Begin typing your search above and press return to search.

మేకపాటి ఫ్యామిలీ రాజకీయ వైరాగ్యం...?

By:  Tupaki Desk   |   13 March 2022 11:30 AM GMT
మేకపాటి ఫ్యామిలీ రాజకీయ వైరాగ్యం...?
X
నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం మేకపాటి ఫ్యామిలీది. దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లాను ఒంటి చేత్తో శాసించిన సమర్ధత వారిది. 1989 ఎన్నికలలో ఎంపీగా ఒంగోలు నుంచి గెలిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ లో కీలక నేతగా మారారు. ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహిత సహచరుడిగా జీవిత పర్యంతం ఉన్నారు. ఆయన మరణాంతరం జగన్ వైపు వచ్చారు.

జగన్ ని కాంగ్రెస్ ఇబ్బందుల పాలు చేసిన వేళ ఆయనతో మాట్లాడడానికి ఎంతో మంది సంకోచించిన సందర్భాల్లో సీనియర్ నేతగా, ఎంపీగా మేకపాటి వైసీపీలో ఫస్ట్ చేరారు. పార్టీని ముందుండి నడిపించారు 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బిగ్ షాట్ టి సుబ్బరామిరెడ్డిని సైతం వైసీపీ తరఫున భారీ మెజారిటీతో ఓడించి శభాష్ అనిపించుకున్నారు.

ఇక 2014లో మరోసారి ఎంపీగా నెల్లూరు నుంచి గెలిచిన ఆయన ప్రత్యేక హోదా కోసం 2018లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక 2019లో గౌతం రెడ్డి తన రాజకీయ వారసుడిగా ముందుకు రావడంతో మేకపాటి వెనక్కు తప్పుకున్నారు. ఇక మేకపాటి వారి రాజకీయాన్ని గౌతం రెడ్డి మరిన్ని దశాబ్దాల పాటు నడిపిస్తారు అనుకుంటే ఆయన ఇటీవల గుండెపోటుతో సడెన్ గా కన్ను మూశారు.

దాంతో మేకపాటి రాజమోహనరెడ్డికి ఈ వృద్ధాప్యంలో ఇది భరించలేని వేదనగానే ఉంది. ఇక ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అన్నది కూడా వట్టి మాట. ఇపుడు మేకపాటి ఫ్యామిలీ తరఫున కొనసాగుతున్నది ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మాత్రమే. ఆయన రాజమోహనరెడ్డికి స్వయాన తమ్ముడు. ఆయన కూడా సీనియర్ నేత.

అయితే చంద్రశేఖరరెడ్డి కూడా రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నారా అన్న చర్చ వస్తోంది. తాజగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తాను లేకపోతే ఇక పాలిటిక్స్ కి రాం రాం అనేశారు. సడెన్ గా ఆయన ఈ సంచలన‌ కామెంట్స్ చేయడం వెనక కధ ఏమై ఉంటుంది అన్న చర్చఅయితే వైసీపీలో వస్తోంది.

చంద్రశేఖరరెడ్డికి ఉదయగిరిలో వైసీపీలోనే ప్రత్యర్ధి వర్గం తయారైందిట. అధినాయకత్వానికి దీని మీద చెప్పిచూసినా పట్టించుకోవడంలేదు అన్న బాధ ఉంది. అదే టైమ్ లో మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని మేకపాటి మండిపడుతున్నారు. తన మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని బాధపడ్డారు. మొత్తానికి చూస్తే చంద్రశేఖరరెడ్డి స్టేట్మెంట్స్ అయితే పార్టీలో కలకలం రేపుతున్నాయి.

ఆయన రాజకీయాల పట్ల నిరాసక్తతగా ఉన్నారా లేక వైసీపీ అధినాయకత్వం పోకడల పట్ల వైముఖ్యంగా ఉన్నారా. పార్టీలో అసమ్మతి నేతల తీరు పట్ల మండిపడుతున్నారా అన్నది అర్ధం కావడంలేదు కానీ మేకపాటి ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది.

ఇక మేకపాటి రాజమోహనరెడ్డి కూడా ఈ మధ్యనే వైసీపీ సర్కార్ తీరు మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారని ప్రచారం జరిగింది. వైఎస్సార్ కంటే జగన్ ఇంకా బాగా పాలిస్తారని అప్పట్లో అయనకు మద్దతు ఇచ్చానని మేకపాటి అంటూ ప్రస్తుత పాలన మీద తన భావాలను పరోక్షంగా బయటపెట్టారని అంటున్నారు.

ఇక దివంగత మంత్రి గౌతం రెడ్డి బతికి ఉంటే మేకపాటి ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉండి వైసీపీకి మద్దతుగా ఉండేది. కానీ అసలు మనిషే లేకుండా పోయాక ఎవరి కోసం ఈ రాజకీయం అన్న వైరాగ్యం అయితే వారిలో కలిగిందా అన్న చర్చ కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో గౌతం రెడ్డి సీటు ఆత్మకూరు లో ఉప ఎన్నిక కోసం మేకపాటి ఫ్యామిలీ నుంచే అభ్యర్ధిని ఎంపిక చేయాలని వైసీపీ అధినాయకత్వం అనుకుంటోంది.

మరి దానికి కనుక వారు సరేనంటే వైసీపీతో మేకపాటి కుటుంబం కలసి వెళ్తుందనే అనుకోవాలి. అలా కాకుండా మాకు ఏ పదవులు వద్దు అనేస్తే మాత్రం మేకపాటి ఫ్యామిలీ వైసీపీకి దూరం అయినట్లే అంటున్నారు. ప్రస్తుతానికైతే గౌతం రెడ్డి సతీమణి కీర్తిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబెట్టాలని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.