Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన వైఎస్ వివేకా అల్లుడి వాంగ్మూలం !

By:  Tupaki Desk   |   1 March 2022 4:37 AM GMT
షాకింగ్ గా మారిన వైఎస్ వివేకా అల్లుడి వాంగ్మూలం !
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు వైఎస్ వివేకా దారుణ హత్యకు సంబంధించి ఆయన అల్లుడు (డాక్టర్ సునీత భర్త) నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వెల్లడించిన వివరాలు.. సీబీఐ అధికారులకు సమర్పించిన వాంగ్మూలం తాజాగా బయటకు వచ్చింది. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉన్న ఆయన వాంగ్మూలం తర్వాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొత్త సందేహాలకు తెర తీసేలా.. ఆయన వైపు వేలెత్తి చూపేలా విషయాలు ఉండటం గమనార్హం.

ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ తన సొంత బాబాయ్.. తన మామగారైన వైఎస్ వివేకానందరెడ్డి చావును వాడుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందన్న విషయాన్ని పలు మీడియా సంస్థలు బయటపెట్టాయి. 2020 ఆగస్టు 19 నుంచి నాలుగైదుసార్లు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయా సందర్భాల్లో ఆయన చెప్పిన విషయాల్ని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వెల్లడించిన వాంగ్మూలంలో ఏముందన్నది.. ఆయన మాటల్లోనే చదివితే..

- న్నికల్లో గెలిచేందుకు వైఎస్‌ జగన్‌ తన సొంత బాబాయి, మా మామ వివేకానంద రెడ్డి చావును కూడా వాడుకున్నారు. కోడికత్తి గాయానికి కుట్లేసిన ప్రైవేటు డాక్టర్‌కు వేల కోట్ల రూపాయల మందులు కొనుగోలు చేసే కార్పొరేషన్‌ పదవి ఇచ్చారు. వివేకా తలపై గాయాలు కనిపించకుండా కుట్లేసి, కట్టు కట్టిన ఆస్పత్రి సిబ్బందికి మద్దతుగా నిలిచారు

- ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, వారి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డికి వివేకా అంటే సరిపోదు. ఎందుకంటే.. ఆయన్ను 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారే ఓడించారు.

- వివేకాను హత్య చేసిన వారిలో దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి ఉన్నట్లు నా భార్య సునీత ఒకసారి విమానాశ్రయంలో కనిపించిన అవినాశ్‌ రెడ్డికి చెప్పింది. అందుకు స్పందించిన అవినాష్ రెడ్డి.. శివశంకర్ రెడ్డి అలాంటి పని చేసే వ్యక్తి కాదని వెనకేసుకునొచ్చారు.

- మా మామను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో హత్యకు సంబంధించిన ఆధారాల్ని చెరిపేశారు. బాత్‌రూమ్‌లో ఉన్న వివేకా మృత దేహాన్ని బయటికి తీసుకొచ్చి గాయాలు కనిపించకుండా కుట్లేశారు.

- వివేకానంద రెడ్డితో 2019 మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు మాట్లాడాను. వ్యాపారానికి డబ్బులు అవసరమున్నాయని చెప్పాను. మరుసటి రోజు ఉదయం 6.15కు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది. వివేకానంద రెడ్డి చనిపోయినట్లు ఆయన చెప్పారు. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నట్లు తెలిపారు.

- ఈ విషయం నా భార్య సునీతకు చెప్పాను. ఆ తర్వాత వివేకా ఇంటి పక్కనే ఉండే పెద్దింటి రాజశేఖర్‌కు ఫోన్‌ చేశాం. కానీ, ఆ సమయంలో ఆయన తలుపుల గ్రామంలో ఉన్నారు. దీంతో వివేకా డ్రైవర్‌ ప్రసాద్‌కు ఫోన్‌ చేశా. ఆయన భార్య ఫోన్‌ ఎత్తి, నిద్రపోతున్న భర్తకు ఇచ్చింది. ‘సార్‌ నన్ను ఉదయం ఆలస్యంగా రమ్మన్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు’ అని ప్రసాద్‌ చెప్పారు.

- వివేకాతో ఎప్పటిదాకా ఉన్నావు? ఆయన మద్యం ఏమైనా తీసుకున్నారా? అని అడిగాను. ‘లేదు’ అని బదులిచ్చారు. పోస్టుమార్టమ్‌ నివేదికలో వివేకానంద రెడ్డి ఆహారం, మద్యం ఏదీ తీసుకోలేదని తేలింది. కానీ... డైనింగ్‌ టేబుల్‌పై సింక్‌లో భోజనం తిన్న ప్లేట్లు ఉన్నాయి.

