Begin typing your search above and press return to search.

రాజు గారి పవన్ మోజు...?

By:  Tupaki Desk   |   8 March 2022 12:30 AM GMT
రాజు గారి పవన్ మోజు...?
X
వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు త్వరలో మాజీ అవుతాను అంటున్నారుట. అయితే తిరిగి ఎంపీగా గెలిచేందుకు కూడా ఆయన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. తాను వైసీపీ టికెట్ మీద ఎంపీ అయ్యాను కాబట్టి తన మీద అనర్హత వేయించాలని చూస్తున్న హై కమాండ్ ఆశలు సాగనీయకుండా ఆయన చేయాల్సింది అంతా చేస్తున్నారు. ఇక రాజు గారి విషయంలో వైసీపీ ప్రయత్నాలు తెర వెనక గట్టిగానే ఉన్నాయని అంటున్నారు. మరో నాలుగు రోజుల వ్యవధిలో వచ్చే ఉత్తరాది ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ వైసీపీకి మరింత దగ్గర అవుతుంది అంటున్నారు.

దాంతో బీజేపీలోకి వెళ్లాలనుకుంటున్న రాజు గారి ఆశలకు కూడా బ్రేకులు పడతాయని అంటున్నారు. బీజేపీలోకి రాజుని చేర్చుకోవాలని ఆ మధ్యదాకా అనుకున్న కమలనాధులు ఇపుడు దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీతో బలమైన స్నేహాన్ని కోరుకుంటున్నారు. దాంతో వైసీపీకి బద్ధ విరోధిగా మారిన రాజుని బీజేపీలోకి తీసుకునే సీన్ అయితే లేదని తాజా టాక్.

అందుకే రాజు గారి రాజీనామా వ్యవహారం కూడా లేట్ అవుతోంది అంటున్నారు. ఇక రాజు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ లో రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఏప్రిల్ 8తో ముగిసే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలే వైసీపీ ఎంపీగా ఆయనకు చివరివి అంటున్నారు. ఆ తరువాత ఏ క్షణం అయినా రాజీనామా చేస్తారు అని చెబుతున్నారు

ఇక బీజేపీలో చేరాలన్నది రాజు గారి ఆలోచన. కానీ బీజేపీ కనుక చేర్చుకోకపోతే ప్లాన్ బీని కూడా రెడీగా ఉంచుకున్నారని టాక్. ఆయన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనలో చేరి నర్సాపురం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. అయితే దీనికి జనసేన ఎంతవరకూ అవకాశం ఇస్తుందో చూడాలి. అయితే బీజేపీకి మిత్రుడిగా ఉంటూనే జగన్ ని గట్టిగా ఎదిరిస్తున్న పవన్ పార్టీలో చేరడం వల్ల మొత్తానికి మొత్తం మద్దతు తనకు దక్కుతుంది అని రాజు గారు స్కెచ్ వేస్తున్నారుట.

అలా కనుక చూస్తే రాజు గారి రాజీనామా ఖాయమని చెబుతున్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరిగే టైమ్ లోనే నర్సాపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరిగేలా ఆయన రాజీనామా ఉంటుంది అంటున్నారు.

ఏది ఏమైనా నర్సాపురం లో రాజు గారు జగన్ మీద తొడగొట్టి మరీ నిలబడతారని అంటున్నారు. గెలుపు కూడా తనదే అని ఆయన ఢంకా భజాయిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.