Begin typing your search above and press return to search.

కుమారుడు అమాయకుడంటున్న ఆ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ లోని ప్రత్యర్థుల కుట్రేనా?

By:  Tupaki Desk   |   14 March 2022 2:30 AM GMT
కుమారుడు అమాయకుడంటున్న ఆ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ లోని ప్రత్యర్థుల కుట్రేనా?
X
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి వ్యవహారం మూడు నెలల కిందట తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన కుమారుడి దందాల బెదిరింపుల కారణంగా ఇద్దరు పిల్లలు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు కావడంతో ఇది మరింత అగ్గి రాజేసింది. దీనికితోడు ఎమ్మెల్యే కుమారుడి వ్యవహార శైలిపై ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా మీడియా విరుచుకుపడింది.

తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, దాదాపు మూడు నెలలకు ఇటీవలే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఇక ఆయన తండ్రి కూడా అనారోగ్యం నుంచి కోలుకున్నారు.

అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే ఏమన్నారంటే..

కుమారుడి ఆగడాలు బయటపడడానికి ముందు కొద్ది రోజుల కిందట ఆ ఎమ్మెల్యే వెన్నుముక ఆపరేషన్ చేయించుకున్నారు. దీనికితోడు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు, కొవిడ్ కారణంగా పెద్దగా బయటకు రాలేదు. రెండేళ్ల కిందట మనవరాలి వివాహ ఆహ్వాన పత్రిక పంపిణీ సమయంలో సీఎంను కలవడం తప్ప.. ప్రజా సంబంధ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. అయితే, ఇదే సమయంలో కొవిడ్ రాకతో కాస్త హడావుడి లేకుండానే కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది.

కాగా, సరిగ్గా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కుమారుడి ఆగడాలకు ఓ కుటుంబం బలైందంటూ రచ్చ జరిగింది. దీంతో ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా తీవ్రంగానే స్పందించారు. అయితే, ప్రధాన స్రవంతి మీడియా మాత్రం కుమారుడి ఆగడాలపై వరుసగా కథనాలు రాయడంతో ఇదంతా పక్కకు జరిగిపోయింది.

ఇప్పుడేమంటున్నారంటే..

ఆరోగ్యం కుదుటపడడం, కొవిడ్ సద్దుమణగడంతో ఆ ఎమ్మెల్యే శాసన సభ సమావేశాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా లాబీల్లో తనను కలిసిన విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడారు. తాను లేని సమయంలో కొందరు కుట్ర చేసి.. తన కుమారుడిని ఇరికించారని, పార్టీ జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కుమారుడిని బదనాం చేశారని, ఇప్పుడు ఒక్కొక్కడి బండారం బయటపెడతానని వ్యాఖ్యానించారు.

కుమారుడి రాజకీయ భవిష్యత్ నాశనం చేశారని అన్నారు. పైగా కుమారుడిపై సానుభూతి పెరిగిందని.. కేసు కోర్టులో నిలవదని కూడా పేర్కొన్నారు. దీనిలో ఎంత నిజమో, ఎంత అబద్ధమో తర్వాత తేల్చొచ్చు. ప్రస్తుతానికి ఆ చర్చలోకి వెళ్లలేం.

మరేంటి తదుపరి చర్య వాస్తవానికి ఆయన సీనియర్ ఎమ్మెల్యే. మంత్రిగానూ పనిచేశారు. ఆ ప్రాంతంలో గట్టి పోటీని తట్టుకుని నిలిచారు. అలాంటిది.. వయసు పైబడి కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చే సమయంలో అప్రదిష్ట పాలయ్యారు. ఇందులో కుమారుడి ఆగడాలు అవాస్తమని చెప్పలేం. అతడి వ్యవహార శైలిపై ఎన్నో ఆరోపణలు ఉన్న మాట వాస్తవం. అయితే, ఆ ఎమ్మెల్యే చెప్పినట్లు లోతుగా చూస్తే.. రాజకీయాలు కూడా కనిపిస్తాయి.

ప్రత్యర్థి పార్టీలకు ఆయన కుమారుడే కావాలని ఆయుధం అందించినట్లు అయింది. ఎన్నో ఆరోపణలున్న అతడు జాగ్రత్తగా వెళ్లకుండా పెద్ద తప్పు చేశాడని అనిపిస్తోంది. మరోవైపు రాజకీయంగా చైతన్యవంతమైన ఆ నియోజకవర్గంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి మీడియాకు అడ్డంగా దొరికేశాడు. తన ప్రత్యర్థులకు ఉన్న పరిచయాలతో మీడియాలో అతడిపై తీవ్రంగా కథనాలు ఇచ్చారు.

ఇప్పుడా నియోజకవర్గ సీటు ఎవరికో?

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ వయసు రీత్యా ఆయనకు ఈసారి అధికార పార్టీ టిక్కెట్ కష్టమే. కానీ, పూర్తిగా కొట్టిపారేయలేం. ఇక కుమారుడికి టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ సీటును ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ సీట్లలో అదొకటి కావడంతో ఈ నియోజకవర్గం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కాగా, ఎంపీగా పనిచేసిన ప్రజాప్రతినిధి ఒకరు ఈ సీటును ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఎక్కువ సానుకూలత కూడా కనిపిస్తోంది.

మరోవైపు కొవిడ్ సమయంలో రాష్ట్ర స్థాయి అధికారిగా రెండేళ్ల నుంచి ప్రజల్లో బాగా పాపులర్ అయిన అధికారి కూడా ఆ సీటును ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

పైగా ఈ అధికారి సామాజికవర్గం వారు ఆ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇది ఆయనకు ప్లస్ పాయింట్ కాగలదని అంచనా. మొత్తానికి చాలా చర్చనీయాంశమైన ఆ నియోజకవర్గం కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి?