Begin typing your search above and press return to search.

అటా.. ఇటా..పవన్ రూట్ ఎటు... ?

By:  Tupaki Desk   |   13 March 2022 12:30 AM GMT
అటా.. ఇటా..పవన్ రూట్ ఎటు... ?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు.2014 మార్చి 14న జనసేన పుట్టింది. ఒక ఆవేశంలో పుట్టిన పార్టీ అది. నాడు విభజన వేడి గట్టిగా ఉన్న సమయం. పవన్ అడ్డగోలు విభజన అని మండిపడ్డారు. ఏపీని ఏమీ కాకుండా చేశారు అని కూడా కాంగ్రెస్ కి శాపనార్ధాలు పెట్టారు.

మొత్తానికి ఆయన ఏపీకి న్యాయం జరగాలని పార్టీ పెట్టారు. ఇక నాడు ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో బీజేపీకి, టీడీపీకి మద్దతు ప్రకటించి ఆ రెండు పార్టీల ద్వారానే ఏపీ అభివృద్ధి సాధిస్తుంది అని గట్టిగా నమ్మారు. ఆయన కోరుకున్న విధంగా ఆ కూటమే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. అయితే అయిదేళ్ల ఏలుబడిలో విభజన హమీలు నెరవేరలేదు.

దాంతో పవన్ ఆ రెండు పార్టీలకు తిలోదకాలు ఇచ్చారు. 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలసి పోటీకి దిగారు. అయితే ఒకే ఒక్క సీటు తప్ప పవన్ సైతం ఈసారి రెండు చోట్లా ఓడిపోయారు. అది జరిగిన ఆరు నెలలకు పవన్ 2020 జనవరిలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఆ పొత్తులోనే ఉన్నారు.

అయితే మరో రెండేళ్ళలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతగా స్టాండ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అంతా అంటున్నారు. జనసేనలో కూడా అదే మాట ఉంది. ఏపీ వరకూ చూసుకుంటే బీజేపీకి ఏమీ పెద్దగా లేదు. ఇక తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. ఆ పార్టీతో పొత్తు ఉంటే కనుక జనసేన అనుకున్న సీట్లను సాధిస్తుంది.

తన రాజకీయాన్ని మరింతగా కొనసాగించుకుని ముందుకు సాగుతుంది. అయితే టీడీపీకి మద్దతుగా నిలిస్తే గెలిచిన తరువాత సీఎం అయ్యేది చంద్రబాబు మాత్రమే. జనసేనకు మంత్రి పదవులు ఇస్తారు. ఇక పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తారని కూడా అపుడే ప్రచారం స్టార్ట్ అయింది. మరి ఏ అధికారాలు లేని ఆరో వేలు లాంటి డిప్యూటీ సీఎం పదవితో పవన్ కానీ ఆయన అభిమానులు కానీ సంతృప్తి చెందుతారా అన్నది కూడా ఇక్కడ పాయింటే.

ఈ సెటప్ లో అధికారం అంతా టీడీపీ వద్దనే ఉంటుంది నిజం. మరో వైపు చూస్తే పవనే మా సీఎం అభ్యర్ధి అని బీజేపీ ఇప్పటికీ అంటోంది. ఈ కూటమికి ఏపీలో విజయావకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్నది పక్కన పెడితే కష్టపడితే మాత్రం ఫ్యూచర్ బాగా ఉంటుంది అని విశ్లేషకులు సైతం అంగీకరిస్తారు. ఏపీలో చంద్రబాబు పాల‌ననూ జనాలు చూశారు. జగన్ ఏలుబడిని చూస్తున్నారు.

అందువల్ల ఏపీకి కొత్త రాజకీయం ఏంటో చూపించాల్సింది జనసేన బీజేపీ కూటమి మాత్రమే. ఇది ఫ్రెష్ కాంబో. మరి దాన్ని కొసవరకూ తీసుకెళ్లాలీ అంటే బాగా కష్టపడాలి. ఏపీలో రెండు బలమైన పార్టీలను తట్టుకుని ముందుకు సాగాలి. పవన్ కనుక గట్టిగా నిలబడితే ఏపీలో కూటమి జోరు చేయడం కష్టమేమీ కాబోదు. పంజాబ్ లో ఆప్ లాంటి పార్టీ అధికార విపక్ష పార్టీలను తోసిరాజని అధికారంలోకి వచ్చిన నేపధ్యాన్ని చూసినపుడు ఏపీలో ఆ మ్యాజిక్ ఎందుకు సాధ్యం కాదు అన్న వాదన కూడా ఉంది.

ఇక పవన్ చరిష్మాటిక్ లీడర్. పైగా జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా బీజేపీ ఉంది. మోడీతో కలసి పవన్ అడుగులు వేస్తే ఏపీకి కూడా బాగుంటుంది. విభజన ఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్రం సాయం లేకుండా ఏమీ చేయ‌లేని స్థితి. అలాంటిది ఆ పార్టీతో కూటమి కట్టి పవన్ ముందుకు వస్తే కచ్చితంగా జనాల ఆదరణ ఉంటుంది. ఈ రెండేళ్ళూ గట్టిగా జనాల్లోకి వెళ్తే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు ఈ కూటమిలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే పవన్ కళ్యాణ్ మీదనే ఇదంతా ఆధారపడిఉంది. ఆయన కనుక షార్ట్ కట్ మెదడ్స్ ని ఎంచుకుని టీడీపీ వైపుగా మళ్ళితే మాత్రం ఏపీలో టీడీపీకి అధికారం దక్కే వీలుంటుంది. పవన్ సీఎం అవుతారా అన్నది అపుడు ప్రశ్నార్ధకమే. మొత్తానికి చూస్తే పవన్ చేతిలోనే ఇపుడు అంతా ఉంది. తాను ముఖ్యమంత్రిని కావడంతో పాటు, ఏపీకి కూడా కేంద్ర సాయాన్ని దండిగా తీసుకువచ్చే చాన్స్ ని ఉపయోగించుకుంటారా లేక చంద్రబాబుకే మరోసారి జై కొడతారా అన్నదే ఇపుడు అందరిలోనూ మెదలుతున్న సందేహాలు. దానికి జవాబు పవన్ ఆవిర్భావ సభ ద్వారా ఇస్తారనే అనుకుంటున్నారు.