Begin typing your search above and press return to search.

పవన్ ను తిట్టటంలో తగ్గని పేర్ని నాని.. లాజిక్ మిస్ అయ్యారా?

By:  Tupaki Desk   |   15 March 2022 3:17 AM GMT
పవన్ ను తిట్టటంలో తగ్గని పేర్ని నాని.. లాజిక్ మిస్ అయ్యారా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి నాలుగు మాటలు వచ్చినంతనే.. తగదునమ్మా అంటూ తెర మీదకు వచ్చేవారిలో ఏపీ మంత్రి పేర్ని నాని ఒకరు. మిగిలిన వారి కంటే పవన్ ను నాలుగు మాటలు ఎక్కువగా అనేసే అలవాటు ఉన్న పేర్ని.. తాజాగా జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జనసేన తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ వేళలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన బహిరంగ జరిగిందో లేదో.. పవన్ కల్యాణ్ మాటలకు కౌంటర్ ఇచ్చేందుకు ఉత్సాహంగా మీడియా ముందుకు వచ్చేశారు పేర్ని నాని.

అందరికి నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారంటూ లాజిక్ కు ఏ మాత్రం అందని విమర్శ చేసి అడ్డంగా బుక్ అయ్యారు. బహిరంగ సభలో మిగిలిన రాజకీయ పార్టీల అధినేతలకు భిన్నంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే పార్టీలు.. వారి అధినేతలకు నమస్కారం పెట్టిన పవన్ చిరుకు పెట్టకపోవటానికి కారణం.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటం. ఆయన మరే పార్టీలోనూ లేకపోవటం. ఆ మాటకు వస్తే.. తన తల్లిదండ్రులకు నమస్కారం పెట్టేలేదు. నిజానికి అవసరం లేదు. ఎందుకంటే.. పవన్ చేసిన వ్యాఖ్యలు.. కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే సంబంధించింది.

అందరికి నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తాను ఏ మాత్రం ఆమోదించని వైసీపీకి కూడా నమస్కారం పెట్టి.. తన సంస్కారాన్ని తెలియజేశారు. అదే విషయాన్ని పవన్ తన మాటల్లో కూడా చెప్పారు. పవన్ ఎపిసోడ్ లో ప్రతిసారీ ఏదోలా చిరంజీవి ప్రస్తావన తేవటం ద్వారా తానేదో తెలివైనోడిగా ఫీల్ అవుతున్న పేర్ని నాని.. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా తనకు మైనస్ అవుతుందన్న సత్యాన్ని ఆయన ఎప్పుడూ తెలుసుకుంటారో?

చిరంజీవి లేకుంటే పవన్ ఎక్కడ ఉండేవాడని సూటిగా ప్రశ్నించిన పేర్ని నాని.. ఆయనకు పవన్ ఎందుకు నమస్కారం పెట్టలేదంటూ అర్థం లేని విమర్శ చేస్తూ అభాసుపాలవుతున్న తీరు అయ్యో పాపం అనేలా మారిందని చెప్పాలి.

తాను పార్టీ పెట్టిందే ప్రశ్నించటానికి అంటున్న పవన్ 2014 నుంచి 2019 వరకు ఎందుకు ప్రశ్నించలేదన్న ప్రశ్నను సంధించిన తీరును చూస్తే.. ఆ కాలంలో పేర్ని నాని రాజకీయాలకు దూరంగా ఉన్నారా? అన్న సందేహం రాక మానదు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాల మీద ఆయన గొంతు విప్పటం.. దానికి ప్రతిగా చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకున్న వైనాలు చాలానే ఉన్నాయన్న విషయాన్ని ఎలా మర్చిపోతారని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చకూడదన్న ఉద్దేశం పవన్ కు ఇప్పుడే ఎందుకు కలిగిందో చెప్పాలని పవన్ ను ప్రశ్నించిన పేర్ని నాని మాటల్ని వింటే పిల్లాడైనా సరే మరింత బాగా మాట్లాడతారన్న భావన కలుగక మానదు. ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని పేర్ని నాని లాంటి వారికి అర్థమైనా.. అర్థం కానట్లుగా మాట్లాడుతున్న వేళ.. తాను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించటమే తన లక్ష్యమన్న విషయాన్ని పవన్ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. అర్థం లేని ప్రశ్నలు వేస్తూ అభాసుపాలు అవుతున్న పేర్ని నానిని చూస్తే.. అయ్యో అనకుండా ఉండలేం.