Begin typing your search above and press return to search.

జనసేన అవిర్భావ సభ.. ఇదేం జనం? ఇదెక్కడి అభిమానం

By:  Tupaki Desk   |   15 March 2022 4:29 AM GMT
జనసేన అవిర్భావ సభ.. ఇదేం జనం? ఇదెక్కడి అభిమానం
X
భారీ బహిరంగ సభ అంటే.. కోట్లాది రూపాయిల ఖర్చు కనిపిస్తుంది. చివరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీకి కావొచ్చు.. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ నిర్వహించే ప్రోగ్రాం కావొచ్చు. ఎవరికైనా భారీ ఖర్చుతోనే పెద్ద బహిరంగ సభ సాధ్యమవుతుంది. అందుకు కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయాలి.

వేలాది మందిని బహిరంగ స్థలికి తరలించటానికి వందలాది బస్సులు.. ట్రాక్టర్లు.. కార్లు.. ఇలా ఎన్నింటినో ఎరేంజ్ చేయాలి. కానీ.. అదేమీ లేకుండా.. సింగిల్ రూపాయి ఖర్చు చేయకుండా.. అధినేత మీద అభిమానంతో విరుచుకుపడిన జన ప్రవాహాన్ని చూస్తే.. జనసేన స్పషల్ ఏమిటో అర్థమవుతుంది. పవన్ ఇమేజ్ ఎంతన్న విషయం తెలుస్తుంది.

పవన్ సభ పెడితే ఇన్ని వేల మంది విరుచుకుపడుతారు.. రోడ్లు మొత్తం కిక్కిరిసిపోతాయి. మరి.. ఈ జన ప్రవాహం ఓట్ల రూపంలో ఎందుకు మారవు అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఇంత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలంటే తక్కువలో తక్కువ రూ.50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

చేతికో మందు బాటిల్.. బిర్యానీ పాకెట్ ఇచ్చి.. రూ.300 ఇస్తే కానీ బయటకు రాని జనాలకు భిన్నంగా ఎలాంటి ప్రయోజనం ఆశించకుండానే ఇంత భారీగా జనాలు హాజరు కావటం.. అది కూడా మండే ఎండ వేళలో అంటే అది జనసేనకు మాత్రమే సాధ్యమేమో?

తాజాగా నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభను చూసినోళ్లంతా మరోసారి అవాక్కు అయ్యే పరిస్థితిపన రూపాయి ఖర్చు చేయకపోతేనే ఇంత భారీగా జనం వస్తే.. అదే జేబులో నుంచి డబ్బులు తీసి.. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరి పందేరం చేయటం మొదలు పెడితే.. ఆ రచ్చ నెక్ట్స్ లెవల్ అన్నట్లు ఉంటుందంటున్నారు.

అభిమానంతో వచ్చే జనాలకు.. అభిమానం గుండెల్లో ఉన్నా.. కరెన్సీ నోట్లకు అమ్ముడు పోయే వారి కారణంగానే ప్రజాభిమానం ఓట్ల రూపంలోకి కన్వర్ట్ కావటం లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపాయి జేబులో నుంచి బయటకు తీయకుండానే.. భారీ బహిరంగ సభకు వేలాదిగా జనాల్ని తీసుకొచ్చే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరేనని చెప్పక తప్పదు.