Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంటే అంతే.. వారం రోజులు రెస్టు తీసుకోమన్నా తీసుకోరు.. అసెంబ్లీ కి వచ్చేశారు

By:  Tupaki Desk   |   15 March 2022 3:30 PM GMT
కేసీఆర్ అంటే అంతే.. వారం రోజులు రెస్టు తీసుకోమన్నా తీసుకోరు.. అసెంబ్లీ కి వచ్చేశారు
X
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరి అంచనాలకూ చిక్కరు. మహామహా తలపండిన మేధావులకూ ఆయన కొరకరాని కొయ్యే. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం సింగిల్ విండో నుంచి మొదలైంది. అప్పటినుంచి చూసినా ఆయన తీరేమిటో తెలిసిపోతుంది. గొప్ప నాయకులున్న మెదక్ జిల్లా నుంచి సాధారణ నాయకుడిగా మొదలుపెట్టి.. ఇప్పుడు మహా నాయకుడిగా ఎదిగారు కేసీఆర్. టీఆర్ఎస్ స్థాపన తర్వాత ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. మరో నాయకుడైతే రాజకీయాలను, తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టేవారే. కానీ, కేసీఆర్ అలా కాదు. అన్నటికి తట్టుకుని నిలబడ్డారు. తెలంగాణ సాధించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా నిలబెట్టారు.

గతవారం.. ఆరోగ్యం..

గత శుక్రవారం కేసీఆర్ అనూహ్యంగా హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ఉదయం వేళ కాలు, చేయి లాగుతుండడంతో యశోదా వైద్యు లకు సమాచారం ఇచ్చిన ఆయనకు.. ప్రాథమిక పరీక్షల అనంతరం ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ నిర్వహించారు. యాంజియోగ్రామ్ అంటే మామూలు మాటలు కాదు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి మరింత క్లిష్టమైన టెస్టు ఇది. గుండె పనితీరు, రక్త సరఫరా అడ్డంకులను తెలుసుకునే యాంజియోగ్రామ్ అంటే పెద్ద పరీక్ష.

సాధారణంగా ట్రెడ్ మిల్ టెస్ట్, ఈసీజీ, 2 డి ఎకో టెస్టులతో గుండె పనితీరులో లోపాలు కనపడకుంటేనే యాంజియోగ్రామ్ చేస్తారు. కేసీఆర్ కు ఇదే పరీక్ష చేశారు. కాగా, ఆ రోజు వాస్తవానికి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాయిదాపడింది. అంతకుముందు వనపర్తిలో ఈ నెల 8న జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బుధవారం (ఈ నెల 9న) ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు చూడాలని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నానని ప్రకటించారు. అనుకున్నట్లే 80 వేల పైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించారు.

నాలుగో రోజే అసెంబ్లీకి.. ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త యశోదా ఆస్పత్రిలో అన్ని పరీక్షల అనంతరం కేసీఆర్ గుండె పనితీరు బాగుందని నిర్థారించారు. కాకపోతే ఐప్యాడ్, పత్రికలు ఎక్కువగా చదవడంతో ఆయన సర్వైకల్ ప్రాబ్లమ్ వచ్చినట్లు తేల్చారు. ఆరోగ్యం కుదటపడేందుకు వారం రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ, అలా చేస్తే కేసీఆర్ ఎందుకవుతారు...? వైద్యుల సూచన అలా ఉన్నా.. కేసీఆర్, మంగళవారం అసెంబ్లీకి వచ్చారు.

సెషన్ చివరి రోజు కావడంతో శాసన సభకు హాజరయ్యారు. అంతేకాక ఉపాధి హామీ ఫీల్డ్ అసిసెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని శుభవార్త చెప్పారు. సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్‌ సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానమిస్తూ మాట్లాడారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెలాంటి పొరపాటు చేయొద్దని.. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. సెర్ప్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని కేసీఆర్‌ చెప్పారు. అంతకుముందు రాష్ట్రాల పట్ల కేంద్ర వ్యవహరిస్తోన్న తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. వీఆర్‌ఏలను ఇరిగేషన్‌ విభాగంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రధాని కార్యక్రమానికి గైర్హాజరై.. రాష్ట్రపతిని ఆహ్వానించి గత నెలలో ముచ్చింతల్ లో జరిగిన రామానుజాచార్చుల సహస్రాబ్ది వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కానీ, ఆయనకు విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ స్వాగతం పలకలేదు. అంతకుముందు ఢిల్లీ పర్యటన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలకు ప్రతీకారం తీర్చుకోవడమా? అన్నట్లు ప్రధానితో పాటు కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. అయితే, దీనికి కారణమేమంటే.. తమ ఇంట్లో కొందరికి జ్వరం సోకిందని.. అలాంటప్పడు తాను ప్రధానితో కార్యక్రమంలో పాల్గొనడం భావ్యం కాదని భావించినట్లు చెప్పారు.

కానీ, ప్రధాని వచ్చి వెళ్లిన తర్వాత రెండో రోజే సీఎం యాదాద్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. కావాలనే మోదీ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టారని ప్రచారం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సైతం దీనికి ఒప్పుకొన్నారు. కాగా, రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలకు హాజరైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మాత్రం సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదీ.. కేసీఆర్ అంటే.