున్న వాల్యూ ఎంత?

By:  Tupaki Desk   |   22 Feb 2022 10:30 AM GMT
జాతీయ నేతల్లో కేసీఆర్ బ్రాండ్ కున్న వాల్యూ ఎంత?
X
తెలివి ఒక్కరి సొత్తు ఎంతమాత్రం కాదు. అలా అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాన్ని దాటి బయటకు అడుగు పెట్టి రాజకీయాలు చేయాలనుకునే వేళలో బోలెడంత గ్రౌండ్ వర్కు అవసరం. అన్నింటికి మించి.. ఎవరిని ఎలా డీల్ చేయాలనే దానికి సంబంధించి స్పష్టత చాలా అవసరం. తెలంగాణలో రాజకీయాలు చేసిన చందంగా జాతీయ రాజకీయాలు చేయటం అంత సులువైన పని కాదు. అన్నింటికి మించి కేసీఆర్ మాదిరే.. చాలామంది ప్రాంతీయ నేతలకు తమ తమ రాష్ట్ర అవసరాలు.. ప్రాధామ్యాలు ఉంటాయన్నది అస్సలు మర్చిపోకూడదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే పేరు కోసం.. కీర్తి కోసం తపించేటోళ్లకు కొదవ ఉండదు. తెలంగాణ రాష్ట్ర సాధన వ్యవహారాన్నే తీసుకుంటే.. ఎవరెన్ని చెప్పినా.. మరెంత భావోద్వేగానికి గురైనప్పటికీ.. కేంద్రంలో సోనియా గాంధీ ఉన్నారు కాబట్టి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న కమిట్ మెంట్ ఎక్కువగా ఉండటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆమెకున్న సానుభూతి.. వెరసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని ఆమె మొండిగా తీసుకొని పూర్తి చేశారు. కేసీఆర్ కాదు కదా.. ఆయనకు పది రెట్లు ఎక్కువ శక్తివంతమైన నేతల్ని సైతం బోల్తా కొట్టించే మాస్టర్ ప్లాన్ జాతీయ స్థాయి నేతల వద్ద ఉంటుందని మర్చిపోకూడదు.

అలాంటి వారిని ఒకచోటకు చేర్చి.. వారిని సమాధానపరిచి.. వారందరిని ఒక తాటి మీదకు తీసుకురావటం ఒక ఎత్తు అయితే.. వారందరికి నమ్మకం కలిగించటం మరో ఎత్తు. కేసీఆర్ ట్రాక్ రికార్డును చూసినప్పుడు..ఆయన ఎవరితో అయితే జట్టు కడతారో.. ఆ తర్వాతి రోజుల్లో వారిని నోటికి వచ్చినట్లుగా తిట్టిపోయటం ఆయనే చెల్లుతుంది. అంతేకాదు.. ఇచ్చిన మాట మీద నిలబడే తత్త్వం కూడా తక్కువనే మాట వినిపిస్తూ ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కలిపేస్తానన్న ఆయన మాట.. తర్వాత రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుందన్నది తెలిసిందే. ఇలాంటి ఘనమైన గతం కేసీఆర్ పేరు చెప్పినంతనే గుర్తుకు వచ్చేలా చేస్తోంది. అంతేకాదు.. ఎంపీగా పని చేసిన వేళలోనూ.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వర్తమానంలోనూ జాతీయ స్థాయిలో ఆయనకు నమ్మకస్తుడైన మిత్రుడు అంటూ ఎవరూ లేకపోవటం కూడా ఒక లోపమనే చెప్పాలి.

చంద్రబాబుకు కావొచ్చు.. ఎన్టీఆర్ కు కావొచ్చు.. జాతీయ స్థాయిలో చూసినప్పుడు కనీసం రెండు మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ఆయన సన్నిహత సంబంధాలు ఉండేవి. కేసీఆర్ లో అవేమీ కనిపించవు.

అవసరంతో వచ్చే స్నేహాలు.. అవసరం తీరినంతనే ముగుస్తాయి. అవసరానికి మించిన భావోద్వేగం చాలా ముఖ్యం. కేసీఆర్ చెబుతున్న జాతీయ రాజకీయాల్లో ప్రధాన లోపం ఏమైనా ఉందంటే ఇదే. దీనికి తోడు ఒకరి పేరు చెప్పినంతనే ఒక ఇమేజ్ కళ్ల ముందుకు వస్తుంది. కేసీఆర్ పేరును తలుచుకున్నంతనే తెలంగాణను సాధించిన అధినేతగా గుర్తుకు వస్తారే తప్పించి.. నమ్మకమైన మిత్రుడిగా ఆయన కనిపించరు. అలాంటి బ్యాగేజ్ ఉన్న నేతను తమ భాగస్వామిగా ఇతర పార్టీల అధినేతలు ఎంతవరకు అంగీకరిస్తారన్నది ప్రశ్న. మరి.. ఆ ఇబ్బందిని ఆయన ఎలా అధిగమిస్తారన్నది అసలు ప్రశ్న.