Begin typing your search above and press return to search.

జనసేనలో ఆయన పక్కా మాస్... ?

By:  Tupaki Desk   |   13 March 2022 11:30 AM GMT
జనసేనలో  ఆయన పక్కా మాస్... ?
X
జనసేన అంటే ఆ వెంటనే వచ్చే మాట పవన్ కళ్యాణ్ అని. జనసేనకు ఆయన అధినాయకుడు. మరి ఆయన తరువాత వినిపించే పేరు ఏదైనా ఉందా అంటే ఆయనే నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో రెండవసారి గెలిచాక ఆయనకు మొదట డిప్యూటీ స్పీకర్ ఆ మీదట స్పీకర్ పదవి దక్కింది. స్పీకర్ గా మనోహర్ స్మూత్ గా సభను డీల్ చేశారు.

నాడు విభజనతో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ అట్టుడికిన వేళ చాలా జాగ్రత్తగా సభను నడిపారు అని పేరు తెచ్చుకున్నారు. నాడు ఆయన చాలా మెచ్యూర్డు గా సభలో వ్యవహరించి ఉండకపోతే ఎన్నో అనూహ్య ఘటనలు సభలో చూసి ఉండేవారు అని కూడా అంటారు. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్యన స్పీకర్ గా ఉండడం కత్తిమీద సాము. అలా తాను సక్సెస్ ఫుల్ స్పీకర్ అని మనోహర్ నిరూపించుకున్నారు.

ఇక విభజన తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన నాదెండ్ల మొదట్లో టీడీపీ వైసీపీల వైపు చూశారని ప్రచారం జరిగింది. అయితే ఆయన మూడవ పార్టీగా జనసేనకు ఎంచుకుని గత కొన్నేళ్ళుగా ఆ పార్టీలోనే తన ప్రస్థానం అన్నట్లుగా సాగుతున్నారు. ఒక విధంగా జనసేనకు కన్నూ ముక్కూ చెవీతో పాటు సర్వం సహా అన్నట్లుగా మనోహర్ మారారు అంటే అతిశయోక్తి లేదు.

నిజానికి మనోహర్ వ్యక్తిగతంగా క్లాస్ లీడర్. మేధావిగానే కనిపిస్తారు. ఆయన గట్టిగా మాట్లాడిందీ ఉండదు. అయితే జనసేనలోకి వచ్చాక ఆయనలోని మాసిజం బయటపడుతోంది. నూటికి నూరు శాతం దాన్ని వాడేసుకుంటున్న నేర్పు మాత్రం జనసేనదే. జనసేన అంటేనే పవన్ ఫ్యాన్స్, అభిమానులతో పాటు పక్కా మాస్ జాతరగా ఉంటుంది. అలాంటి పార్టీలో కర్త కర్మ క్రియగా నాదెండ్ల మనోహర్ మారిపోయారు. ఆయన అటు అధినాయకుడికీ ఇటు క్యాడర్ కి మధ్య వారధిగా ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నారు.

ఇన్నేళ్ల తన రాజకీయ అనుభవాన్ని జనసేన కోసం ఆయన వెచ్చిస్తున్నారు. అదే టైమ్ లో జనసేన పార్టీలో బాలారిష్టాలకు సరైన పరిష్కారాలను కూడా ఎప్పటికపుడు కనుగొంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో జరుగుతున్న జనసేన 8వ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లను ఆయన దగ్గరుండి చూస్తున్నారు.

ఈ సందర్భంగా క్రిష్ణా వారధి వద్ద జనసైనికులు కట్టిన బ్యానర్లను పోలీసులు తొలగించడంతో నాదెండ్ల లోని ఫైర్ బయటపడింది. పోలీసుల మీద ఆయన ఒక్క లెక్కన మండిపడ్డారు. మా సభ కోసం బ్యానర్లు కడితే తప్పేంటి. దాన్ని ఎలా తొలగిస్తారు. అక్కడ ఉన్న వైసీపీ బ్యానర్ల జోలికి పోని మీరు జనసేన మీదనే ఎందుకు పడుతున్నారు. పోలీసులుగా మీరు న్యూట్రల్ గా ఉండాలి అంటూ క్లాస్ బాగా తీసుకున్నారు. మీ మీద ఎవరి వత్తిడి ఉందో మాకు తెలుసు అంటూ నాదెండ్ల నిప్పులే చెరిగారు.

ఇలా బిగ్ సౌండ్ చేస్తూ నాదెండ్ల విశ్వరూపమే ప్రదర్శించి జనసైనికుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. మొత్తానికి చూస్తే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మీటింగుకు వస్తారు వెళ్తారు. కానీ దానికి ముందూ వెనక తతంగం మొత్తం అంతా తన భుజాల మీద వేసుకుని నాదెండ్ల పడుతున్న కష్టాన్ని చూసిన వారు ఇలాంటి నేత ఒకరు ఉంటే ఏ పార్టీకైనా వేయి ఏనుగుల బలమే కదా అనాల్సి వస్తోంది. మొత్తానికి పైకి స్మార్ట్ గా కనిపించే నాదెండ్ల లోపల మాత్రం మాస్ అప్పీల్ అలాగే ఉందని జనసేనలో ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే అర్ధమైపోతోంది. పవన్ పార్టీకి నాదెండ్ల ఒక అసెట్ అనే అంటున్నారు.