Begin typing your search above and press return to search.

టికెట్ ర‌గ‌డ‌! రాత్రికి రాత్రే ప్ర‌జ‌లు ధ‌న‌వంతుల‌య్యారా?

By:  Tupaki Desk   |   10 March 2022 4:23 AM GMT
టికెట్ ర‌గ‌డ‌! రాత్రికి రాత్రే ప్ర‌జ‌లు ధ‌న‌వంతుల‌య్యారా?
X
సినిమా టికెట్ ర‌గ‌డ గురించి తెలిసిందే. ఏడాది కాలంగా ఏపీలో స‌న్నివేశంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ సాగుతోంది. ఏపీ ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మ‌పై క‌క్ష క‌ట్టింద‌న్న వాద‌నా వినిపించింది. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప‌గ‌తోనే సినీరంగాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌వ‌ర్ స్టార్ న‌టించిన వ‌కీల్ సాబ్ - భీమ్లా నాయ‌క్ విష‌యంలో జ‌రిగిన తంతు గురించి తెలిసిన‌దే. ప‌వ‌న్ న‌టించిన భీమ్లానాయ‌క్ రిలీజైన రెండు వారాల‌కు ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌భుత్వం కొత్త జీవోని రిలీజ్ చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే మ‌రోవైపు టికెట్ రేట్లు పెంచి త‌మ నెత్తిపై పాలు పోసిన ఏపీ ప్ర‌భుత్వాన్ని స‌న్మానించేందుకు తెలుగు సినీప‌రిశ్ర‌మ రెడీ అవుతోంది. దీనిని జ‌న‌సేన నాయ‌కుడు.. పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. సినిమా వినోదాన్ని పేద‌ల‌కు అందుబాటులోకి తెస్తామ‌న్న ప్ర‌భుత్వం ఇప్పుడు టికెట్ రేట్ల‌ను పెంచింద‌ని విమ‌ర్శించారు. రాత్రికి రాత్రే ప్ర‌జ‌లు ధ‌న‌వంతుల‌య్యారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ప్ర‌భుత్వ తీరుతెన్నుల‌ను ఎండ‌గ‌డుతూ సినీప‌రిశ్ర‌మ ఐక్యం కావాల‌ని క‌దిలి రావాల‌ని పిలుపునిచ్చారు. త‌మ‌వంటి వారి విష‌యంలోనే ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రిస్తుంటే సామాన్యుల ప‌రిస్థితి ఇంకెలా ఉందో అంటూ తూర్పార‌బ‌ట్టారు. సినీప‌రిశ్ర‌మ‌ను ఇంత‌గా ఇబ్బంది పెట్టిన సీఎం జ‌గ‌న్ ని ప‌రిశ్ర‌మ పెద్ద‌లే స‌న్మానిస్తారా? అని కూడా ప్ర‌శ్నించారు.

టికెట్ రేట్లు.. ఎందుకిలా..?

వైకాపా వ‌ర్సెస్ జ‌న‌సేన ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను విమ‌ర్శిస్తూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పంటి కింద రాయిలా మారాడ‌ని టాక్ వినిపిస్తోంది. నిజానికి రాబోవు ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ తో ఢీ అనేది ఛాలెంజింగ్ గా ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోందంటూ జ‌న‌సైనికులు స‌మ‌రోత్సాహాన్ని క‌న‌బ‌రుస్తున్నారు. కార‌ణం ఏదైనా కానీ అధికార‌పక్షం దృష్టి ప‌వ‌న్ పై పూర్తిగా ఉంద‌న్న క్లారిటీ ప్ర‌జ‌ల‌కు ఉంది.

ఇప్పుడు ఇదే ప‌వ‌న్ న‌టించే సినిమాలకు ఇబ్బంది గా మారింద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. అతడు న‌టించిన వ‌కీల్ సాబ్ రిలీజ్ ముంగిట ప‌రాభ‌వాల గురించి తెలిసిన‌దే. టికెట్ ధ‌ర‌ల్ని అమాంతం త‌గ్గించి వ‌కీల్ సాబ్ వ‌సూళ్ల‌ను దెబ్బ కొట్టార‌న్న గుస‌గుస వినిపించింది. ఇక ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌లను పెంచుతూ స‌వ‌రించిన కొత్త జీవో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిని భీమ్లా నాయ‌క్ రిలీజ్ ముందే విడుద‌ల చేయాల్సి ఉండ‌గా ఆపి ఉంచార‌ని భీమ్లా నాయ‌క్ విడుద‌లైన రెండు వారాల‌కు జీవోని పాస్ చేశార‌ని ప్ర‌ముఖ నిర్మాత వ్యాఖ్యానించ‌డం విశేషం.

ఫిలిం ఛాంబర్ ఈసీ సభ్యుడు.. పంపిణీ దారుడు కం నిర్మాత‌ సత్యనారాయణ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ``తన సినిమా రిలీజైతే కానీ ప్రభుత్వం జీవో ఇవ్వదని పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు`` అంటూ వ్యాఖ్యానించారు. త‌న వ‌ల్ల త‌న సినిమా వ‌ల్ల ప‌రిశ్ర‌మ ఇబ్బంది ప‌డ‌కూడద‌నే టికెట్ పెంపు లేక‌పోయినా ప‌వ‌న్ త‌న సినిమాని విడుద‌ల చేయించార‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌వ‌న్ ని హింసించింద‌ని అన్నారు.

అయితే ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ పంచ్ లు సెటైర్ల గురించి తెలిసిందే. సాయి ధ‌ర‌మ్ న‌టించిన రిప‌బ్లిక్ వేదిక‌గా అత‌డు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అది మ‌రింత‌గా అగ్గి రాజేసింద‌న్న గుస‌గుసా ఉంది. జ‌న‌సేనాని భీమ్లా నాయ‌క్ విడుద‌ల ముందు జీవోని కావాల‌నే ఆల‌స్యం చేశారన్న టాక్ ఇత‌ర సినీవ‌ర్గాల్లోనూ బ‌లంగానే వినిపిస్తోంది.