Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డ‌న్న న‌మ‌స్తే: రేవంత్‌

By:  Tupaki Desk   |   12 March 2022 6:39 AM GMT
జ‌గ్గారెడ్డ‌న్న న‌మ‌స్తే: రేవంత్‌
X
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జ‌గ్గారెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంతలా వైరం ముదిరింద‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. రేవంత్‌పై తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై అసంతృప్తితో జ‌గ్గారెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే విష‌యం తెలిసిందే. రేవంత్ అంటేనే చాలు జ‌గ్గారెడ్డి కోపంతో ఊగిపోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. అలాంటిది ఆ ఇద్ద‌రు నేత‌లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌లుస్తార‌ని ఎవ‌రైనా అనుకుంటారా? కానీ అది జ‌రిగింది. కేవ‌లం క‌ల‌వ‌డ‌మే కాదు 20 నిమిషాల పాటు ప్ర‌త్యేకంగా భేటీ కూడా అయ్యారు. అవును.. ఇది నిజ‌మే. రాజ‌కీయాల్లో ఉండే మ్యాజిక్కే ఇది అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అనుకోకుండానేనా?
రేవంత్ రెడ్డి, జ‌గ్గారెడ్డి అనుకోకుండా క‌లిశారా? లేదా దాని వెన‌క ఏమైనా అంత‌రార్థం ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. శుక్ర‌వారం సీఎల్పీ కార్యాల‌యానికి రేవంత్ వ‌చ్చారు. అప్పుడు అక్క‌డ కేవలం జ‌గ్గారెడ్డి మాత్ర‌మే ఉన్నారు. దీంతో జ‌గ్గారెడ్డ‌న్న న‌మ‌స్తే అంటూ రేవంత్ ప‌ల‌క‌రించారు. అప్పుడు కుర్చీలో నుంచి లేచి నిల‌బ‌డ్డ జ‌గ్గారెడ్డి న‌వ్వుతూ రేవంత్‌తో చేతులు క‌లిపారు. ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత ప‌క్క గ‌దిలోకి వెళ్లి 20 నిమిషాల పాటు ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. దీంతో ఇద్ద‌రూ క‌లిసిపోయిన‌ట్లేనా? అని విలేక‌ర్లు అడ‌గ‌గా.. తాము విడిపోతేనే క‌దా క‌లిసిపోవ‌డానికి? ఏం జ‌గ్గారెడ్డ‌న్న‌? అని రేవంత్ బ‌దులిచ్చారు.

కలిసి ప‌నిచేస్తారా?
తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన ఎంపీ రేవంత్ రెడ్డిని మొద‌టి నుంచి జ‌గ్గారెడ్డి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఇక రేవంత్‌ను తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా అధిష్ఠానం నియ‌మించ‌డంతో త‌న అసంతృప్తిని జ‌గ్గారెడ్డి బ‌య‌ట‌పెట్టారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న రేవంత్‌కు దూరంగానే ఉన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ దారుణ ఫ‌లితాల‌కు రేవంత్ కార‌ణ‌మంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత త‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌డం లేదంటూ రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అదే కార‌ణంతో పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌కటించి ఆ త‌ర్వాత నిర్ణ‌యాన్ని వాయిదా వేశారు.

ఆ త‌ర్వాత రేవంత్‌, జ‌గ్గారెడ్డి క‌ల‌వ‌డం ఇదే తొలిసారి. మ‌రి ఇప్పుడు వాళ్లు ప్ర‌త్యేకంగా ఏం మాట్లాడుకున్నార‌నేది? ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌గ్గారెడ్డి త‌న రాజీనామా నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటార‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు హైక‌మాండ్ నుంచి కూడా ఆయ‌న‌కు హెచ్చ‌రిక‌లు అందాయ‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో రేవంత్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు జ‌గ్గారెడ్డి ఓకే అంటారా? అన్న‌ది చూడాలి. రేవంత్ కూడా అదే విష‌యంపై జ‌గ్గారెడ్డిని శాంత‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్న జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.