Begin typing your search above and press return to search.

ఎవరీ సునీల్ కనుగోలు? ఇప్పుడెందుకు ఇంతలా చర్చగా మారాడు?

By:  Tupaki Desk   |   1 March 2022 3:19 AM GMT
ఎవరీ సునీల్ కనుగోలు? ఇప్పుడెందుకు ఇంతలా చర్చగా మారాడు?
X
‘సునీల్ కనుగోలు’.. తెలంగాణ రాజకీయ పక్షాలకే కాదు.. తెలంగాణ ప్రజలకు కొత్తగా పరిచయమైన పేరు. గడిచిన రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది సునీల్ పేరు. ఎందుకంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించేందుకు సిద్ధం కావటమే. తెలంగాణ రాష్ట్ర అధికారపక్షం టీఆర్ఎస్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ సేవల్ని వినియోగించుకునేందుకు ఆయనతో ఒప్పందం చేసుకుంటే.. దానికి బదులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సునీల్ ను వ్యూహకర్తగా నియమించుకుంది. అయితే.. అధికారికంగా మాత్రం ప్రకటించింది లేదు.

ఇంతకీ సునీల్ కనుగోలు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే.. రాజకీయ పార్టీలకు ఆయన పేరు పాపులర్. అలా అని ఒక మోస్తరు నేతలకు ఆయన పరిచయం కూడా పరిమితమే. రాజకీయ పార్టీ అధినేతలకు మాత్రం ఆయన గురించి తెలుసని చెబుతారు. పీకేకు అనుచరుడిగా.. ప్రధాన శిష్యుడిగా వ్యవహరించే సునీల్.. కొంతకాలం క్రితం ఆయన పీకే టీం నుంచి బయటకు వచ్చేశారు. తనకు తానుగా సొంతంగా పొలిటికల్ పార్టీలకు స్ట్రాటజిస్టుగా మారారు.

విజయవాడకు చెందిన సునీల్ కుటుంబం చెన్నైలో స్థిరపడినట్లుచెబుతారు. ప్రశాంత్ కిశోర్ ను ఎలా అయితే ‘పీకే’గా పిలుస్తారో.. సునీల్ కనుగోలును ‘ఎస్కే’ అనే పొట్టి పేరుతో పిలుస్తారు. ఉన్నత చదువులు చదివిన సునీల్.. అమెరికాలోని ప్రముఖ ఎంఎన్ సీ మెక్ కిన్సేలో పని చేశారు. అమెరికా నుంచి భారత్ కు వచ్చేసిన తర్వాత ఎన్నికల వ్యూహకర్త పీకేతో కలిసి గుజరాత్ కేంద్రంగా పని చేశారు.

2016లో పీకేతో విడిపోయిన ఆయన.. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే సంస్థను స్థాపించి.. లక్నో కేంద్రంగా పని చేశారు. అప్పట్లో అధికార బీజేపీకి ఈ సంస్థ అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. 2016, 2017లో జరిగినయూపీ.. ఉత్తరాఖండ్.. హిమాచల్ ప్రదేశ్.. గుజరాత్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తరఫున పని చేసిన ఆయన.. ఎక్కువ రాష్ట్రాల్లో కమలనాథులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేయటం సక్సెస్ అయ్యారని చెబుతారు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు డీఎంకే తరఫున పని చేసిన ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.

తెలుగు రాష్ట్రాలతో పరిచయం ఉండటం.. మిగిలిన రాష్ట్రాల రాజకీయాలకు భిన్నమైన తీరు తెలంగాణలో ఉండటం.. ఆ తేడా పీకే కంటే ఎస్కేకే బాగా తెలుసని అంటారు. అందుకే.. ఆయన్ను ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్ మొగ్గు చూపినట్లు చెబుతారు. ప్రస్తుతం మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్థ డైరెక్టర్ గా సునీల్ వ్యవహరిస్తున్నారు.

ఈ మధ్యనే కర్ణాటక కాంగ్రెస్ సైతం ఎస్కేను తమ రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నట్లు చెబుతారు. ఇప్పటికే కొన్ని పార్టీలకు తన సేవల్ని అందించిన సునీల్.. ఆయా పార్టీలను విజయతీరాలకు చేర్చినట్లుగా టాక్ వినిపిస్తూ ఉంది. పీకే టీంలో కీలకమైన వ్యక్తి కావటం.. తన వ్యూహాలు వర్కువుట్ అయినప్పటికీ.. పేరు మాత్రం పీకే సొంతం కావటం.. తన స్టేక్ కోసం పోరాడిన సునీల్.. తర్వాతి కాలంలో పీకే టీం నుంచి బయటకు వచ్చారని చెబుతారు.

తనను తాను ఫ్రూవ్ చేసుకోవటానికి.. తన సత్తా చాటేందుకు తెలంగాణ టాస్కు ఉపయోగపడుతుందని సునీల్ భావిస్తున్నట్లు చెబుతారు. ఇప్పటివరకు ఏ రాజకీయపార్టీకి సేవలు అందించినా.. ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తారన్న పేరున్న తన గురువు పీకే ఇమేజ్ ను మార్చే అవకాశం తెలంగాణ తనకు ఇచ్చినట్లుగా సునీల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.