Begin typing your search above and press return to search.

ఆ ప‌ద‌వులు పేరు చెప్పి.. ఉన్న ప‌ద‌వులు ఊడ‌గొట్టాల‌ని!

By:  Tupaki Desk   |   12 March 2022 1:30 PM GMT
ఆ ప‌ద‌వులు పేరు చెప్పి.. ఉన్న ప‌ద‌వులు ఊడ‌గొట్టాల‌ని!
X
త‌న మంత్రివ‌ర్గంలో స‌మూల మార్పులు చేసేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యార‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప‌ద‌వుల నుంచి మంత్రుల‌ను తీసేసే ముందు వాళ్ల‌ను కూల్ చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే జిల్లా అధ్య‌క్షుల ప‌ద‌వుల‌ను చూపించి మంత్రి ప‌ద‌వుల‌ను ఊడ‌గొట్టేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తాయి. తాజాగా మంత్రుల వ‌ద్ద జ‌గ‌న్ ఇలాంటి అర్థం వ‌చ్చే వ్యాఖ్య‌లు చేశార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న కేబినేట్ పునఃవిస్త‌ర‌ణ‌కు ముహూర్తం పెట్టార‌ని అందుకు త‌గిన క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలిసింది.

"మంత్రులుగా ప‌ని చేస్తున్న మీ స్థాయి పెరిగింది. మిమ్మ‌ల్ని పార్టీ అధ్య‌క్షులుగా నియ‌మిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోగ‌ల‌రు. మ‌ళ్లీ గెలిచి వ‌స్తే అప్పుడు మీరే మంత్రులు అవుతారు క‌దా" అని ముఖ్యమంత్రి జ‌గ‌న్ త‌న మంత్రుల‌తో వ్యాఖ్యానించిన‌ట్లు తెలిసింది. దీంతో గ‌త కొన్ని రోజులుగా మంత్రివ‌ర్గ మార్పుల‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

తాజాగా మంత్రి మండ‌లి స‌మావేశంలో జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కోటు వేసుకుని వ‌చ్చి బ‌డ్జెట్ చ‌ద‌వాల్సింద‌ని, మ‌ళ్లీ ఆయ‌నకు ఆ అవ‌కాశం వ‌స్తుందో రాదో అని బుగ్గ‌న‌తో మ‌రో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారంటా. ఆ విష‌యాన్ని మంత్రిమండ‌లి స‌మావేశంలో బాలినేని ప్ర‌స్తావించారు.

దీంతో ఇవ‌న్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రుల‌ను మారుస్తాన‌ని మొద‌ట్లోనే చెప్పాను క‌దా అని జ‌గ‌న్ అన్న‌ట్లు తెలిసింది. పార్టీ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని, అలా అని వాళ్ల‌ను ఏదో త‌క్కువ చేసిన‌ట్లు కాదు క‌దా అని మంత్రుల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. "మంత్రులుగా మీకు మూడేళ్ల అనుభ‌వం వ‌చ్చింది.

ఆ అనుభ‌వంతో ఎన్నిక‌ల్లో పార్టీని ఎలా న‌డిపించ‌గ‌ల‌ర‌ని ఆలోచిస్తున్నా. సామాజిక‌, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల కార‌ణంగా ప్ర‌స్తుత మంత్రుల్లో కొంత‌మందిని కొన‌సాగించ‌డం గురించి ఆలోచిస్తున్నా. అయినా దానికి వేరే స‌మ‌యం ఉంది" అని జ‌గ‌న్ అన్నార‌ని స‌మాచారం.

జ‌గ‌న్ తాజా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే మంత్రి వ‌ర్గాన్ని దాదాపుగా ప్ర‌క్షాళ‌న చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌రో ఇద్ద‌రో ప్ర‌స్తుత మంత్రుల‌ను కొన‌సాగించి.. మిగ‌తా వాళ్ల స్థానాల్లో కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది. అందుకు ఉగాదికి ఆయ‌న ముహూర్తం పెట్టార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. వేటు ప‌డే మంత్రుల‌ను శాంతింప‌జేసేందుకు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వులు ఇస్తాన‌ని చెబుతున్నార‌ని స‌మాచారం. మ‌రి ప‌ద‌వులు కోల్పోయే మంత్రులు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.