Begin typing your search above and press return to search.

తెలంగాణలో కేజ్రీవాల్ పాదయాత్ర?

By:  Tupaki Desk   |   19 March 2022 5:29 AM GMT
తెలంగాణలో కేజ్రీవాల్ పాదయాత్ర?
X
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ముఖ్యంగా ఆప్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటోంది. తెలంగాణపై ఆప్ ఆశాజనకంగా ఉంది. పంజాబ్ ఎన్నికల తర్వాత తెలంగాణ ఆప్ నాయకులు రాష్ట్రంలో తమదైన ముద్ర వేస్తారని నమ్మకంగా ఉన్నారు.

ఈక్రమంలోనే పార్టీకి ఊపు తెచ్చేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని వినికిడి. భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్రను నిర్వహించాలని యోచిస్తోంది. దాని కోసం రాష్ట్ర విభాగం అరవింద్ కేజ్రీవాల్‌ను తొలి పాదయాత్ర రోజు హాజరు కావాలని కోరబోతోందని సమాచారం.

ఇది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ని కలిగించడం ఖాయం. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. పంజాబ్ ఎన్నికలతో కేజ్రీవాల్-కేసీఆర్ సమావేశం జరగలేదు. ఈ గ్యాప్ లో టీఆర్ఎస్ తో చేతులు కలపాలని భావించినా పంజాబ్ లో విజయంతో ఇప్పుడు ఆప్ తన మనసు మార్చుకుని తెలంగాణపై కసరత్తు చేస్తోంది.

టీ-ఆప్ యువకులు.. రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలిసింది. ఈ పాదయాత్రతో పార్టీ మరింత బలోపేతం అవుతుందా అని ఆలోచిస్తున్నారు..

ఇటీవలే సోమనాథ్ భారతి టీ-ఆప్ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. త్వరలో ఆయన రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

దీన్ని బట్టి తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ.. టీఆర్ ఎస్ వైపు లేదనే సూచన ఇచ్చినట్టువతోంది. తెలంగాణలోనూ ఆప్ పోటీపడడం అధికార టీఆర్ఎస్ కు ఒకింత షాక్ అనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఆప్ కు తెలంగాణలో పెద్దగా అంచనాలు లేవు!