Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫిటింగ్ పెట్టారే.. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   12 March 2022 4:10 AM GMT
కేసీఆర్ ఫిటింగ్ పెట్టారే.. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారు?
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఇర‌కాటంలో పెట్టారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో 91,142 ఉద్యోగాల భ‌ర్తీకి కేసీఆర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డ‌మే అందుకు కార‌ణమ‌ని అంటున్నారు. కేసీఆర్ చ‌ర్య‌తో ఇప్పుడిక ఏపీలో జ‌గ‌న్‌పై నిరుద్యోగుల నుంచి సెగ తగిలే అవ‌కాశం ఉంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ పాల‌న‌ను పోల్చి చూడ‌డం ప్ర‌జ‌ల‌కు అల‌వాటు అయింది. అలాగే ఈ రెండు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పైనా జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. ఓ రాష్ట్రంలో సీఎం ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. వెంట‌నే ప‌క్క రాష్ట్రంలోనూ అదే స‌మ‌స్య‌పై చ‌ర్చ జోరందుకుంటోంది.

అటూ ఇటూ పోలుస్తూ..

క‌రోనా స‌మయంలో కొవిడ్ చికిత్స‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ ఆరోగ్య‌శ్రీలో చేర్చారు. తెలంగాణ‌లోనూ అలాగే చేయాలంటూ విప‌క్షాలు, ప్ర‌జ‌లు ఆందోళ‌న చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒకేసారి 91,142 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీంతో ఈ నిర్ణ‌యం జ‌గ‌న్‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఏపీలోనూ ఉపాధి అవ‌కాశాలు లేక నిరుద్యోగులు అస‌హ‌నంతో ఉన్నారు. ప‌రిశ్ర‌మ‌లు పెద్ద‌గా రాక‌పోవ‌డం, ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడిక కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఏపీలోని నిరుద్యోగులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డే అవ‌కాశం ఉంది. గ‌తేడాది జ‌గ‌న్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌పై నిరుద్యోగులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌నలు చేసిన సంగ‌తి తెలిసిందే.

జేసీ ప్ర‌శంస‌లు..

ఇక కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో జ‌గ‌న్ కూడా ఉద్యోగాల భ‌ర్తీకి పూనుకోవాల్సి ఉంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డి విప‌క్షాలు కేసీఆర్‌ను పొగుడుతూ.. జ‌గ‌న్‌పై విమర్శ‌లు చేస్తున్నాయి. తెలంగాణ సీఎల్సీ కార్యాల‌యానికి వెళ్లి ఏపీ టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్‌రెడ్డి కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఒకేసారి 91 వేల ఉద్యోగాల నియామ‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. భారీ సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌తో యూత్‌లో కేసీఆర్‌కు మంచి క్రేజ్ వ‌స్తుంద‌ని ఆయ‌న కొనియాడారు. మ‌రోవైపు జ‌గ‌న్‌పై మాత్రం విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. మూడు కాకుంటే ప‌ది రాజ‌ధానులు ఏపీలో పెట్టుకోవ‌చ్చ‌ని అది త‌మ సీఎం ఇష్ట‌మంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

ఏం చేస్తారో?

ఇప్పటికే ఏపీకి అన్యాయం చేస్తున్న‌ప్ప‌టికీ మోడీ ప్ర‌భుత్వం పై జ‌గ‌న్ ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. మ‌రోవైపు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై పోరు బావుటా ఎగ‌రేసిన కేసీఆర్‌.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను క‌లిపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి సైలెంట్‌గా ఉన్నార‌ని విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిక ఉద్యోగాల భ‌ర్త విష‌యంలోనూ మ‌రోసారి జ‌గ‌న్‌ను కేసీఆర్ ఇర‌కాటంలో పెట్టిన‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.