Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ముంద‌స్తుకేనా? కేసీఆర్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   10 March 2022 8:32 AM GMT
మ‌ళ్లీ ముంద‌స్తుకేనా? కేసీఆర్ ఏం చేస్తారు?
X
తెలంగాణ‌లో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు రాబోతున్నాయా? కేసీఆర్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌లు, ప్ర‌క‌ట‌న‌లు, బ‌డ్జెట్‌.. ఇలా వివిధ అంశాల‌ను ప‌రిశీలిస్తే ముందస్తు ఎన్నిక‌ల‌కే ఆయ‌న మొగ్గు చూపుతున్నార‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల అవ‌స‌రం లేద‌ని ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశంలో పేర్కొన్న‌ప్ప‌టికీ జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా క‌నిపిస్తున్నాయి.

2018లో ప‌రిస్థితులు విభిన్నంగా ఉన్నాయ‌ని అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి వచ్చిందిన చెప్పిన కేసీఆర్‌.. ఈ సారి అలాంటిదేమీ ఉండ‌దని చెప్పారు. కానీ కేసీఆర్ వ్యూహాల‌ను అంచ‌నా వేయ‌లేమ‌ని ఆయ‌న మ‌రోసారి అసెంబ్లీని ర‌ద్దు చేసే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు అంటున్నారు. కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తుకు వెళ్తార‌నేదానికి కొన్ని కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన కేసీఆర్‌.. రాష్ట్రంలో త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ముంద‌స్తుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు త‌న పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్య‌తిరేక‌త పెరిగే కంటే ముందే అసెంబ్లీని ర‌ద్దు చేయ‌డం మంచిద‌నే భావన‌లో ఆయ‌న ఉన్నార‌ని తెలిసింది.

ఇక తాజాగా ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయ‌డం ఖాయ‌మైంది. ఈ జోరుతో తెలంగాణ‌లో ఆ పార్టీ నేత‌లు మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. ఆ ఫ‌లితాలు తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతంపై ప్ర‌భావం చూపుతాయ‌న‌డంలో సందేహం లేదు.

అందుకే రాష్ట్రంలో బీజేపీ ప్ర‌ధాన శ‌క్తిగా ఎదిగే ముందే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ని టాక్‌. అందుకే ముంద‌స్తుకు సూచ‌న‌గానే బ‌డ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద‌పీఠ వేశార‌ని చెబుతున్నారు. ద‌ళిత బంధుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఆ వ‌ర్గం ప్ర‌జ‌ల అసంతృప్తిని చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక 90 వేల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న చేసి నిరుద్యోగుల‌నూ త‌న వైపు తిప్పుకునేందుకు ప్ర‌ణాళిక ర‌చించార‌ని టాక్. ఇవ‌న్నీ చూస్తుంటే కేసీఆర్ క‌చ్చితంగా మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.