Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ పై ఉడకని అమెరికా దౌత్యం.. ప్లాన్‌ ‘బి’లో రష్యా

By:  Tupaki Desk   |   18 Feb 2022 10:30 AM GMT
ఉక్రెయిన్ పై ఉడకని అమెరికా దౌత్యం.. ప్లాన్‌ ‘బి’లో రష్యా
X
అమెరికా .. రష్యా.. మధ్యలో ఉక్రెయిన్. దౌత్యం సాగడం లేదు.. యుద్ధం తప్పేలా లేదు. బైడెన్ హెచ్చరికలున్నా పుతిన్ తగ్గడం లేదు. నాటో కూటమి ఆటలు సాగడం లేదు. రష్యాను అదుపు చేద్దామనుకున్నపెద్దన్న అమెరికా నోరు కట్టుకుని కూర్చోవాల్సి వస్తోంది.

ఉక్రెయిన్ పై తాను చెప్పిన దేన్నీ రష్యా పట్టించుకోకపోవడంతో అగ్ర రాజ్యమే తలపట్టుకోవాల్సి వస్తోంది. ర‌ష్యా అస్స‌లు విన‌ని నైజాన్ని బైడెన్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఉన్నట్టుండి గురువారం అర్ధ‌రాత్రి దాటాక తూర్పు ఉక్రెయిన్ పై దాడులు జరిగాయి. యుద్ధమా..? కొద్దిగా ఆగుదామా? అన్నట్లు కనిపించిన రష్యా పనే ఇదని చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ల‌క్ష మంది సైనికుల‌ను వెనక్కు పిలిచామ‌ని ర‌ష్యా చెబుతున్నా అవేవీ నిజాలు కావ‌ని తెలుస్తోంది. అదనంగా 7 వేల మందిని మోహరించడమే దీనికి నిదర్శనం. తన మాట చెల్లుబాటు కాదని బైడెన్ కు అర్థమవుతోంది. దేశాల మ‌ధ్య త‌గాదాల్లో త‌ల‌దూర్చి.. ఆయుధాలను అమ్ముకునే అగ్ర రాజ్యానికి ఉక్రెయిన్ ఓ పెద్ద‌ గుణపాఠంలా మిగలనుంది.

కరోనా దెబ్బతో అందరూ కుదేలే..రెండేళ్లుగా కరోనా దెబ్బతో ప్రపంచం తలకిందులైంది. ఇందులో అత్యధికంగా ప్రభావితమైంది అమెరికా. చిత్రంగా మిగతా అన్ని దేశాల కంటే అగ్ర రాజ్యంలోనే కేసులు, మరణాలు అధికంగా సంభవించాయి. అంతేకాదు.. మూడు వేవ్ ల దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారింది.

ఒకవేళ ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో వేలు పెట్టినా అది ఎంతో కొంత చేయి కాల్చుకునేందుకే.. అందుకే హెచ్చరికలతో సరిపెట్టుకుంటుందా? నేరుగా కదనం రంగంలోకి దిగుతుందా? అనే దానిపై అనేక అనుమానాలున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే.. పెద్దన్న గత పాపాలకు ఫలితమే ప్రస్తుత పరిస్థితి. ఒకప్పడు సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్నీ, వేర్పాటు వాదాన్నీ, దేశాల మ‌ధ్య క‌ల‌హాల‌నూ అడ్డుపెట్టుకునిఅంత‌ర్నాట‌కం న‌డిపిన అమెరికా నేడు వాటి ఫలితాన్ని అనుభవిస్తోంది.

రష్యా దూకుడు.. పుతిన్ మహా వేగం

రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మామూలుగా లేదు. ఆయన మాటను యూరప్ దేశాలు నమ్మడం లేదు. పైగా ఆగ్రహంగా ఉన్నాయి. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదని చెబుతున్నాయి. బలగాలు వెనక్కి వెళుతున్న వీడియోలను విడుదల చేసి.. 7 వేల అదనపు

బలగాలను రష్యా సరిహద్దులకు తరలించిందని నాటో సహా అమెరికా ఆరోపించింది. మరోవైపు డాన్‌బాస్‌ ప్రాంతంలోని డోనెట్స్క్‌, లుహాన్స్‌ ప్రాంతంలో వేర్పాటు వాదులు దాడులు మొదలుపెట్టారు. దీంతో మరోసారి రష్యా ఆక్రమణ భయాలు పెరిగిపోయాయి. తాజాగా బ్రిటన్‌ రక్షణ శాఖ రష్యా ప్లాన్‌ను మ్యాప్‌తో సహా ట్విట్‌ చేసింది.

ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించింది. కీవ్‌ను ఆక్రమించడానికి వీలుగా ఈ బలగాలను తరలించినట్లు బ్రిటన్‌ రక్షణ శాఖ రిపోర్టు పేర్కొంటోంది. బెలారస్‌, రష్యా మీదుగా ఏకకాలంలో కీవ్‌పై దాడి చేయడానికి దళాలు సిద్ధంగా ఉన్నాయి. బెలారస్ నుంచి కీవ్‌ కేవలం 80 మైళ్ల దూరంలోనే ఉంది. కాబట్టి కొన్ని గంటల్లోనే రష్యా సేనలు కీవ్‌ను ఆధీనంలోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ను భారీగా భయపెడుతోన్న అంశం ఇదే.

యుద్ధ నష్టాలకూ రష్యా సిద్ధం..

ఈ రోజుల్లో యుద్ధం అంటే మామూలు మాటలు కాదు. అందులోనూ అమెరికా దన్ను ఉన్న దేశానితో కయ్యానికి దిగడం అసాధారణం. తద్వారా వచ్చే నష్టాలను తట్టుకోవడం కష్టం. కానీ, ఇందుకు కూడా రష్యా సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్‌ అంటోంది. ఈ క్రమంలో వేల సంఖ్యలోప్రాణ నష్టానికి కూడా పుతిన్‌ వెనుకంజ వేయడంలేదని తెలిపింది. అదే సమయంలో దౌత్యాన్ని కూడా కొనసాగిస్తారని వెల్లడించింది. మాక్సర్‌ సంస్థ గురువారం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా బలగాల మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ సాకు చూపి...‘‘ఉక్రెయిన్‌లోని రష్యన్లను సామూహికంగా అంతం చేస్తున్నారు..’’ ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యలివి. దీనికితగ్గట్లు గానే రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి. వీటినే ప్రధాన సాకుగా చూపి మున్ముందు ఉక్రెయిన్‌పై దాడి చేసినా.. సమర్థించుకోవడానికి వీలుగా రష్యా తెస్తున్న కొత్త వాదనగా పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.

2014లో వేర్పాటు వాదులను ఉక్రెయిన్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు వాడి హత్య చేసిందని పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకోవడానికి వీలుగా రష్యా ఈ వాదన తెరపైకి తెస్తోందని అమెరికా కూడా చెబుతోంది. 2014లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్‌ యాంకోవిచ్‌ను ప్రజా ఉద్యమం ద్వారా దేశం నుంచి తరిమేశారు. దీంతో రష్యా వేగంగా స్పందించింది. వెంటనే క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించింది. అదే సమయంలో ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో రష్యా భాష మాట్లాడే వారు తిరుగుబాటు చేశారు.

వారికి రష్యా నుంచి పూర్తి మద్దతు ఉంది. అదే ఏడాది ఏప్రిల్‌లో డోనెట్స్క్‌, లుహాన్స్‌ ప్రాంతాల్లోని కీలక భవనాలను వీరు ఆక్రమించారు. వీటిని పీపుల్స్‌ రిపబ్లిక్‌లుగా ప్రకటించుకొన్నారు. వీరు ఉక్రెయిన్‌ దళాలపైదాడులు మొదలుపెట్టారు. అదే సమయంలో స్వాతంత్ర్యం ప్రకటించుకోవడానికి .. రష్యాలో విలీనం అవ్వడానికి ఓటింగ్‌ నిర్వహించారు.

తురుపు ముక్కలా వాడుకొంటున్న రష్యా..

రష్యా మాత్రం ఈ తీర్మానాలను ఆమోదించలేదు. ఈ రెండు ప్రాంతాలను వాడుకొని ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచి నాటోకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకొంది. పశ్చిమ దేశాలు, ఉక్రెయిన్‌ మాత్రం రష్యా తెరవెనుక ఉండి రెబల్స్‌తో కథ నడిపిస్తోందని ఆరోపించాయి. రష్యా వీటిని తోసిపుచ్చింది. అప్పటికే రెబల్స్‌ వద్దకు ట్యాంకులు, భారీ శతఘ్నులు, రాకెట్లు చేరుకొన్నాయి. 2014 జులైలో మలేషియా పౌర విమానం నెదర్లాండ్స్‌ నుంచి వెళ్తుండగా డాన్‌బాస్‌ ప్రాంతంలోని రెబల్స్‌ కూల్చేశారు. తొలుత రష్యా ఈ దాడికి తమ క్షిపణి వాడలేదని చెప్పినా.. దర్యాప్తు సంస్థలు మాత్రం రష్యా వైపే వేలెత్తి చూపాయి. అప్పటికే రష్యా నుంచి ఉక్రెయిన్‌లోని రెబల్స్‌కు మే నెలలో ‘బక్‌ క్షిపణి వ్యవస్థ’లను పంపుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. 2015లో శాంతి ఒప్పందం కుదిరినా.. పెద్దగా మార్పులేదు. ఇక్కడ వేర్పాటువాద ఘర్షణల్లో దాదాపు 14 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.