Begin typing your search above and press return to search.

రెండోస్సారి.. ఎవరికి సారీ... ?

By:  Tupaki Desk   |   18 April 2022 10:33 AM GMT
రెండోస్సారి.. ఎవరికి సారీ... ?
X
ఏపీలో 2024 ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎవరు గెలుస్తారు, సీఎం అయ్యేది ఎవరు అన్న చర్చలు అయితే గట్టిగానే సాగుతున్నాయి. ఇక అధికార వైసీపీ మళ్లీ మేమే అంటోంది. ఆ దిశగా ఆ పార్టీ తన వంతు ప్రయత్నాలను చేసుకుంటోంది. టీడీపీ అయితే తమను జనాలే గెలిపిస్తారు అని ధీమాగా ఉంది. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అరాచక పాలనను జనాలను రుచి చూపించిందని, ఇక తామే ఏపీలో బెస్ట్ ఆల్టర్నేషన్ అని టీడీపీ బలంగా నమ్ముతోంది.

జనసేన విషయానికి వస్తే వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు అనేశారు పవన్ కళ్యాణ్. ఆ విషయం మాత్రం తాను కచ్చితంగా చెప్పగలను అని ఇటీవల పార్టీ మీటింగులోనే ఆయన బిగ్ సౌండ్ చేశారు. ఇక ప్రజా ప్రభుత్వం వస్తుంది అని పవన్ చెబుతున్నారు. అంటే అది విపక్షాల ప్రభుత్వమా, జనసేన సర్కార్ నా అన్నది అయితే క్లారిటీ లేదు. మొత్తానికి జగన్ మాజీ అవుతారు అన్నది జనసేనాని ధీమా.

ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువ. వాటిని నేతలు కచ్చితంగా పాటిస్తారు కూడా. పాదయాత్రను చేసి వైఎస్సార్ సీఎం అయ్యారు. జగన్ కూడా తండ్రిని అనుసరించి పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో కూడా వైఎస్సార్ వరసగా మరోసారి గెలిచారు. ఇపుడు ఆ సెంటిమెంట్ వైసీపీకి కూడా వర్కౌట్ అవుతుందని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

ప్రతీ విషయంలో వైఎస్సార్ తో పోలిక పెట్టి చూసుకునే అలవాటు ఉన్న వైసీపీకి వైఎస్సార్ లక్ కూడా అలాగే తమకు కలసి వస్తుందన్న నమ్మకం ఉందిట. వైఎస్సార్ 2004లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, దాంతో విపక్షాలు అన్నీ కలసి మహా కూటమిని 2009 ఎన్నికల ముందు ఏర్పాటు చేసినా అధికారంలోకి రాలేకపోయాయని గుర్తు చేస్తున్నారు.

ఇక విభజన ఏపీలో కూడా వైఎస్సార్ మాదిరిగానే జగన్ కూడా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని, ఇంకా ఆయన కంటే ఎక్కువగా చేస్తున్నారని ఆ పార్టీనేతలు గుర్తు చేస్తున్నారు. మరో వైపు చూస్తే 2024 ఎన్నికల ముందు మహా కూటమిని చంద్రబాబు ఏర్పాటు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. అలా జరిగినా కూడా వైసీపీదే విజయం అని ఆ పార్టీ నాయకులు బల్ల గుద్దుతున్నారు. వైఎస్సార్ అయినా జగన్ అయినా ఒకసారి సీఎం అయితే వారిని మాజీలను చేయడం విపక్షాలకు కష్టమని కూడా ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

జనాలతో ఎమోషనల్ బాండేజి వైఎస్సార్ ఫ్యామిలీకి ఉందని, దాంతో విజయం మీద డౌట్లు అయితే అసలు లేవని అంటున్నారు. ఇక టీడీపీ విషయంలో చూస్తే విజయం ఖాయమని తలుస్తున్నా ఎక్కడో ఏదో మూలన యాంటీ సెంటిమెంట్ బెంగ కూడా ఉందిట. చంద్రబాబు 2009 ఎన్నికల్లో రెండవమారు ఓడిపోయారు. నాడు సీట్లు ఓట్లూ పెరిగాయి కానీ అధికారం మాత్రం టీడీపీకి దక్కలేదు

ఇపుడు కూడా దగ్గరకు వచ్చి పవర్ చేజారిపోతుందా అన్న సంశయాలు అయితే ఎక్కడో గట్టిగానే కొడుతున్నాయట. దానికి సామాజిక ఈక్వేషన్స్. రాజకీయ అనుకూలతల కంటే కూడా యాంటీ సెంటిమెంట్ మీద ఉన్న డౌట్లే కారణం అంటున్నారు. చంద్రబాబు నేతృత్వాన టీడీపీ ఒకసారి ఓడితే రెండు సార్లు మళ్లీ పవర్లోకి రాలేదు అన్న చరిత్ర చెప్పిన పాఠాలను వల్లె వేస్తూ తమ్ముళ్ళు కూడా కలవరపడుతున్నారుట.

అయితే ఇక్కడ సెంటిమెంట్ల కంటే జనం ఓటే ప్రధానం. గెలిపించేది ప్రజలు. అందువల్ల వైఎస్సార్ మాదిరిగా తాము రెండవసారి అధికారంలోకి వస్తామని వైసీపీ మురిసినా, లేక సెకండ్ టైమ్ అటెంప్ట్ ఎపుడూ ఫెయిల్ అని టీడీపీలో ఎంతో కొంత బెంగ ఉన్నా అవన్నీ తప్పు అని నిరూపించే శక్తి జనాలకే ఉంది అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల ఫలితాలను ఈ సెంటిమెంట్ తో కూడా ముడి పెట్టి చూడాల్సి ఉంటుందేమో.