Begin typing your search above and press return to search.

రీల్ 'బీమ్లా' అంత కాదు కానీ.. రియల్ లైఫ్ లో అలా చేసిన ఉమాభారతి

By:  Tupaki Desk   |   14 March 2022 4:30 AM GMT
రీల్ బీమ్లా అంత కాదు కానీ.. రియల్ లైఫ్ లో అలా చేసిన ఉమాభారతి
X
ఈ మధ్యనే విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న భీమ్లా నాయక్ మూవీని చూసే ఉంటారు. ఇందులో హీరో పాత్రధారి పవన్ కల్యాణ్.. తమ ఊళ్లో ఉన్న మద్యం షాపును.. బాంబులు కట్ట చుట్టి.. కూల్చేయటం.. ఊరికి పట్టిన శని వదిలిపోయిందన్న మాట చెప్పటం.. థియేటర్లో ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తాయి. రీల్ లో చూపించినట్లుగా చేయలేదు కానీ.. రియల్ లైఫ్ లో మద్యం మీద వ్యతిరేక గళాన్ని వినిపించే ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.. తన చేతలతో కొత్త తరహా నిరసనను చేపట్టారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా.. తర్వాతి కాలంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు మాజీగా చెలామణీ అవుతున్నారు. గడిచిన రెండేళ్ల నుంచి మద్యాన్ని నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికి.. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

తాజాగా తన భద్రతా సిబ్బందిని వెంటపెట్టుకొని మరీ భోపాల్ లోని ఒక మద్యం షాపులోకి వెళ్లి.. పెద్ద బండరాయితో బాటిళ్ల మీదకు విసిరి.. పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తీసిన ఆమె.. తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లో మద్యాన్ని నిషేధించాలంటూ గడిచిన రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆమె..ఈ అంశంపై ఈ జనవరి 15 నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని సొంత బీజేపీ సర్కారుకు డెడ్ లైన్ విధించారు. ఒకవేళ మద్యం అమ్మకాల్ని నిషేధించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని ఆమె గత ఏడాది ప్రకటించారు. మద్యం దుకాణాల ముందు కూర్చొని నిరసన తెలియజేస్తామని వెల్లడించారు.

ఓవైపు రాష్ట్రంలో మద్య నిషేధం మీద నిరసన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు శివరాజ్ సింగ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. మద్యాన్ని తక్కువ ధరకే అమ్మాలని పేర్కొంది. అంతేకాదు.. ఇప్పటివరకు ఇంట్లో ఉంచుకునే మద్యానికి నాలుగు రెట్లు ఎక్కువగా స్టాక్ చేసుకోవచ్చని.. కోటి రూపాయిల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారు ఇంట్లోనే బార్ ను ఏర్పాటు చేసుకోవచ్చన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

ధరలు తగ్గించటంతో పాటు.. విదేశీ మద్యాన్ని అమ్మేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంపై ఉమాభారతి మండిపడుతున్నారు. మద్య నిషేధానికి రెండురోజులు డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుకు వెళ్లి.. బండరాయితో మద్యం బాటిళ్లను పగలగొట్టటం ద్వారా.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తనకున్న వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేశారు. మరి.. దీనికి శివరాజ్ సింగ్ సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.