Begin typing your search above and press return to search.

ఇరగదీసిన తెలంగాణ.. దేశంలోనే తిరుగులేని అధిక్యత.. క్రెడిట్ కేసీఆర్ ఖాతాలో

By:  Tupaki Desk   |   1 March 2022 10:33 AM GMT
ఇరగదీసిన తెలంగాణ.. దేశంలోనే తిరుగులేని అధిక్యత.. క్రెడిట్ కేసీఆర్ ఖాతాలో
X
మంచి చేసినా చెడు చేసినట్లు చెప్పే దరిద్రపు రోజులివి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. గతంలో మాదిరి విలువలు.. సిద్దాంతాలు.. లాంటి మాటల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తక్షణ రాజకీయ ప్రయోజనం తప్పించి.. మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించే తీరు ఈ మధ్యన ఎక్కువైంది. మాట వరసకు కూడా ప్రత్యర్థి గొప్పను పొగిడేందుకు మనసు ఒప్పుకోని మరుగుజ్జు మనుషులుగా మారిన దుస్థితి. ఇలాంటి వేళలో.. సుడంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

గడిచిన కొద్ది కాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు వర్సస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్న లడాయి తెలిసిందే. కేంద్రం తమకు ఎలాంటి సహకారం అందించటం లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్. ఇలాంటి వేళలో.. కేంద్రం విడుదల చేసే గణాంకాల్ని ఉన్నవి ఉన్నట్లుగా విడుదల చేయటం.. వాటి ఆధారంగా కేసీఆర్ సర్కారు కేంద్రంపైనా.. తెలంగాణ బీజేపీపైనా విరుచుకుపడుతున్నారు.

తమ ప్రభుత్వ గొప్పతనాన్ని.. తన నాయకత్వ వీరత్వాన్ని చాటి చెప్పుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారు. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల వారీగా స్థూల ఉత్పత్తి.. తలసరి ఆదాయంలో వృద్ధిరేటును వెల్లడించింది. ఈ విషయంలో దేశంలోనే అత్యధికంగా జీఎస్ డీపీ.. తలసరి ఆదాయంలో భారీగా వృద్ధిరేటును నమోదు చేస్తున్నట్లుగా తెలిపే గణాంకాల్ని కేంద్రం విడుదల చేసింది.

దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా అత్యధికంగా 19.1 శాతం వృద్ధి రేటును తెలంగాణ రాష్ట్రం నమోదు చేయటం విశేషం. తాజా ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్ డీపీని ప్రస్తుత ధరల్లో రూ.11.54 లక్షల కోట్లుగా.. తలసరి ఆదాయాన్ని రూ.2.78లక్షలుగా కేంద్రం ధ్రువీకరించింది. కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ వృద్ధిరేటు 2.25 మాత్రమే కాగా.. ఈసారి ఏకంగా 17.14శాతానికి పైనే పెరగటం విశేషం.

కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశపడుతున్న కేసీఆర్ కు మనో బలాన్ని మరింత పెంచేలా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఉన్నాయని చెప్పాలి. రానున్న రోజుల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో కేసీఆర్.. ఈ గణాంకాల్ని ఏదో రూపంలో వెల్లడించి.. తన గొప్పతనాన్ని.. తన నాయకత్వ వీరత్వాన్ని వెల్లడించటం ఖాయం.

రాష్ట్రం ఏర్పాటైన మొదటి..రెండో ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ తలసరి ఆదాయం.. గడిచిన రెండేళ్లలో ఎలా ఉందో చూస్తే.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.

ఏడాది తలసరి ఆదాయం వృద్ధిరేటు

2014-15 రూ.1,24,104 10.65

2015-16 రూ.1,40,840 13.49

2020-21 రూ.2,34,751 01.64

2021-22 రూ.2,78,833 18.78

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (రూ.కోట్లలో)

ఏడాది జీఎస్ డీపీ వృద్ధిరేటు

2014-15 5.05లక్షలు 12.02

2015-16 5.77లక్షలు 14.24

2020-21 9.69లక్షలు 2.25

2021-22 11.54లక్షలు 19.10