Begin typing your search above and press return to search.

ప‌న్నుల వ‌సూళ్లే కొంపలు ముంచుతాయి ?

By:  Tupaki Desk   |   22 March 2022 6:32 AM GMT
ప‌న్నుల వ‌సూళ్లే కొంపలు ముంచుతాయి ?
X
అధికారుల న‌డ‌వ‌డి బాలేదు అని జ‌గ‌న్ కు చెప్పండి అని చాలా మంది విప‌క్ష స‌భ్యులు గ‌గ్గోలు పెడుతున్నారు.. ఎందుకో తెలుసా? ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

రాష్ట్రంలో ప‌న్నుల వ‌సూళ్ల‌న్న‌వి ఇది వ‌ర‌కు క‌న్నా క‌ఠిన‌త‌రం చేశారు. మొద‌టి రెండేళ్ల‌లో ఎటువంటి ప‌న్నుల వ‌సూళ్లూ లేకున్నా, క‌నీస ధ‌ర్మం పాటించి కొన్నింటి విష‌య‌మై మిన‌హాయింపు ఇచ్చినా అదంతా జ‌గ‌న్ స‌ర్కారు చేసిన మేలులో భాగ‌మే! కానీ ఇప్పుడు మూడు ద‌శ‌ల క‌రోనా త‌రువాత కోలుకుంటున్న కొన్ని రంగాల‌కు ప‌న్నుల బాదుడు మామూలుగా లేదు అని విప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తోంది. ముఖ్యంగా ఉత్ప‌త్తి రంగాన్నీ ముఖ్యంగా కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌నూ ఆదుకోవాల్సిన జ‌గ‌న్ స‌ర్కారు ఆ బాధ్య‌త‌ను మ‌రిచిపోయింది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ఆ విష‌యానికే వ‌స్తే అస్స‌లు ఆయా చ‌ర్య‌లు ఏవీ కూడా ఇందాక న‌మోదుకు నోచుకోలేదు అని తెలుస్తోంది.

ఈ ద‌శ‌లో పేద వ‌ర్గాల‌కు జ‌గ‌న్ ఇస్తున్న ఊతం పెద్ద‌గా ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదు అని కూడా అంటోంది విప‌క్షం. స్వ‌శ‌క్తిపై రాణించేందుకు అస్స‌లు ప్ర‌భుత్వ స‌హ‌కారం లేక‌పోగా ప‌న్నుల వ‌సూలు పేరిట కొన్ని వ‌ర్గాలకు వేధింపులే వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయ‌ని టీడీపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.అంతేకాదు చిన్న చిన్న బ‌డ్డీ కొట్టు నిర్వాహ‌కుల‌కు చెత్త ప‌న్ను బాదుడు మామూలుగా లేదు.

జిరాక్స్ షాపు నిర్వాహ‌కుడికి మున్సిప‌ల్ ప‌రిధిలో మూడు వంద‌లుగా నిర్ణ‌యించి వ‌సూలు చేస్తున్నారు.కిళ్లీ కొట్ట‌కు కూడా అంతే స్థాయిలో ప‌న్ను విధించిన దాఖ‌లాలు ఉన్నాయి.మందుల షాపున‌కు ఐదు వంద‌లు వ‌సూలు చేస్తున్నారు. మున్సిపాల్టీ ప‌రిధిలో ఉండే ఇళ్ల నుంచి సేక‌రించే చెత్త‌కు సంబంధించి పన్ను వంద రూపాయ‌లుగా నిర్ణ‌యించి వ‌సూలు చేస్తున్నారు.

ప‌న్నుల వ‌సూళ్ల‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించడం లేదు. ఎంత‌గా అవ‌గాహ‌న తీసుకువ‌చ్చినా కూడా వారెందుకో ఆస‌క్తి చూప‌డం లేదు. ఆస్తిపన్ను బ‌కాయిల వ‌సూలు కూడా ఇదే విధంగా ఉంది. ప‌న్నుల వ‌సూలు చేసినా మీరు అభివృద్ధి చేయ‌డం లేదు ఎందుక‌ని చాలా చోట్ల అధికారుల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు.దీంతో జ‌గ‌న్ స‌ర్కారు చాలా చోట్ల ఆదాయం ఆర్జించ‌డం క‌న్నా అపవాదుల‌ను మోసుకుంటూ వెళ్తోంది. ఇక చెత్త ను సేక‌రించే వాహ‌నాల డ్రైవ‌ర్ల‌కు రెండు నెల‌లుగా జీతాల్లేవు అని తెలుస్తోంది.

శ్రీ‌కాకుళం ప‌రిధిలో ప‌నిచేసే చాలా మంది పారిశుద్ధ్య కార్మికుల‌కు రెండు నెల‌లుగా జీతాల్లేవు అని సంబంధిత వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే మిగ‌తా వ‌ర్గాలు కూడా ప్ర‌భుత్వం విధిస్తున్న ఇత‌ర ప‌న్నుల‌పై కోపంగానే ఉన్నాయి. ఎన్న‌డూ లేనంత‌గా చెత్త ప‌న్ను ఎందుకు వ‌సూలు చేస్తున్నార‌న్న అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రిలో ఉంది.

మున్సిపాల్టీల‌లో చాలా చోట్ల చెత్త త‌ర‌లింపు రీ సైక్లింగ్ స‌రిగా లేన‌ప్పుడు ప‌న్నులు ఎలా వ‌సూలు చేస్తార‌ని ప్ర‌జ‌లు చాలా చోట్ల వైసీపీ నాయ‌కుల‌తో వాగ్వాదం ప‌డుతున్నారు. ఆదాయం ఆర్జ‌నే ధ్యేయంగా నాలా వ‌సూలు కానీ, నీటి తీరువా వ‌సూలు కానీ ఇప్పుడొక పెద్ద ప్ర‌హ‌స‌నంగానే ఉంది. వీటిపై కూడా ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆస్తుల జప్తులు సామానుల జ‌ప్తులు గ‌తంలోనే ఉన్నాయ‌ని బొత్స లాంటి మంత్రులు స‌మ‌ర్థించుకోవ‌డం కూడా ఇవాళ మ‌రో కొత్త వివాదానికి తావిస్తోంది.