Begin typing your search above and press return to search.

భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉంటాయో చూపిస్తున్న ఉక్రెయిన్ - రష్యా వార్

By:  Tupaki Desk   |   7 March 2022 4:29 AM GMT
భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉంటాయో చూపిస్తున్న ఉక్రెయిన్ - రష్యా వార్
X
ఒకప్పుడు ఒకే దేశంగా ఉండి.. తర్వాతి కాలంలో విడిపోయి.. ఎవరి దారిన వారు బతుకుతున్న వేళ.. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుంది? అనే దానికి సమాధానంగా ఉక్రెయిన్ - రష్యాలను చూపించొచ్చు. ఉక్రెయిన్ తీరును తప్ప పడుతూ.. ఆ దేశం యూరోపియన్ సమాజంతో చేతులు కలపటాన్ని జీర్ణించుకోలేని రష్యా దాడులకు తెగబడటం తెలిసిందే. ఉక్రెయిన్ మీదకు సైనిక చర్య చేపడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి నేటికి పన్నెండు రోజులైంది.

అంచనాలకు భిన్నంగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా దాడులకు తనదైన శైలిలో సమాధానం చెబుతోంది ఉక్రెయిన్. తన దగ్గర యుద్ధ విమానాలు.. ఆయుధాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికి రష్యా దాడులకు జరిగే నష్టానికి ఇబ్బందులకు గురి అవుతూనే.. తగ్గేదేలె అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై అధిక్యతతో పాటు.. పట్టును సాధించే ప్రయత్నాలు చేస్తున్న రష్యా సేనలు.. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు విన్న వారంతా రష్యా సైనికుల రాక్షసత్వం మరీ ఈస్థాయిలో ఉంటుందా? అన్న భావన వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికాతో సహా నాటో కూటమి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. చేయాల్సినంత తీవ్రంగా చేయకుండా కొన్ని చర్యలతో మమ అనిపిస్తున్నారు. తాజాగా రష్యాలో అమెరికా పేమెంట్ సంస్థలైన వీసా.. మాస్టర్ కార్డులు తమ కార్యకలాపాల్ని నిలిపేస్తున్నట్లుగా ప్రకటించాయి. దీంతో.. రష్యాలో కార్డు చెల్లింపులు బంద్ అయ్యాయి. రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవల్ని పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని వెల్లడించారు.

ఇదే తరహాలో రష్యాపై మరిన్ని ఆంక్షల్ని తీసుకొచ్చి ఆ దేశాన్ని ఉక్కరిబిక్కిరి చేయాలన్న ఆలోచనలో అమెరికా అండ్ కో దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజా యుద్ధాన్ని చూస్తే.. రాబోయే రోజుల్లో జరిగే యుద్ధాలకు ఇదో శాంపిల్ అవుతుందని చెబుతున్నారు. ఒకవైపు సైనికులు.. మరోవైపు గగనతలం నుంచి దాడులు జరుగుతున్న వేళలో.. రెండు దేశాల మధ్య డిజిటల్ యుద్ధం మొదలైంది. రష్యాకు షాకులు ఇచ్చేందుకు వీలుగా ఉక్రెయిన్ తన సైబర్ వార్ ను ముమ్మరం చేసింది.

ఇందుకోసం ఉక్రెయిన్ కు చెందిన వందలాది మంది హ్యాకర్లు సైన్యంగా మారి యుద్ధం చేయటానికి తమకు తాముగా ముందుకు వస్తున్నారు. యువకులు డిజిటల్ ఆర్మీగా మారి.. రష్యా దాడులను నిలువరించటమే కాదు..కొన్ని సందర్భాల్లో వారికి షాకులు ఇస్తున్నారు. రష్యాకు చెందిన వెబ్ సైట్లను బ్లాక్ చేయటం.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైబర్ ఆర్మీకి ధీటుగా రష్యా సైతం తాజాగా తన సైబర్ ఆర్మీని రంగంలోకి దింపింది. రష్యా హ్యాకర్లు ఈ మొయిల్స్ ద్వారా మాల్ వేర్ లు పంపటం.. ఇంటర్నెట్ వ్యవస్థల్ని స్తంభించపచేయటం లాంటివి చేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య మొదలైన డిజిటల్ యుద్దం.. ఉక్రెయిన్ చెంతనే ఉండే యూరోప్ దేశాలకు కొత్త తరహా ఇబ్బందుల్ని తీసుకొస్తున్నాయి. ఈ యుద్దాన్ని చూస్తే.. రానున్న రోజుల్లో వార్ ఎలా ఉంటుందన్న విషయం అర్థం కాక మానదు.