Begin typing your search above and press return to search.

వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే, కార్డ్ స్వైపింగ్ నో! రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   15 March 2022 11:09 AM GMT
వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే, కార్డ్ స్వైపింగ్ నో! రీజ‌నేంటి?
X
ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా కూడా డిజిట‌ల్ యుగంలో న‌డుస్తోంది. మాటల నుంచి చేత‌ల వ‌ర‌కు అన్నీ.. డిజిట‌ల్ మాధ్య‌మాల్లో నే జ‌రిగిపోతున్నాయి. పిల్ల‌ల‌కు పాఠాల నుంచి ఆఫీసుల్లో ప‌నుల వ‌ర‌కు డిజిట‌ల్‌గానే సాగుతున్నాయి. ఇక‌, న‌గ‌దు లావాదేవీలు కూడా ఇలానే సాగుతున్నాయి. పెద్ద మొత్తాల నుంచి టీ కొట్టు ద‌గ్గ‌ర రూ.10 టీ బిల్లు వ‌ర‌కు కూడా డిజిట‌ల్‌గా చెల్లించే సౌల‌భ్యాలు వ‌చ్చేశాయి. అయితే.. ఏపీలో మాత్రం ప్ర‌భుత్వ ఆధ్వ‌రంలో న‌డుస్తున్న మ‌ద్యం దుకాణాల్లో మాత్రం డిజిట‌ల్ చెల్లింపుల‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.

నిజానికి మ‌ద్యం షాపులో మినిమం కొనుగోలు ప్ర‌స్తుతం రూ.150 నుంచి ఉంది. అంటే.. ప్ర‌తి లావాదేవీని.. డిజిట‌ల్ రూపంలో చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. పైగా.. రోజుకు ఒక్కొక్క షాపులోనే ల‌క్ష‌ల్లో బిజినెస్ సాగుతుంది. కొన్ని ర‌ద్దీ ప్రాంతాల్లోని షాపుల్లో అయితే.. ఇది కోటి వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.! అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ఎక్క‌డా కూడా డిజిట‌ల్ పేమెంట్ల‌కు అవ‌కాశం లేదు. మ‌రి ఎందుకు ఇలా జ‌రుగుతోంది. ఇదే విష‌యం.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ కృష్ణ‌రాజుకూడా సందేహంగా మారింది. దీనిపై ఆయ‌న తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మ‌ద్యం షాపుల్లో న‌గ‌దు లావాదేవీల‌కు.. డిజిట‌ల్ మాధ్య‌మాలు వినియోగించ‌క‌పోవ‌డం.. అదేవిధంగా ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు వెళ్లే వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన న‌గ‌దును నేరుగా అందించ‌డం వంటివిష‌యాల‌పై అనుమానాలు ఉన్నాయ‌న్నారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కోట్ల వ‌ర‌కు న‌గ‌దు చ‌లామ‌ణి అవుతోంద‌ని..ర‌ఘురామ తెలిపారు. అయితే.. ఎక్క‌డ కూడా డిజిట‌ల్ న‌గ‌దు లావాదేవీలు చేసుకునే అవ‌కాశం లేకుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఆయ‌న ఆరోపించారు.

ర‌చ్చ‌బ‌డ్డ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ర‌ఘురామ‌, డిజిట‌ల్ లావాదేవీలు స‌హా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కార‌ణంగా.. అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. పింఛ‌న్లు... ఇత‌ర ప‌థ‌కాల రూపంలో ప్ర‌తి ఏటా వ‌లంటీర్లు రూ.18000 కోట్లు పంచుతున్నార‌ని తెలిపారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్యం దుకాణాల ద్వారా రూ.35 వేల కొట్ల ఆదాయం వ‌స్తోంద‌న‌న్నారు. అయితే. ఎక్క‌డా డిజిట‌ల్ రూపంలో న‌గదును తీసుకునే ఏర్పాటు చేయ‌లేద‌న్నారు. ఫ‌లితంగా 50 వేల న‌గ‌దు లావాదేవీల‌పై.. అనేక సందేహాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

సంక్షేమ ప‌థ‌కాల కింద ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేస్తున్న సొమ్మును ఎందుకు విత్‌డ్రా చేస్తున్నార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం డీబీటీ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంద‌ని... త‌ద్వారా ల‌బ్ధి దారుల‌కునేరుగా న‌గ‌దు చేరుతుంద‌ని.. ఎలాంటి కోత‌లు లేకుండా.. ల‌బ్ధిదారులకు సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయ‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. ఇలా చేతికి న‌గ‌దు ఇవ్వ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. దీనివెనుక ఏదో మ‌త‌ల‌బు ఉంద‌న్నారు. వ‌లంటీర్లు.. ల‌బ్ధిదారుల‌కు ఇచ్చే మొత్తంలో రూ.100 నుంచి 200 తీసుకుంటున్నార‌ని..ఆయ‌న ఆరోపించారు.

అంతేకాదు.. ల‌బ్ధిదారుల జాబితాలో లేనివారికి కూడా న‌గ‌దు ఇస్తున్నార‌ని.. ఇది పెద్ద ఎత్తున అవినీతిగా మారింద‌ని.. ర‌ఘురామ వ్యాఖ్యానించారు. పార‌ద‌ర్శ‌క విధానంలో సాగాల్సిన ఈ క్ర‌తువు అవినీతికి ఆల‌వాలంగా మారింద‌న్నారు. అదేస‌మ‌యంలో అస‌లు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ శుద్ధ దండ‌గ‌ని.. ర‌ఘురామ అన్నారు. ఎలాంటి ప‌బ్లిక్ నోటీస్ లేకుండానే.. వ‌లంటీర్ల‌ను నియ‌మించారు. వారంతా.. వైసీపీ నాయ‌కులు లేదా.. వైసీపీ నేత‌లు సిఫార్సు చేసిన వారేన‌ని తెలిపారు. అందుకే వారు వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని.. ఇది పెద్ద త‌ప్పుడు విధాన‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.

వాస్త‌వానికి ప్ర‌బుత్వం త‌ర‌పున ప‌నిచేసేవారిని ఎవ‌రిని నియ‌మించుకోవాల‌ని భావించినా.. ఆర్థిక శాఖ అనుమ‌తి ఉండాల‌ని.. అయితే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ అలా ఏర్ప‌డింది కాద‌ని అన్నారు. దీనికి సంబంధించి కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ముకు తాము ఒక లేఖ రాసిన‌ట్టు తెలిపారు. ఇక‌, వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా.. సాక్షి పేప‌ర్‌లో ప‌నిచేస్తున్న‌వారికి కూడా ప్ర‌జా ఖ‌జానా నుంచి నిధులు ఇస్తున్నార‌ని.. ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.