Begin typing your search above and press return to search.

అన్నకే అధ్యక్ష‌ పీఠం.. తమ్ముడుకి షాకేనా... ?

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 AM GMT
అన్నకే అధ్యక్ష‌ పీఠం.. తమ్ముడుకి షాకేనా... ?
X
శ్రీకాకుళం జిల్లాలో మొదటి నుంచి పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న ధర్మాన క్రిష్ణ దాస్ జగన్ చలువతో ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలకమైన రెవిన్యూ శాఖను కూడా ఆయనకు అప్పగించారు. ఇక ఇపుడు మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు పదవి దక్కదు అని స్పష్టమైన సమాచారం అయితే ఉందిట. దాంతో ఆయనకే మరోమారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు.

వైసీపీ ఏర్పాటు వేళ జిల్లా బాధ్యతలను క్రిష్ణ దాస్ చూసేవారు. అ తరువాత కొన్నాళ్ళు ఆయన సతీమణి పద్మావతి కూడా వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి 2004లో గెలిచి 2009లో రెండవమారు విజయం సాధించిన క్రిష్ణ దాస్ జగన్ తో పాటే కాంగ్రెస్ నుంచి మొదట బయటకు వచ్చేశారు.

దాంతో జగన్ కి ఆయన అంటే ఒక నమ్మకం, అభిమానం అని అంటారు. అందుకే అధికారంలోకి వస్తూనే ఆయనకే మంత్రి పదవి కట్టబెట్టారని చెబుతారు. ఇక 2014 ఎన్నికల ముందు మాత్రమే ఆయన తమ్ముడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరారు. మొత్తానికి ప్రసాదరాఉ మంత్రిగా వివిధ శాఖలను చూసిన సీనియర్ అయితే కావచ్చు కానీ జగన్ మాత్రం ఓటు ఎపుడూ క్రిష్ణ దాస్ కే వేస్తూ వచ్చారు.

ఇపుడు కూడా మార్పుచేర్పులలో క్రిష్ణ దాస్ కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దాంతో కొత్త మంత్రి ఎవరు అన్న చర్చ అయితే వైసీపీలో వస్తోంది. ఇదే జిల్లాకు రెండవ మంత్రిగా సీదరి అప్పలరాజు ఉన్నారు. ఆయనకు సామాజిక వర్గం పరంగా ప్లస్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే వైసీపీలో గోదావరి జిల్లాలో మరొకరు ఉన్నా అక్కడ ఉన్న సామాజిక, రాజకీయ సమీకరణల కారణంగా ఆయనకు మంత్రి పదవికి ఇవ్వకపోవచ్చు. అదే టైమ్ లో ఈ రకమైన కాస్ట్ ఈక్వేషన్స్ వల్లనే సీదరికి మంత్రి పదవి గ్యారంటీ అని అంటున్నారు. దానికి ఉదాహరణగా ఈ మధ్య జగన్ ఆయనకు మరిన్ని కొత్త శాఖలను అప్పగించడం, శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వడం వంటివి చూసిన వారి సీదరి వెరీ లక్కీ అంటున్నారు.

అంటే ఒక జిల్లాకు ఒకే మంత్రి పదవి వంతున కేటాయిస్తున్న నేపధ్యంలో ధర్మాన క్రిష్ణదాస్ పార్టీ సేవకు వెళ్తారు, సీదరి ప్రభుత్వంలో ఉంటారు అన్న మాట. ఇదీ వైసీపీ పెద్దల పక్కా లెక్క అంటున్నారు. మరి మంత్రి పదవి కోసం కోటి ఆశలు పెట్టుకున్న తమ్ముడు, సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు సంగతేంటి అంటే ఆయనకు ఈసారీ కూడా సారీ చెప్పేస్తారు అని అంటున్నారు.

అలాగే మంత్రి పదవి కోసం పరితపిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం కి కూడా అది దక్కే సీన్ అయితే లేదు అంటున్నారు. మొత్తానికి చూస్తే అన్నను పార్టీ ప్రెసిడెంట్ గా చేసి తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నాసిక్కోలులో సామాజిక సమీకరణలు అసలు సరిపోవు కాబట్టి ఎలా చూసుకున్నా తమ్ముడుకి ఈ సరికొత్త మార్పూ కూర్పూ అతి పెద్ద దెబ్బే అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.