Begin typing your search above and press return to search.

సీఎంగా యోగి ప్రమాణస్వీకారం ముహూర్తం ఖరారు.. తాజా టీం ఇదేనట!

By:  Tupaki Desk   |   18 March 2022 5:32 AM GMT
సీఎంగా యోగి ప్రమాణస్వీకారం ముహూర్తం ఖరారు.. తాజా టీం ఇదేనట!
X
అంచనాలకు మించి యూపీలో విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు మాంచి జోష్ లో ఉంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం.. ఈ విజయంలో కీలక భూమిక పోషించింది యోగి ఆదిత్యనాథ్. ఓవైపు సంక్షేమం.. మరోవైపు శాంతిభద్రతలను పెంచటంతో పాటు.. యూపీ ఆర్థిక పరిపుష్టికి కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. ఐదేళ్ల పాలనలో తన మార్కును వేయటంలో సక్సెస్ అయ్యారు యోగి. అదే ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చేందుకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.

భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న యోగి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తాన్ని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 21 (సోమవారం) మధ్యాహ్నం మూడు గంటల వేళలో.. యోగి రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో.. యూపీ పీఠాన్ని వరుసగా రెండోసారి సీఎం కుర్చీలో కూర్చున్న అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో యోగి నిలవనున్నారు.

ఇదిలా ఉంటే.. రెండోసారి ముఖ్యమంత్రి కానున్న యోగి.. తన మంత్రివర్గాన్ని డిజైన్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంత్రివర్గం తుది జాబితాపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాను ఖరారు చేసే వేళలో.. గత ప్రభుత్వంలో పని చేయని పలువురు మంత్రులను నిర్మోహమాటంగా తీసుకోకూడదని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

తాజా కేబినెట్ కూర్పు మొత్తం వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని టార్గెట్ గా చేసుకొని మరీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు. పాత కేబినెట్ లో సరిగా పని చేయని వారిని పక్కన పెట్టేసిన యోగి.. కొత్త వారిని సైతం జట్టులోకి తీసుకోవటానికి వెనకుడుగు వేయటం లేదంటున్నారు. అంతేకాదు.. దేశంలోనే అది పెద్ద రాష్ట్రమైన యూపీ మంత్రి వర్గంలో ప్రాంతాల వారీగా.. సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకొని కేబినెట్ ఉందంటున్నారు.

సొంత పార్టీ నుంచే కాదు మిత్రులైన అప్నాదళ్ పార్టీ నుంచి ఇద్దరిని.. నిషాద్ పార్టీ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ మంత్రి కానున్నారు.

2017లో వెల్లడైన యూపీ ఫలితాల్ని తాజా ఫలితాలతో పోల్చినప్పుడు.. దాదాపుగా 50 స్థానాలు తక్కువగా విజయం సాధించినప్పటికీ.. తాజా విజయం ఘన విజయంగానే చెప్పాలి. మొత్తం 403 స్థానాలకు బీజేపీ 255 స్థానాల్ని గెలుచుకుంది. తన మిత్రపక్షం అప్నాదళ్ కు 12 స్థానాలు సొంతం చేసుకుంటే.. నిషాద్ పార్టీకి ఆరు స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలవనున్న ఎస్పీ (సమాజ్ వాదీ పార్టీ)కి 111 సీట్లు దక్కాయి.

గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో యోగి.. ఎమ్మెల్సీగా వ్యవహరించేవారు. తాజాగా మరోసారి సీఎం కానున్న ఆయన.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి దాదాపు 1.03లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే. ఇక.. యోగి కేబినెట్ లో కొలువు తీరే మంత్రుల్లో కొందరి పేర్లు తాజాగా బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే..
- కేశవ్ ప్రసాద్ మౌర్య
- శ్రీకాంత్ శర్మ
- సిద్ధార్థ్ నాథ్ సింగ్
- నంద్ గోపాల్ నంది
- బ్రజేష్ పాతక్
- రాంపాల్ వర్మ
- సూర్య ప్రతాప్ షాహి
- అషుతోష్ టాండన్
- మోహిసిన్ రాజా
- అనిల్ రాజ్‌భర్
- సందీప్ సింగ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి.. ఇందులో వాస్తవం ఎంతన్నది తేలాలంటే ఈ నెల 21 వరకు వెయిట్ చేయాల్సిందే.