Begin typing your search above and press return to search.

పీకే కారణంగానే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశాడట

By:  Tupaki Desk   |   18 March 2022 4:17 AM GMT
పీకే కారణంగానే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశాడట
X
గతంలో మరెప్పుడూ లేనంత సంక్షోభంలో కూరుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. కష్టాలు కొత్త కానప్పటికీ.. ఇప్పుడున్న గడ్డు పరిస్థితి ఇంతకు లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. వరుస పెట్టి వచ్చి పడుతున్న ఓటములు.. నాయకత్వ లేమి.. నిర్ణయాలు తీసుకోవటంలో జరుగుతున్న తప్పులు.. పార్టీ అంతర్గత సంక్షోభాలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి వేళ.. పార్టీని దెబ్బ తీసే పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. తాను కాంగ్రెస్ పార్టీని వీడటం పై సంచలన వ్యాఖ్యలు చేశారు షాట్ గన్ శత్రేఘ్న సిన్హా. జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాను కాంగ్రెస్ ను విడిచిపెట్టి తృణముల్‌ కాంగ్రెస్‌ లో చేరటానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్న విషయాన్ని బయటపెట్టారు. తాను పార్టీ మారే విషయంలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా.. పీకేలు కీలక పాత్ర పోషించారన్నారు.

ఇప్పుడు తన ఫోకస్ అంతా తృణముల్‌ కాంగ్రెస్‌ మీదనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో ముంగిట్లో ఉందన్న ఆయన.. అంతకుమించి తాను విమర్శలు చేయటం ఇష్టం లేదన్నారు.

అంతేకాదు.. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చానన్న విషయాన్ని త్వరలోనే చెబుతానని చెప్పిన శతుఘ్న సిన్హా మాటల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఆ పార్టీకి మరిన్ని సమస్యలు సిద్ధంగా ఉన్నాయన్న విషయం అర్థం కాక మానదు.

షాట్ గన్ తాజా వ్యాఖ్యలు విన్నవేళ.. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయటంలో పీకే కీలక భూమిక పోషించిన వైనం అర్థం కాక మానదు. ఇదిలా ఉండగా.. త్వరలో జరిగే అసన్ సోల్ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా శతుఘ్న సిన్హాను బరిలోకి దింపుతున్నట్లుగా మమతా బెనర్జీ ప్రకటించటం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టటానికి దారి తీసిన పరిస్థితులపై షాట్ గన్ పేల్చే తూటాలు కాంగ్రెస్ లో మరెన్ని ప్రకంపనలు రేపుతాయో చూడాలి.