Begin typing your search above and press return to search.

ఇదంతా ఎందుకు కానీ.. బీజేపీలో చేరే మాట చెప్పేస్తే సరిపోదా రాజగోపాల్?

By:  Tupaki Desk   |   17 March 2022 5:28 AM GMT
ఇదంతా ఎందుకు కానీ.. బీజేపీలో చేరే మాట చెప్పేస్తే సరిపోదా రాజగోపాల్?
X
అన్ని తెలుస్తుంటాయి. కానీ.. చెప్పలేని పరిస్థితి. అలాంటి ఇబ్బంది ఎలా ఉంటుందో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఇంచుమించు అలానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే.. ఆయన ఇబ్బంది అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ లో కుదురుగా ఉండలేరు. అలా అని సరైన కారణం చూపించి కాని వెళ్లలేరు. తాను పార్టీ మారే విషయానికి సంబంధించి బలమైన కారణం చూపిస్తే తప్పించి.. పార్టీ మార్పు సులువు కాదు. అందుకే.. ఆయన కిందా మీదా పడుతూ.. కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేందుకు అవసరమైన గ్రౌండ్ వర్కును ప్రిపేర్ చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఆయన తాజా వ్యాఖ్యల్ని చూడాలంటున్నారు. తాజాగా కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన వేళలో.. తన మీద మాటల దాడికి దిగిన గులాబీ దండుపై పోరాడేందుకు తమ పార్టీకి చెందిన వారు ఎవరూ రాలేరన్న ఆవేదనను ఆయన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఏ పార్టీకైనా తాను సపోర్టు చేస్తానని.. సొంత పార్టీలోనే ఆదరణ కరువైందని ఆయన చెబుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో పని చేసి ధైర్యం.. పేరున్న వారిని ముందు పెడితేనే కాంగ్రెస్ లో జోష్ వస్తుందన్న ఆయన.. అడ్రస్ లేని.. డిపాజిట్ రాని వారిని ముందు పెట్టి కొట్టాడమంటే ఎలా కొట్లాడతారని ప్రశ్నించారు.

ఇదంతా ఎందుకన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. గౌరవం ఇవ్వని చోట తాను ఉండలేనని.. ఎవరి కింద పని చేయలేనని చెప్పిన ఆయన.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

అంతలోనే తన కార్యకర్తల్ని ఒప్పించి అందరి ఇష్టప్రకారం తాను తుది నిర్ణయం తీసుకుంటానని.. తనను నమ్మిన వారికి అన్యాయం జరగదన్న రాజగోపాల్ మాటలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా చూస్తే.. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లటానికి అవసరమైన గ్రౌండ్ సిద్ధం చేసుకుంటారని చెప్పక తప్పదు.

పార్టీలో ఉండి నిందల మీద నిందలు వేసే కన్నా.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసి కాషాయ కండువ కప్పుకుంటే సరిపోతుంది కదా? అదేమీ చేయకుండా ఈ మాటలు మరెంత కాలం చెబుతారు రాజగోపాల్? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.