- వివేకా మరణంపై పోలీసులకు ఫిర్యాదు అక్కర్లేదని ఎర్ర గంగిరెడ్డి చెప్పారన్నారు. దీంతో... ‘గంగిరెడ్డికి ఫోన్‌ ఇవ్వు. మాట్లాడతాను’ అని చెప్పాను. కానీ... ఇనయతుల్లా సీఐ శంకరయ్యకు ఫోన్‌ ఇచ్చారు. ‘మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా?’ అని సీఐ అడిగారు. ‘ప్రత్యేకంగా లేదు. కానీ... మృతిపై అనుమానాలున్నాయి’ అని చెప్పాను.

- కేసు పెడితే మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపాల్సి ఉంటుందని సీఐ తెలిపారు. అందుకు నేను సరే అన్నాను. ఎర్ర గంగిరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. అప్పుడు అనుమానం బలపడింది. అంతలోనే ఇనయతుల్లా పంపిన ఫొటోలు చూసి... ఏదో జరిగిందనే నిర్ధారణకు వచ్చాం.

- తలకు వెనుక భాగంలో బలమైన గాయాలున్నాయి. పుర్రెలోకి చేతి వేళ్లు దూరాయని ఇనయతుల్లాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు తెలిసింది. అప్పుడే పులివెందులలో నాకు తెలిసిన చాలామంది ఫోన్లు చేశారు. వివేకాది హత్యే.. గుండెపోటుగా చెబుతున్నారన్నారు.

- దీంతో మేము పులివెందులకు వచ్చేదాకా పోస్టుమార్టమ్‌ చేయకుండా చూడాలని డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డికి చెప్పాం. అదే సమయంలోనే... వివేకా నివాసంలో రక్తం శుభ్రం చేశారని టీవీలో వార్తలు వస్తున్నాయి. శాంతి భద్రతలు కాపాడేందుకే కడిగించినట్లు అక్కడ ఉన్న వాళ్లు చెబుతున్నారు.

- మేం పులివెందుల దారిలో ఉండగా... ఎర్ర గంగిరెడ్డి 11.30కు ఫోన్‌ చేశారు. ‘ఎక్కడున్నారు’ అని అడిగా రు. వివరాలు చెబుతుండగానే ఫోన్‌ కట్‌ చేశారు. వివేకా మరణం గురించి ఏమీ చెప్పకుండా అలా వ్యవహరించడంతో అనుమానం బాగా ఎక్కువైంది.

- వివేకా తలపై గాయం చూసి... హత్య జరిగిందని నేను, నా భార్య అనుకున్నాం. అప్పుడు ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఏమి జరిగిందని అడిగాను. ముందు రోజున జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి వెళ్లామని... ‘కడప ఎంపీ అభ్యర్థి నేనే’ అని వివేకా అక్కడ చెప్పారని తెలిపారు.

- ఎర్ర గంగిరెడ్డితో ఎక్కువగా గడుపుతు న్న మాజీ డ్రైవర్‌ దస్తగిరిపైన అనుమానాలు వచ్చాయి. అవి బలపడే మరో కారణం ఉంది. మామకు ఎర్ర గంగిరెడ్డి బాగా దగ్గరగా ఉంటారు. ఆయనతో అవినాశ్ వాళ్లు మాట్లాడరు. కానీ.. హత్య జరిగిన రోజు ఉదయం అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డితో పాటు ఎర్ర గంగిరెడ్డి మాట్లాడారు. వాళ్లు ఫోన్లు కూడా చేసుకున్నారు. మా ఫోన్లు ఎత్తటానికి సైతం ఇష్టపడలేదు. అందుకే ఆయనపై అనుమానం కలిగింది.

- వివేకా గదిలో ఆధారాలు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని అప్పటి సీఎం చంద్రబాబు మాట్లాడటంతో మొత్తం వ్యవహారం రాజకీయ రం గు పులుముకుంది. దీంతో మార్చి 21న కడప నుం చి విజయవాడకు వచ్చి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి రాజకీయ కారణాలతో అక్రమ అరెస్టులు చేసే అవకాశం ఉందని చెప్పాం.

- ఢిల్లీలో ఫిర్యాదు చేయమని సూచించారు. కానీ, సొంత కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేయలేదు. ఆ అనుమానా లు చెప్పి ఉంటే ఎన్నికల్లో వాళ్లపై ప్రభావం పడేది. ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి అనుచరులను ఇబ్బంది పెట్టడం, బీటెక్‌ రవి హరిత హోటల్‌లో సమావేశం గురించి ప్రస్తావన వచ్చింది. అదంతా రాజకీయమే తప్ప హత్యతో సంబంధం లేదని తెలిసింది.

- వివేకా గుండెపోటుతో మరణించారని, కిందపడటంతో గాయాలు తగిలాయని నేను వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం చేశారు. అదంతా అబద్ధమే. నేను ఎవ్వరికీ అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు.