Begin typing your search above and press return to search.

స‌భ‌లో కుస్తీ.. బ‌య‌ట దోస్తీ!

By:  Tupaki Desk   |   10 March 2022 2:30 PM GMT
స‌భ‌లో కుస్తీ.. బ‌య‌ట దోస్తీ!
X
రాజ‌కీయాల్లో బ‌ద్ధ శ‌త్రువులైనా.. ఒక్క‌సారి బ‌య‌ట క‌లిస్తే చాలు నాయ‌కులు మ‌ర్యాద‌గా ప‌ల‌క‌రించుకుంటారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌నపెట్టి మాట్లాడుకుంటారు. మ‌రీ అదే రాజ‌కీయ మిత్రులైతే.. ఇక క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతారు. విమ‌ర్శ‌లు చేసే ప్ర‌త్య‌ర్థుల‌కు ధీటుగా కౌంట‌ర్లు ఇస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, దాని మిత్ర‌ప‌క్షం లాంటి ఎంఐఎం స్నేహ బంధం మాత్రం విచిత్రంగా క‌నిపిస్తోంది.

అన‌ధికారికంగా పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అసెంబ్లీ వేదిక‌గా ఒక‌దానిపై మ‌రొకటి విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. ఇరు పార్టీల‌కు చెందిన నేత‌లు వాగ్వాదానికి దిగడం గ‌మ‌నార్హం.

స‌భ‌లో వాగ్వాదం..

ఆరోగ్య‌శ్రీ, మైనారిటీ సంక్షేమం ప‌ద్దుల‌కు నిధుల విడుద‌ల‌పై అసెంబ్లీలో ఎంఐఎం శాస‌న‌స‌భ ప‌క్షనేత అక్బ‌రుద్దీన్, మంత్రి హ‌రీష్‌రావు మ‌ధ్య వాగ్వాదం సాగింది. ఎస్సీ ఎస్టీల‌కు ఇచ్చే అన్ని ర‌కాల ప్రోత్స‌హ‌కాలను మైనార్టీల‌కు ఇస్తామని గ‌తంలో స‌భ‌లో సీఎం కేసీఆర్ చెప్పార‌ని అక్బ‌రుద్దీన్ గుర్తుచేశారు. కానీ అలాంటిదేమీ లేద‌ని అరోగ్య‌శ్రీ బ‌కాయిలు కూడా విడుద‌ల చేయ‌డం లేదని ఆయ‌న అన్నారు.

కేంద్రం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ కింద ఎంత మందికి రాష్ట్రంలో వైద్య సేవ‌లు అందించారు? ఎన్ని నిధులు కేంద్రం ఇచ్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వివిధ సమ‌స్య‌ల‌పైనా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు గుప్పించారు.

అప్పులు తెచ్చి..

అప్పులు తెచ్చి సంక్షేమ ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేయ‌డం మంచిది కాద‌ని అక్బ‌రుద్దీన్ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. బ‌డ్జెట్లో చూపిన అప్పుల‌కు వాస్త‌వానికి భిన్నంగా ఉన్నాయని వివిధ కార్పొరేష‌న్ల ద్వారా తీసుకున్న రుణాలు లెక్క‌లో చూప‌లేద‌ని ఆరోపించారు. ఎంఎంటీఎస్ రెండో ద‌శ‌కు నిధులు కేటాయించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మైనార్టీల సంక్షేమానికి కేవ‌లం 0.67 శాతం మాత్ర‌మే కేటాయించార‌న్నారు.

స‌భ్యులెవ‌ర‌నైనా వెల్‌లోకి వ‌స్తే స‌స్పెండ్ చేస్తున్నార‌ని, మ‌రి సీఎం, మంత్రులు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే ఏం చేయాలో స్పీక‌ర్ నిర్ణ‌యించాల‌ని కోరారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో హామీల‌ను ప్ర‌భుత్వం తీర్చ‌లేద‌ని ఆయ‌న తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కానీ ఆ పార్టీతోనే..

అసెంబ్లీలో అధికార ప్రభుత్వ తీరుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ చివ‌ర‌కు మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌తోనే క‌లిసి సాగుతామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీంతో అంద‌రి దృష్టి ఉంటుంద‌ని ఏదో స‌భ‌లో మాట్లాడాలి కాబట్టి ఆయ‌న ఏవో వ్యాఖ్య‌లు చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే టీఆర్ఎస్‌, మ‌జ్లిస్ పార్టీలు వేర్వేరు కాద‌ని రెండూ ఒక‌టేన‌ని బీజేపీ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అక్బ‌రుద్దీన్ టీఆర్ఎస్‌తోనే సాగుతామ‌ని చెప్ప‌డంతో దానికి మ‌రింత బ‌లం చేకూరింది.