Begin typing your search above and press return to search.

పవన్ బాంబు పేల్చేది అపుడేనా... ?

By:  Tupaki Desk   |   21 Feb 2022 5:30 AM GMT
పవన్ బాంబు పేల్చేది  అపుడేనా... ?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు ఎపుడూ బాంబుల్లాగానే ఉంటాయి. ఆయన వేదిక ఎక్కిన తరువాత ఇచ్చే స్పీచ్ విన్న వారికి ఒక విధంగా వీరావేశం వస్తుంది. ఇక ఆ దూకుడు, ఆవేశం ఆయన తీసుకునే నిర్ణయాలలో పెద్దగా ఉండదని అంటారు. అది వేరే విమర్శ. అయితే జనసేన ఎనిమిదేళ్ల రాజకీయ ప్రస్థానంలో మెరుపులు ఏమైనా ఉన్నాయా అంటే పెద్దగా లేవు అనే చెబుతారు. అయితే మరకలుగా చూస్తే మాత్రం ప్రత్యర్ధులు పొత్తుల విషయంలో వేసిన ఎత్తులు సరైనవి కావు అని అంటారు. అయితే తమ సిద్ధాంతాలకు తగిన విధంగా తాము నడచుకుంటున్నామని జనసైనికులు జవాబు ఇస్తారు.

ఇదంతా ఎందుకు అంటే పవన్ పార్టీ పెట్టాక ఇప్పటికి అనేక పార్టీలతో అదే సమయంలో వాటి నుంచి విడిపోయారు కూడా. ఇక ఏపీలో చూస్తే పవన్ కి బీజేపీకి మధ్య బంధం 2020 జనవరిలో మళ్లీ కుదిరించి. ఇప్పటికి రెండేళ్ళుగా రెండు పార్టీలు మిత్రులుగా కొనసాగుతున్నాయి. అయితే గత కొంతకాలమంగా ఈ రెండు పార్టీలు ఎవరి కార్యక్రమాలు వారు సొంతంగానే చేసుకుంటూ వస్తున్నారు. బీజేపీ ప్రాంతాల వారీగా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది.

అదే విధంగా పవన్ జనసేన కూడా సొంతంగానే అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తోంది. దాంతో ఈ పొత్తుల విషయంలో కూడా డౌట్లు వస్తున్నాయి. ఇక ఆ మధ్య కడప జిల్లాలోని బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తే జనసేన ఏకగ్రీవం కావాలంటూ తప్పుకుంది. దానికి ముందు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో కూడా రెండు పార్టీల మధ్య విభేధాలు పొడసూపాయని ప్రచారం జరిగింది.

ఇక జనసేనతో టీడీపీ నేతలు పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా కుప్పం టూర్ లో చెప్పిన మాట ఏంటి అంటే వన్ సైడ్ లవ్ తో ఏమీ జరగదు కదా అని. అంటే తాము జనసేన పొత్తును కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పకనే చెప్పేశారు. ఈ నేపధ్యంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ జరుగుతోంది.

ఈ సభలో అనేక కీలకమైన అంశాల మీద చర్చ ఉంటుంది అంటున్నారు. ప్రత్యేకించి రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే టైమ్ ని కానీ సందర్భాన్ని కానీ చూసినపుడు జనసేన ఆవిర్భావ సభ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అనే అంటున్నారు.

మార్చి 10న ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. బీజేపీకి పెద్దగా ఆశావహంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉండకపోవచ్చు అని ప్రచారం ఉంది. ఒక వేళ అదే కనుక జరిగితే బీజేపీ తో జనసేన తెగదెంపులు చేసుకుంటుందా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. బీజేపీతో ఇప్పటికే అంటీముట్టనట్లుగా ఉన్న జనసేన తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించడానికి పార్టీ ఆవిర్భావ సభను వాడుకుంటుంది అని అంటున్నారు.

అదే టైమ్ లో టీడీపీలో దోస్తీ మీద కూడా క్లారిటీ ఇస్తుందా. లేక సానుకూల సంకేతాలు ఏమైనా పంపుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే జనసేన ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు నాంది పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈ సభ మీద అధికార వైసీపీ సహా టీడీపీ బీజేపీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టేశాయి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.