Begin typing your search above and press return to search.

ఆరు నూరు అయినా పవనే సీఎం... ?

By:  Tupaki Desk   |   28 Feb 2022 8:39 AM GMT
ఆరు నూరు అయినా పవనే  సీఎం... ?
X
ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. రెండేళ్లకు పైగా సార్వత్రిక ఎన్నికలకు టైమ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే దానికి తగినట్లుగా పావులను రాజకీయ పార్టీలు కదుపుతున్నాయి. ఏపీలో వైసీపీని ఎలాగైనా గద్దె దించాలన్న కసి విపక్షాలలో ఉంది. దానికి కారణం తానే మరో ముప్పయ్యేళ్ల పాటు సీఎం గా ఉంటాను అని జగన్ అప్పట్లో ఆర్భాటంగా చేసిన ప్రకటన ఫలితమే. ఇలాగే ఊరుకుంటే అది నిజం కాకపోయినా వచ్చే ఎన్నికలలో సైతం జగనే గెలుస్తాడు అన్న కలవరం కూడా ఉంది.

అందుకే రాజకీయ పార్టీలలో ఈ తొందర కనిపిస్తోంది. ఏపీకి కాబోయే సీఎం రేసులో చంద్రబాబు ఎటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అవకాశాలు విపక్షంలో ఆయనకే ఎక్కువగా ఉంటాయన్నది నిజం. అయితే ఇపుడు సీన్ మారుతోంది. చంద్రబాబుని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలన్న ఆలోచన కూడా వస్తోంది. కాపులకు ఇంతకు మించిన చాన్స్ మళ్ళీ దక్కదు అన్న అంచనావే దీనికి కారణం.

ఇక పవన్ సైతం గతం కంటే దూకుడు మీద ఉన్నారు. దానికి కారణం వైసీపీ అని చెప్పాలి. జగన్ సీఎం అయ్యాక పవన్ గట్టిగానే టార్గెట్ అయ్యారు. ఆయన సినిమాలు రెండు ఈ మధ్య కాలంలో తీస్తే వాటికి ఆటంకం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది అన్న ఆవేదన జనసైనికులలో నిండుగా ఉంది. ఇక పవన్ని కానీ ఆయన పార్టీని కానీ వైసీపీ నేతలు అసలు లెక్క చేయకపోవడంతో ఆయనలో ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది.

అయితే కేవలం ఆవేశం ఉంటే సరిపోదు, దాన్ని ఆలోచనలో పెట్టేలాగానే పవన్ అడుగులు ఇపుడు వేగంగా పడుతున్నాయని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికార పీఠం అందుకోవాలన్న పట్టుదల అయితే జనసేనలో ఉంది అంటున్నారు. దానికి అనుగుణంగానే పొత్తుల వ్యూహాలూ ఉంటాయని అంటున్నారు. దాంతో ఈసారి జనసేన పొత్తుతో అధికారంలోకి రావచ్చు అన్న ఆశలు అయితే టీడీపీకి ఆవిరి అయ్యేలా ఉన్నాయని అంటున్నారు.

టీడీపీ నేతలు అయితే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లూ సీట్లూ ఆధారంగానే సీట్ల పంపిణీ ఉంటుందని చెబుతున్నారు. అలా కనుక చూసుకుంటే జనసేనకు ఆరు శాతం ఓటింగ్ వచ్చింది. ఒక సీటు వచ్చింది. దాంతో టీడీపీకి ముప్పయారు శాతానికి పైగా ఓట్లు దక్కాయి. ఇలా కనుక చూస్తే టీడీపీ ఆరు సీట్లు ఇస్తే జనసేనకు ఒక సీటు అన్న నిష్పత్తిలో రేపటి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని చెబుతున్నారు.

ఈ లెక్కన జనసేనకు గట్టిగా 20కి మించి సీట్లు దక్కవు. అవి కూడా గోదావరి జిల్లాలూ, విశాఖ వంటి చోట్ల సర్దుబాటు చేస్తే సరిపోతుందని టీడీపీ ఆలోచిస్తోంది. కానీ జనసేన వ్యూహాలు వేరుగా ఉన్నాయట. అదెలా అంటే తమతో పొత్తు కనుక ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలోనే సీట్ల పంపిణీ ఉండాలన్నదే ఆ షరతు. అంటే మొత్తం 175 సీట్లలో చేరి సగం పోటీ చేయడానికి ఒప్పుకుంటేనే పొత్తు కుదురుతుంది అంటున్నారు.

ఈ విధంగా సగం సీట్లు సాధించి తీసుకుంటేనే రేపటి ఎన్నికల తరువాత పవన్ కచ్చితంగా సీఎం అయ్యేందుకు వీలు ఉంటుందని జనసైనికులు అంచనా వేస్తున్నారు. పవన్ సైతం ఆరు నూరు అయినా సీఎం కావాల్సిందే అన్న పంతంతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఆ విధంగా ఆయనలో వేడిని రగిలించింది వైసీపీ అని అనుకోవాలి.

లేకపోతే పవన్ మరో ఎన్నిక దాకా వేచి ఉండేవారని, కానీ ఇపుడు ఏపీలో వైసీపీ రాజకీయ జబర్దస్తుతోనే పవన్ సహా జనసైనికుల ఆలోచనల్లో ఒక్కసారిగా మార్పు వస్తోంది అని చెబుతున్నారు. ఒక విధంగా ఈ మార్పు టీడీపీకి ఇబ్బంది కలిగించేది అయితే అదే టైమ్ లో జనసేనలో కొత్త ఉత్సాహాం తెస్తోంది. ఇంకోవైపు చూస్తే వరస భేటీలు నిర్వహిస్తున్న కాపు నేతలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాపు నాయకుడినే వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని గట్టిగా సంకల్పిస్తున్నారు.

ఇంతకాలం మేము మరొకరికి మద్దతు ఇచ్చాం, ఇపుడు మాకు ఇవ్వడంలో తప్పేముంది అన్న చర్చను కూడా తెస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే ఇప్పటికి మూడు దఫాలు సీఎం అయ్యారు కాబట్టి ఈసారి పవన్ సీఎం గా బాబు మద్దతు ఇవ్వాల్సిందే అన్న నినాదం అయితే అంతకంతకు పెరుగుతోంది. మరి ఇది ఒక విధంగా టీడీపీకి అతి పెద్ద ఇరకాటం, కానీ జగన్ ని నిలువరించాలీ అన్నా టీడీపీ అస్థిత్వం కాపాడుకోవాలన్నా కూడా జనసేన సహా కాపుల నుంచి డిమాండ్లు ఎన్ని వచ్చినా టీడీపీ అంగీకరించి తీరాల్సిందే అంటున్నారు. సో ఏపీలో పవన్ సీఎం అవడానికే ఏ కొత్త రాజకీయం అయినా ఏ కొత్త కదలిక అయినా దారి తీస్తుంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి.