Begin typing your search above and press return to search.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య సుపారీపై పోలీసుల వాదనకు కౌంటర్ విన్నారా?

By:  Tupaki Desk   |   3 March 2022 6:30 AM GMT
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య సుపారీపై పోలీసుల వాదనకు కౌంటర్ విన్నారా?
X
నిజం ఏమిటో తేలాలంటే.. బాధితులు.. బాధ్యులకు సంబంధించిన రెండు వాదనల్ని వినాల్సిందే. ఏ ఒక్కరు చెప్పే వాదనల్ని వినేసి.. తీర్పు చెప్పేస్తే అది అన్యాయమే అవుతుంది. అదే సమయంలో రెండు పక్షాల వాదనలు విని.. వారు అందించే సాక్ష్యాలు.. ఆధారాలతో పాటు.. మిగిలిన అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కు సంబంధించి మీడియా ప్రతినిధులకు ఉన్న వాట్సాప్ గ్రూపులో ఒక సందేశం వచ్చింది.

బుధవారం రాత్రి 8.30గంటలకు సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ పెడుతున్నారని.. హాజరు కావాలన్న ఆహ్వానం అందింది. సాధారణంగా సీపీ స్థాయి అధికారులు ఎవరైనా సరే.. ఉదయం.. మధ్యాహ్నం మాత్రమే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. చాలా అంటే చాలా అరుదుగా మాత్రమే.. రాత్రి వేళ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అలాంటి అత్యంత అరుదైన ప్రెస్ మీట్ గా బుధవారం రాత్రి సమావేశాన్ని చెప్పాలి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయటానికి సుపారీ ఇచ్చారని.. అందుకు సంబంధించి రూ.15 కోట్ల డీల్ జరిగిందని.. దానికి బాధ్యులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ కుట్రలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి.. డీకే అరుణ అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు మంత్రినిహత్య చేసేంత ధైర్యం ఉందా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. అయితే.. ఈ ప్రెస్ మీట్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి పాలమూరు పట్టణానికి చెందిన పలువురు కిడ్నాప్.. కనిపించకుండా పోవటం.. అరెస్టులకు గురి కావటం లాంటివి సంచలనంగా మారుతున్నాయి.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చినట్లుగా ఆరోపిస్తూ అరెస్టు చేసిన నిందితుల కుటుంబ సభ్యులు.. బంధువులు వినిపిస్తున్న సందేహాలు.. వాదనలు కొత్త తరహాలో ఉంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని చూస్తే..

- 2018లో జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు దొర్లాయని.. ఆ అఫిడవిట్ ను మార్చేసి.. మరో అఫిడవిట్ ను ఎన్నికల కమిషన్ కు చెందిన ఒక ఉద్యోగి సాయంతో అప్ లోడ్ చేసినట్లుగా ఆరోపిస్తూ.. మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేందర్ రాజు కేసు పెట్టి పోరాడుతున్నారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉంది. అయితే.. తాజాగా మంత్రి హత్యకు సుపారీ ఇచ్చిన కేసులోని నిందితుల్లో రాఘవేందర్ రాజు కూడా ఉన్నారు.

- అంతేకాదు.. రాఘవేందర్ రాజుతో పాటు మహబూబ్ నగరర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్ రాజు.. మధుసూదన్ రాజు.. నాగరాజు.. బండేకర్ విశ్వనాథరావు.. తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి.. వరద యాదయ్యలు ఉన్నారు. వీరందరిని మంత్రి హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు ప్రకటించటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

- మంత్రి హత్య కేసులో నిందితులుగా చేర్చిన నలుగురు అన్నదమ్ములకు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మొదటి నుంచీ రాజకీయ విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన అమరేందర్‌రాజు.. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య రాధ గతంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన కొన్నిరోజుల తర్వాత అమరేందర్‌రాజు కుటుంబం.. శ్రీనివాస్‌గౌడ్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటారని చెబుతారు.

- ఎన్నికల వేళ శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని.. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్ సైట్ నుంచి ట్యాంపర్ చేసి వివరాలు మార్చినట్లుగా ఫిర్యాదు చేసిన రాఘవేందర్ రాజు.. 2019 జనవరి 24న కోర్టులో కేసు కూడా వేశారు. శ్రీనివాస్ గౌడ్ ను అనర్హుడిగా ప్రకటించి.. ఉప ఎన్నిక నిర్వహించాలని కోరుతున్నారు.

- రాఘవేందర్ రావు ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్నట్లుగా చెబుతారు. ఈసీ వెబ్ సైట్ ట్యాంపరింగ్ పై నిజానిజాలు తేల్చాలని సాంకేతిక టీంను సీఈసీ ఆదేశించిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇవన్నీ ఉత్త అబద్ధాలుగా.. తప్పుడు ప్రచారాలుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొట్టేస్తుంటారు.

- తాజాగా అరెస్టు అయినట్లుగా పోలీసులు ప్రకటించిన నాగరాజు, భండేకర్‌ విశ్వనాథరావు, యాదయ్యలను కొందరు వ్యక్తులు 23, 24 తేదీల్లో వారి భార్యలు మహబూబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాంటప్పుడు వారు 25వ తేదీన ఫరూక్.. హైదర్ అలీలను హత్య చేసేందుకు ప్రయత్నించారని.. 26న అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెప్పటం ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు.

- ఒకవైపు తమ భర్తలు కిడ్నాప్ లకు గురయ్యారని ఫిర్యాదు ఇచ్చినప్పుడు.. వారిని వెతకటం వదిలేసి.. అందుకు భిన్నంగా హత్యకు సుపారీ ఇచ్చారన్నకేసును పెట్టటంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు హత్యకు సుపారీ ఇచ్చేందుకు వీలుగా డీల్ కుదుర్చుకున్నారని చెబుతున్న విశ్వనాథ్ భండేకర్.. మున్నూర్ రవి.. యాదయ్యలకు అంత డబ్బులు ఎక్కడివి? వారి ఆర్థికస్థోమత అంత లేదన్న మాట వినిపిస్తోంది.