Begin typing your search above and press return to search.

ఈ చెత్త రికార్డును త్వరగా చెరిపేయాలి జగన్

By:  Tupaki Desk   |   16 Sep 2021 10:30 AM GMT
ఈ చెత్త రికార్డును త్వరగా చెరిపేయాలి జగన్
X
మహిళల భద్రత కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్న ఏపీలోని జగన్ సర్కారుకు తాజాగా విడుదలైన నివేదికలోని వివరాలు ఇబ్బందికి గురి చేసేవే. ఎందుకంటే.. దేశంలో మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలవటమే దీనికి కారణం. అంతేకాదు.. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ చెత్త రికార్డు జగన్ సర్కారుకు ఇబ్బంది కలిగించేదే.

మహిళల రక్షణ కోసం తాము తీసుకొచ్చిన దిశ యాప్ బ్రహ్మండంగా పని చేస్తుందని.. దాని పనితీరును పొగడటానికి పోలీసు అధికారులు అప్పుడప్పుడు పోటీ పడుతున్న వైనం చిట్టి వీడియోల్లో చూస్తున్నాం. ఇలాంటివేళలోనే జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో మహిళలపై నేరాలు.. వారిపై అఘాయిత్యాలు.. వేధింపులు.. ఇలా ఒకటేమిటి? మహిళలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న దానికి నిదర్శనంగా ఏపీలోని నేరాల నమోదు ఉందన్న విషయాన్ని వెల్లడించటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి.

మహిళలపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే జగన్ ప్రభుత్వం.. చేతల్లో ఆ పని చేసి చూపించాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదికలోని కీలక అంశాల్ని చూస్తే.. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈ తరహా ఘటనల్లో 33.14% ఏపీలోనే నమోదవడం పరిస్థితి తీవ్రత ఎంతన్న విషయం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. మహిళలపై దాడులు.. లైంగిక వేధింపులు.. అత్యాచారాలు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగినట్లుగా పేర్కొన్నారు. మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి 2019లో 1,892 నమోదు కాగా.. 2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది.

అంటే ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమైన విషయం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం లాంటి నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది. పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ దేశంలో మొదటిస్థానంలో ఉండగా.. 70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది. స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది.

మరో దారుణ అంశం ఏమంటే.. ఏపీలో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1,088 ఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డది బాధితులకు పరిచయస్తులే. 91 ఘటనల్లో బాధితుల కుటుంబసభ్యులే నిందితులు. 997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌ స్నేహితులు.. ఇరుగుపొరుగు వారి ప్రమేయం ఉంది. కాస్త ఊరట కలిగించే అంశం రోడ్డు ప్రమాదాలు
రోడ్డుప్రమాదాలు 14,700 నుంచి 12,830కు తగ్గాయి. కిడ్నాప్ కేసులు సైతం 902 నుంచి 737కు తగ్గాయి.అదే సమయంలో పలు సందర్భాల్లో పోలీసులే నిందితులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులపై అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం. ఈ తరహా కేసుల్లో అసోం (2,179), మహారాష్ట్ర (407) తర్వాత 261 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. ఆయా ఘటనలపై అభియోగపత్రాల దాఖలులో దర్యాప్తు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి.