Begin typing your search above and press return to search.

అల్లూరితో గురి...అరకు వస్తున్న మోదీ

By:  Tupaki Desk   |   28 March 2022 6:54 AM GMT
అల్లూరితో గురి...అరకు వస్తున్న మోదీ
X
ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత విశాఖ జిల్లా అరకు రానున్నారని తెలుస్తోంది. ఆయన అరకు టూర్ లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఈ మ్యూజియానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసింది.

దాంతో ఈ మ్యూజియం నిర్మాణ‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొందరలోనే ఇవి పూర్తి కావస్తున్నాయి. దాంతో మంచి ముహూర్తం చూసి మ్యూజియాన్ని ప్రారంభించాలని నిర్ణయిచారు. దీని కోసం ఏకంగా ప్రధాని మోడీనే ఆహ్వానిస్తామని కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. తాజాగా రాజమండ్రీలో జరిగిన జాతీయ సాంస్కృతిక వారోత్సవాలలో భాగంగా ప్రసగించిన కిషన్ రెడ్డి ప్రధాని చేతుల మీదుగా అల్లూరి మ్యూజియాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.

ఇక అరకు సహా విశాఖ ఏజెన్సీలో అల్లూరి గిరిజనుల సాయంతో సాయుధ పోరాటాన్ని చేశారు. ఆయన చేసిన పోరాటాలు, వాటి విలువైన గుర్తులు అన్నీ కూడా భద్రంగా ఈ మ్యూజియం లో పెడతారు. అలాగే అల్లూరితో పాటు నాడు తెల్లదొరలను ఎదిరించిన వారి జ్ఞాపకాలు కూడా పదిలపరుస్తున్నారు.

ఇక బీజేపీ వచ్చే ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. బీజేపీ గత కొంతకాలంగా ఏజెన్సీలో బలపడాలని చూస్తోంది. దానికి నాందిగా ప్రధానినే నేరుగా అరకు తీసుకురావాలనుకుంటోంది. విశాఖ ఏజెన్సీకి ఇంతవరకూ ఏ ప్రధాని వచ్చిన దాఖాలు లేవు.

దాంతో ఆ రికార్డుని నరేంద్ర మోడీ క్రియేట్ చేస్తారు అంటున్నారు. అలాగే ఆయన రాకతో ఏజెన్సీ మీదుగా విశాఖ సహా ఉత్తరాంధ్రా మీద బీజేపీ నేతలు రాజకీయంగా టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. ప్రధాని మోడీ మూడేళ్ళ క్రితం 2019 లో ఎన్నికల ముందు విశాఖ వచ్చారు.

నాడు రైల్వే జోన్ విశాఖకు మంజూరు చేస్తున్నాట్లుగా ఆయన చెప్పారు. ఇపుడు అరకు కనుక ప్రధాని వస్తే మరే మంచి కబురు వెంట తెస్తారో అన్న ఆసక్తి అయితే ఉంది. అయితే అల్లూరి అంటే గిరిజనులకు వల్లమాలిన అభిమానం కాబట్టి ఆయన ద్వారా తమ రాజకీయ బాణాన్ని గురి పెట్టి ఈ ప్రాంతంలో బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలో ఇదొక భాగమని అంటున్నారు. చూడాలి మరి అల్లూరి నామస్మరణం బీజేపీకి ఎంత వరకూ ఉపయోగపడుతుందో.