Begin typing your search above and press return to search.

పాలమూరులో హత్యా యత్న రాజకీయాల కలకలం

By:  Tupaki Desk   |   3 March 2022 3:36 AM GMT
పాలమూరులో హత్యా యత్న రాజకీయాల కలకలం
X
పాలమూరు (మహబూబ్ నగర్) రాజకీయాలు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఇంతకాలం ఓ ప్రజాప్రతినిధి కిడ్నాప్ లు చేయిస్తున్నారంటూ ఆరోపణలు రావడం, బీజేపీ నేతలు వాటిని మీడియా సమావేశాల్లో ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఈ విషయం కొంతకాలం క్రితమే సోషల్ మీడియాల్లో హల్ చల్ చేసింది. అయితే, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మాత్రం ఎక్కలేదు. బీజేపీ నేతలు మీడియా సమావేశాల్లో చెప్పినా.. అది అక్కడివరకే పరిమితమైంది. ప్రత్యేకించి దీనిమీద కథనాలు గానీ ఏమీ రాలేదు. అయితే, కొన్నాళ్లుగా జిల్లాలో వ్యక్తుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. వీరిని ఎత్తుకెళ్లింది ఎవరు? ఎందుకు? అసలేం జరిగింది? అనేది మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.

తాజాగా జిల్లా ముఖ్య నేత హత్యకు కుట్ర పన్నారంటూ కొందరిని అరెస్టు చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతుంది. అంతేకాక వీరిలో కొందరికి బీజేపీ రాష్ట్ర కీలక నాయకుడు అయిన ఒకరి సంబంధీకులు ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు పేర్కొనడం రాజకీయంగా రేపటినుంచి మరింత దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం పాలమూరు ప్రశాంత జిల్లానే.

మూడు దశాబ్దాల క్రితం జడ్చర్ల కేంద్రంగా సాగిన దాడుల రాజకీయాలు సమసిపోయాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పడు నడిగడ్డగా పేరుగాంచిన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే హత్యా రాజకీయాలు సాగేవి. అయితే, జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో మాత్రం ఇందుకు పెద్దగా అవకాశం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అక్కడా ప్రత్యర్థులను దెబ్బతీసే రాజకీయాల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది.

ఆ ప్రజాప్రతినిధి సోదరుడి వల్లేనా? జిల్లా నేత సోదరుడు జిల్లాలో ఇటీవల చాలా క్రియాశీలంగా ఉంటున్నారు. ఆయన హవా అధికంగా సాగుతోంది. ఆరోపణలు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి. భూ ఆక్రమణలతో పాటు సోదరుడి పదవిని అడ్డుగా పెట్టుకుని ఇతర దందాలు యథేచ్ఛగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఈ నేపథ్యమూ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కాగా, ప్రగతి పనుల విషయంలో జిల్లా ప్రజాప్రతినిధి చురుకుగానే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఆయన ఈ విషయంలో చెప్పుకోదగ్గ పేరే ఉంది. కానీ, స్థానికంగా నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అయితే, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయి పదవుల్లో క్రియాశీలం ఉండడంతో రాజకీయంగా ప్రజా ప్రతినిధికి సవాళ్లు ఎదురవుతున్నాయి.

దశాబ్దాలుగా రాజకీయాల్లో పాతుకుపోయి ప్రభావశీలంగా ఉన్న అలాంటివారిని తట్టుకోవాలంటే కూడా ఈ స్థాయి ప్రతిఘటన అవసరం అని తెలుస్తోంది.

బీజేపీ నేతల ప్రమేయంపై పోలీసుల పరిశీలన జిల్లా ప్రజాప్రతినిధి హత్యకు కుట్ర పన్నారంటూ హైదరాబాద్ పోలీసులు బుధవారం కొందరిని అరెస్టు చేయడం.. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశం అవుతోంది. వారి ప్రమేయం గురించి కూడా ఆరా తీస్తామని పోలీసులు చెప్పడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఈ ఇద్దరు కూడా చిన్న స్థాయి నేతలు ఏమీ కాదు. ఒక మహిళా నేత కుటుంబం అయితే 70 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది.

వారి తండ్రి, సోదరులూ చాలాసార్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మహిళా నేత సైతం ఉమ్మడి రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ వచ్చాక సైతం ఆమె మరింత కీలకంగా ఉన్నారు. జాతీయ పార్టీలో చేరి జాతీయ స్థాయి పదవిని చేపట్టారు. ఇక మరో నేత ప్రముఖ వ్యాపారవేత్తనే కాక, ఢిల్లీ స్థాయిలో రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవారు. జిల్లా ప్రజాప్రతినిధి హత్యకు కుట్ర పన్నారంటూ అరెస్టు చేసిన నిందితులకు ఢిల్లీలో ఆయనకు చెందినవారు ఆశ్రయం ఇచ్చారంటూ పోలీసులు చెప్పడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే రానురాను ఈ విషయం తెలంగాణలోని అధికార టీఆర్ ఎస్, దూకుడు మీదున్న బీజేపీ మధ్య తీవ్ర స్థాయి రాజకీయ సంఘర్షణకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.