Begin typing your search above and press return to search.

ఇవేం లెక్కలు? ఆ మీడియా సంస్థల స్థాయిని పెంచేస్తున్న జగన్

By:  Tupaki Desk   |   18 March 2022 5:49 AM GMT
ఇవేం లెక్కలు? ఆ మీడియా సంస్థల స్థాయిని పెంచేస్తున్న జగన్
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్సు మిస్ అవుతున్నారా? ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు.. చేస్తున్న వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశాలుగా మారటమే కాదు.. ఆయన ఆలోచనలు తప్పన్న భావన కలిగేలా చేసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మిన్ను విరిగి మీద పడినా.. చలించనట్లు కూల్ గా ఉండే జగన్ ఇటీవల మాత్రం తరచూ తనను తాను కంట్రోల్ చేసుకునే ధోరణిని తగ్గించుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్ తో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటల్లో పస తగ్గి నసగా మారటమే కాదు.. మాటల్లో ఇన్ని తప్పులా? అన్న సందేహానికి గురయ్యే పరిస్థితి.

తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈసారి ఎన్నికల్లో తాము టీడీపీతో పోటీ లేదని.. పోటీ పడాల్సింది ఆంధ్రజ్యోతి.. ఈనాడు.. టీవీ5 అంటూ చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది. టీడీపీని తక్కువ చేయటం ఓకే కానీ.. అదే సమయంలో అంత సీన్ లేని మీడియా సంస్థల్ని తన ప్రత్యర్థులుగా చెప్పుకోవటం.. వారిపై సమర శంఖాన్ని పూరించినట్లుగా ఆయన మాట్లాడకుండా ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది.

నిజంగానే ఈ మూడు మీడియా సంస్థలు జగన్ ప్రభుత్వాన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నాయా? అంటే.. అందులో సగమే నిజమని చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం గా నిలిచే మీడియా.. తన పాత్రను తాను పోషిస్తూ ఉంటుంది. తన తప్పుల్ని ఎత్తి చూపే మీడియా మీద జగన్ అండ్ కోకు ఉన్న ఆగ్రహం అంతా ఇంతా కాదు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వాన్ని.. అది తీసుకునే నిర్ణయాల్ని తన మీడియా సంస్థ ఏ రీతిలో ఏకిపారేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ.. అందుకు భిన్నంగా జగన్ తీసుకునే అన్ని నిర్ణయాల్ని తిట్టటమే పనిగా పెట్టుకునే ధైర్య సాహసాల్ని ఈ మూడు మీడియా సంస్థలు చేయటం లేదనే చెప్పాలి. జగన్ కంటే కూడా ఈ మూడు మీడియా సంస్థలకు ప్రజలే న్యాయ నిర్ణేతలు. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తే.. వారి పేపర్ ను.. టీవీ చానల్ ను చూడాల్సిన అవసరం లేదు. అయినా.. తాను గురి పెట్టిన మీడియా సంస్థలను ఎలా ఇరుకున పడేయాలన్న విషయంలో జగన్ కంటే కూడా ఆయన తండ్రి కమ్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలిసినంతగా తెలీదనే చెప్పాలి.

వైఎస్ పాలనను చూసుకుంటే.. తన కంట్లో నలకలా.. కాల్లో ముల్లులా.. పంటి కింద రాయిలా వ్యవహరించే మీడియా సంస్థల విషయంలో ఆయన తరచూ కాకున్నా.. అప్పుడప్పుడు విరుచుకుపడేవారు. అది కూడా.. సమంజస ధోరణిలో. ఎక్కడిదాకానో ఎందుకు.. ఈనాడుకు సంబంధించి ఆ పత్రిక యజమాని రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఎపిసోడ్ ను చూసినప్పుడు.. సాంకేతికంగా ఉన్న తప్పును ఎత్తి చూపించి.. ఆయన పేరును ఎంతలా డ్యామేజ్ చేశారో చెప్పాల్సిన అవసరం లేదు. తనను టార్గెట్ చేసే వారి విషయంలో వైఎస్ ఎలా రియాక్టు అవుతారన్న దానికి ఇదోచిన్న ఉదాహరణ మాత్రమే.

తండ్రి వైఎస్ మాదిరి కాకుండా జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని చెప్పాలి. వైఎస్ తీరులో రిటార్టు.. వంక పెట్టలేని రీతిలో ఉంటే.. జగన్ విషయానికి వస్తే వేలెత్తి చూపేలా ఉంటుంది. ఈ తేడాను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. టీడీపీతో పోటీ లేదని.. మూడు మీడియాసంస్థలతో పోటీ అని చెప్పే ముఖ్యమంత్రి మాటల్లో నిజంగానే అంత నిజం ఉందా? అన్నది పెద్ద ప్రశ్న.

తన ప్రత్యర్థులుగా మూడు మీడియా సంస్థల్ని చూపించటం ద్వారా జగన్ ఇమేజ్ పెరగటం తర్వాత.. సదరు మూడు మీడియా సంస్థల ఆత్మస్థైర్యాన్ని తన మాటలతో పెంచుతున్నారని చెప్పక తప్పదు. మీడియా సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. వాటిల్లో తప్పులు ఉంటే ఎత్తి చూపించటం వరకు ఓకే. అంతకు మించి అట్టే ప్రాథాన్యతను సీఎం స్థాయి నేత ఇవ్వటం ద్వారా.. వాటి రేంజ్ ను ఆయనే పెంచినట్లు అవుతోంది. తనను చిరాకు పెడుతున్న మీడియా సంస్థల విషయంలో తన తండ్రి అనుసరించిన విధానాన్ని గుర్తు తెచ్చుకుంటే.. ఎలా పోరాడాలన్న అంశంపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.