Begin typing your search above and press return to search.

ఈ వైరల్ వీడియో చూశారా? ఈ కశ్మీరీ ముస్లిం మాదిరి మాట్లాడరేం?

By:  Tupaki Desk   |   19 March 2022 8:07 AM GMT
ఈ వైరల్ వీడియో చూశారా? ఈ కశ్మీరీ ముస్లిం మాదిరి మాట్లాడరేం?
X
తప్పులు జరుగుతుంటాయి. ఘోరాలు.. దారుణాలు చరిత్రలో చాలానే జరిగాయి. కానీ.. ఒక జాతికి చెందిన వారిని ఒక ప్రాంతంలో అత్యంత దారుణంగా.. క్రూరంగా టార్గెట్ చేసి మరీ హతమార్చటం.. లక్షలాది మందిని వారి ప్రాంతాల నుంచి తరిమేయటం.. ప్రాణ భయంతో వారు తమకున్న ఆస్తులన్ని వదులుకొని కట్టుబట్టలతో పిల్లాపాపలతో ఇతర ప్రాంతాలకు వచ్చిన ఉదంతం గురించి అడిగితే.. దేశంలోని చాలామంది సరైన సమాధానం చెప్పలేరు. కానీ.. అలాంటి వారి కళ్లు తెరుచుకునేలా చేసింది ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.

ఈ సినిమా జరిగిన వాస్తవంలో కేవలం పది శాతం మాత్రమే చూపించినట్లుగా పలువురు చెబుతుంటే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా.. అసత్యాలతో ఈ సినిమాను తీసినట్లుగా తప్పు పడుతున్నారు. ఇలాంటి వేళ.. ఏఎన్ఎన్ న్యూస్ కు సంబంధించిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక కశ్మీరీ ముస్లిం నోరు విప్పారు. కశ్మీర్ హిందువులపై జరిగిన మారణహోమాన్ని ప్రస్తావించి.. జరిగిన దానికి తాను క్షమాపణలు చెప్పటమేకాదు.. ఈ తరం కశ్మీరీ ముస్లింలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా ఉంది. అందులో ఏముందంటే.. ‘‘కశ్మీరీ పండిట్ల ఊచకోత 1997 మార్చి 21న జరిగింది. ఒక్క బీర్వా ప్రాంతంలోనే డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్లు దారుణంగా చంపబడ్డారు. ఆ దారుణాల్ని నా కళ్లారా ప్రత్యక్షంగా చూశాను. పండిట్లు ఏ కశ్మీరీ ముస్లింలను చంపలేదు. పండిట్లు నిరాయుధులుగా ఉన్నారు. వారిలో ఒక హెడ్మాస్టర్ కూడా ఉన్నారు. ఆయన్ను హత్య చేసిన తర్వాత నా వయసు యువకుడ్ని దారుణంగా చంపేశారు. దీన్ని ఊచకోత కాకుండా ఇంకేం అంటారు?’’ అంటూ వేదన వ్యక్తం చేశాడు.

ఇక.. కశ్మీరీ పండిట్లను దారుణంగా హతమార్చింది మరెవరో కాదని.. తమ సొంత మనుషులే అంటున్న అతడి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే.. జరిగిన దానికి వేదనను వ్యక్తం చేసే క్రమంలో అతడి మాటలు సరికొత్తగా ఉన్నాయని చెప్పాలి. సదరు వీడియోలో అతడేమన్నాడంటే.. ‘‘కశ్మీరీ పండిట్లను చంపిన వారు బయటవారు కాదు. మా సొంత మనుషులు. మా సొంత ముస్లిం వర్గానికి చెందిన వారు. అలాగే పండిట్లు బయటి వ్యక్తులేమీ కాదు. వారు మా స్వంత రక్తం. మా స్వంత మనుషులు. ఆఖరకు జంతువులు కూడా తమ సొంత జాతిని చంపుకోవు. కనీసం ఇప్పటికైనా మనం సిగ్గుపడాలి. మా నాన్న తరం చేసిన తప్పులకు.. కనీసం ఇప్పటి యువతగా.. ప్రగతిశీలిగా ఆ ఘోరాల్ని నేను అంగీకరించాలనుకుంటున్నా’’ అని చెప్పారు.

అంతేకాదు.. జరిగిన ఘోరానికి ఇప్పటి కశ్మీరీ ముస్లింలు ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన వాదనను వినిపించటం గమనార్హం. అతడి ప్రతిపాదన ఏమంటే.. ‘‘ఇప్పటి యువతగా మనం ముకుళిత హస్తాలతో మన కశ్మీరీ పండిట్లకు క్షమాపణలు చెబుదాం. ఎందుకంటే వారుకశ్మీర్ లో అంతర్భాగం. క్షమాపణలు చెప్పటానికి.. ఆత్మ పరిశీలన చేసుకోవటానికి సినిమా అవసరం లేదు. కావాల్సిందల్లా స్వచ్ఛమైన మన:సాక్షి’’ అంటున్న సదరు కశ్మీరీ ముస్లిం మాటలు కొత్త తరహా ఆలోచనలకు తెర తీసేలా ఉన్నాయి.