Begin typing your search above and press return to search.

సోనియాతో సయోధ్య కుదురుతోందా ?

By:  Tupaki Desk   |   23 March 2022 7:35 AM GMT
సోనియాతో సయోధ్య కుదురుతోందా ?
X
జీ 23 నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సయోధ్య కోరుకుంటున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మూడు రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రంగా దుమారం రేపిన జీ 23 నేతలు విడివిడిగా సమావేశమవుతున్నారు. ఎవరు సోనియాతో భేటీ అయినా అంతిమంగా తమ విధేయతను ప్రకటిస్తుండటం విచిత్రంగా ఉంది.

పార్టీ బలోపేతమే తమకు కావాల్సింది కానీ నాయకత్వ మార్పు కాదంటున్నారు. సోనియా నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందన్న ఆశాభావాన్ని సీనియర్ నేతలు ప్రకటిస్తుండటం గమనార్హం. రాజ్యసభ ఎంపీ ఆనందశర్మ, లోక్ సభ సభ్యుడు మనీష్ తివారి సోనియాతో భేటీ అయ్యారు. అంతకుముందు గులాంనబీ ఆజాద్ కూడా భేటీ అయిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో మరింతమంది జీ 23 నేతలు సోనియాతో భేటీకి అపాయిట్మెంట్ తీసుకున్నారు.

పార్టీ బలోపేతానికి సీనియర్ల నుండి సలహాలు, సూచనలు తీసుకోవటానికి సోనియా సుముఖంగా ఉండటంతో వీళ్ళ భేటీలు జరుగుతున్నాయి. నిజానికి వీళ్ళెప్పుడు వెళ్ళినా సోనియా కాదనకుండా మాట్లాడుతునే ఉన్నారు. అయితే పార్టీ ఉచ్ఛస్ధితిలో ఉన్నపుడు అపరిమితమైన అధికారాలను అనుభవించిన వీళ్ళు ఇపుడు సంక్షోభానికి గాంధీ కుటుంబానిదే బాధ్యతని నిందలు వేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఇందుకనే మెజారిటి నేతలు జీ 23 నేతలపై మండిపోతున్నారు.

మొత్తానికి ఇటు సోనియా నుండి ముందడుగు పడటం, అటు సీనియర్లు కూడా వాస్తవాలను గ్రహించటంతో సయోధ్యకు మార్గం ఏర్పడింది. ముందు పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కనపెట్టేస్తే పార్టీ దానంతట అదే బలపడుతుందనేది మరికొందరు సీనియర్ల విశ్లేషణ. అందుకనే సీనియర్లంతా కలిసి తమలోని విభేదాలపై మనసువిప్పి మాట్లాడుకునేందుకు వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే చాలామంది సీనియర్లు సోనియాతో భేటీ అవుతున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలను సర్దుబాటు చేసుకోవటం మంచిదే కదా.