Begin typing your search above and press return to search.

న్యూక్లియర్ వార్ 'వాకిట్లో'నే.. అంతా నాశనమేనా?

By:  Tupaki Desk   |   2 March 2022 2:30 AM GMT
న్యూక్లియర్ వార్ వాకిట్లోనే.. అంతా నాశనమేనా?
X
రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ టార్గెట్ గా రష్యా సైన్యం దూసుకొస్తోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో బాంబుల మోత మోగుతోంది. అయితే యుద్ధంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించుకున్నారు. కానీ చర్చలు అసంపూర్ణం కావడం వల్ల పోరు కొనసాగుతూనే ఉంది. అయితే ఇది కాస్తా అణ్వాయుధాల వినియోగం వరకు పోతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ దేశాలు యుద్ధం విరమించుకోవాలని సూచిస్తున్నాయి.

ఈ యుద్ధంలో రష్యా తీరును ఇప్పటికే చాలా దేశాలు తప్పుబడుతూ వస్తున్నాయి. అంతేకాకుండా నాటో దేశాలు కూడా ఒక్కొక్కటిగా మద్దతు పలుకుతున్నాయి. అవసరమైన ఆయుధ, మానవతా సాయం చేస్తామని అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటే భవిష్యత్ లో ఎన్నడూ ఊహించని రీతిలో పరిణామాలు ఉంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాస్తా.. ప్రపంచ అణు యుద్ధంగా పరిణమించే అవకాశాలున్నాయని వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పుతిన్ భయపెట్టే ప్రకటనతో గందరగోళానికి గురవుతున్నాయి. ఒకవేళ న్యూక్లియర్ బాంబులు ఉపపయోగిస్తే... ప్రపంచ దేశాలు సర్వ నాశనమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. జీవకోటిపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. రేడియన్ వల్ల మనుషులు, జంతువులు, మొక్కలు అన్నీ నాశనమవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గాలి, నీరు, నేల పూర్తిగా విషపూరితం అవుతుందని అంటున్నారు. 1945లో హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి చేసింది. నేటికీ అక్కడ రేడియన్ ప్రభావం చూపుతోంది. అయితే అప్పటికన్నా ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు మరింత శక్తివంతంగా తయారయి ఉండవచ్చునని... ఇప్పుడు వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అమెరికా, రష్యా, ఇండియా, చైనా, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, బ్రిటన్ వంటి దేశాల్లో అణుబాంబులు ఉన్నాయని సమాచారం. అయితే ఈ ఉక్రెయిన్-రష్యా దేశాల వార్... అణ్వయుధాలు వాడేదాకా వస్తే... ఇందులోని చాలా దేశాలు తమ ఆయుధ సంపత్తిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించకపోయినా... ఒక ప్రాంతానికి పరిమితమైనా కూడా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రేడియేషన్ వల్ల ఓజోన్ పొర కరిగిపోతుందని... ఫలితంగా అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడతాయి.

మనుషులు, జంతువులకు అనేక రకాల వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా వాతావారణం అంతా విషపూరితంగా మారుతుంది. సూర్యరశ్మిని ధూళికణాలు అడ్డుకుంటాయి. న్యూక్లియర్ వింటర్ వచ్చే అవకాశం ఉంది. పర్యావరణమంతా స్మోక్ తో నిండిపోతుంది. కాబట్టి ఆయా దేశాలు సంయమనం పాటించాలని అంతర్జాతీయ స్థాయిలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యూక్లియర్ బాంబుల వాడకం దాకా పరిస్థితి తీసుకురావద్దని సూచిస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్ దేశాలు యుద్ధం విరమింపజేసి... చర్చలు చేసుకోవాలని ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇదివరకే చెప్పారు. శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. వివిధ దేశాలు కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా దురాక్రమణను తప్పుబడుతున్నాయి. అయినా కూడా రష్యా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ టార్గెట్ గా దూసుకుపోతోంది.