Begin typing your search above and press return to search.

కొడాలి నాని : అవునా జగన్ ను టచ్ చేయలేమా ?

By:  Tupaki Desk   |   16 March 2022 8:30 AM GMT
కొడాలి నాని : అవునా జగన్ ను టచ్ చేయలేమా ?
X
అతి విశ్వాసం కార‌ణంగానే చాలా సార్లు చాలా త‌ప్పిదాలే జ‌రిగాయి. ఆత్మ విశ్వాసం కార‌ణంగా జీవితంలో మంచి ఫ‌లితాలు అందుకున్న దాఖ‌లాలు చాలానే ఉన్నాయి చాలా మందికి.. కానీ అతి విశ్వాసం కొన్ని అనాలోచిత మాట‌ల‌కు ప్రేరణ‌నిస్తుంది. గ‌తంలో లోకేశ్ కానీ చంద్ర‌బాబు కానీ అతి విశ్వాసంతోనే కొన్ని మాట‌లు చెప్పి త‌రువాత తీవ్ర‌మ‌యిన రీతిలో ప్ర‌జా క్షేత్రంలో అవ‌మానాలు అందుకున్నారు.ఇప్పుడు అదే త‌ప్పును ఇంకా చెప్పాలంటే బాబు చేసిన త‌ప్పునే కొడాలి నాని చేస్తూ ఉన్నారు.

ఆ విధంగా వైసీపీ ఎదుగుద‌ల‌కు ఆయ‌నొక ప్ర‌తిబంధ‌కం అవుతున్నారా అన్న సందేహాలు కూడా రాజ‌కీయ ప‌రిశీల‌కుల నుంచి వ‌స్తున్నాయి. చంద్ర‌బాబును తిడితే మంత్రులు హీరోలు అవుతారా ? అని ప‌దే ప‌దే టీడీపీ ఆవేద‌న చెందుతున్నా అవేవీ ప‌ట్టించుకోకుండా నాని త‌న‌దైన పంథాలో స్వామి భక్తి చాటుతున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఉంది.ఆ పార్టీ ఖాతాలో అఖండ విజ‌యాలు న‌మోదు అయి ఉన్నాయి. అంతేకాదు పాల‌న సంబంధ ప్ర‌క్రియ‌లో త‌డ‌బాటు ఉన్నా కూడా ప్ర‌జ‌లకు ఉచితాలు అందించండంలో మాత్రం వైసీపీ స‌ర్కారు ముందుంటుంది. ఆ విధంగా ఇవాళ జ‌గ‌న‌న్న విద్యా దీవెన (ఫీజు రీ ఇంబ‌ర్స్ మెంట్ ) కింద 709 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు. మొత్తం ప‌ది ల‌క్ష‌ల మందికి పైగా ఈ విధానం ద్వారా మేలు ద‌క్క‌నుంది.

ఇదే విధంగా నెల‌కో ప‌థ‌కం పేరిట జ‌గ‌న్ ఏదో ఒక విధంగా ఆర్థికంగా వెనుక‌బాటుతో స‌త‌మ‌తం అవుతున్న వ‌ర్గాల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం డ‌బ్బులు ఇస్తూ ఉదార‌త చాటుకుంటున్నారు. సంక్షేమంపైనే ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు కూడా! ఈ దశ‌లో జ‌గ‌న్ ను ట‌చ్ చేయ‌డం ఎవ్వ‌రి త‌రం కాద‌ని కొడాలి నాని అంటున్నారు. ఆయ‌న బ‌తికి ఉండ‌గా సీఎం సీటు ట‌చ్ చేయ‌డం ఎవ్వ‌రికీ క‌ల‌లో కూడా సాధ్యం కాద‌ని అంటున్నారు.

కొడాలి నాని కాస్త అతి విశ్వాసం ప్ర‌క‌టిస్తూ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా పెను దుమారం రేపుతున్నాయి. వాస్త‌వానికి జ‌గ‌న్ పాల‌న‌పై విశ్వాసం ఉంచుతూ మాట్లాడ‌డం తప్పు లేదు కానీ సంద‌ర్భం ఉన్నా లేక‌పోయినా చంద్ర‌బాబును తిట్టిపోయ‌డం మాత్రం త‌గ‌ని ప‌ని అని అంటున్నారు ప‌సుపు పార్టీ అభిమానులు. సీఎం కుర్చీని గ‌తంలో చంద్ర‌బాబు ట‌చ్ చేశాకే క‌దా జ‌గ‌న్ దానిని అందుకున్నారు.

మ‌రి! ఇప్పుడు మ‌ళ్లీ ట‌చ్ చేయ‌డం అంటే ఏదో అసాధ్య రీతికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ప‌ని అని అనుకోవ‌డం అవివేకం అని, తాము రానున్న ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించి మ‌ళ్లీ బాబును ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు.