Begin typing your search above and press return to search.

ఒక్క పెగ్ తాగినా గుండెకు ముప్పే .. ఆందోళన రేపుతోన్న ఆ అధ్యయనం

By:  Tupaki Desk   |   3 Sep 2021 6:34 AM GMT
ఒక్క పెగ్ తాగినా గుండెకు ముప్పే .. ఆందోళన రేపుతోన్న ఆ అధ్యయనం
X
మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసు కానీ , ఆ మద్యం తాగడం మాత్రం మానరు. మద్యం తాగడం మంచిది కాదు అని చెప్తే , మద్యం తాగమని డాక్టర్స్ కూడా చెప్తున్నారు అంటూ చెప్తారు. అయితే, మోతాదులో మద్యాన్ని స్వీకరించినా కూడా అది గుండెకు చేటే అని తాజా అధ్యయనం లో వెల్లడైంది. ఎదో సరదా కొద్దీ, విందు భోజనం తరువాత కొంచెం ‘మద్యం తాగితే తప్పేమీ కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక పరిశోధన మాత్రం అవన్నీ హంబగ్‌ అని తేల్చేసింది.

కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు లెక్క ప్రకారం, ఎదో సరదా కొద్ది తక్కువ మోతాదులో డ్రింక్‌ తీసుకున్నా గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చే ప్రమాదం ఎక్కువ ఉందట. గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని ఆట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య తాగుబోతుల్లో ఎక్కువని ఒక అంచనా ఉండేది. కానీ మోతాదులో పుచ్చుకున్నా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది అని తాజా పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవ్తేత గ్రెగరీ మార్కస్‌ వెల్లడించారు. తాము వంద మంది రోగులపై పరిశోధన చేశామని, ఫస్ట్ పెగ్ తాగిన కొన్ని గంటల్లోనే వారికి ఆట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ వచ్చే అవకాశం రెట్టింపు అయ్యిందని చెప్పారు.

వీరు రెండో పెగ్ కూడా తీసుకుంటే ప్రమాదం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అయితే తాము పరిశోధనలు చేసిన వారు ముందుగానే ఈ సమస్యతో బాధపడుతున్న వారు కాబట్టి సాధారణ వ్యక్తుల్లో ఒక్క డ్రింక్‌ కూడా ప్రమాద హేతువు కావచ్చునని చెప్పవచ్చునని వారు వివరించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఆరోగ్యంపై మద్యం ప్రభావాన్ని కచ్చితంగా లెక్కకట్టడం అంత సులువైన పనేమీ కాదు. పరిశోధనలో పాల్గొన్న వారు తాము ఎంత మద్యం పుచ్చుకున్నదీ స్పష్టంగా తెలియజేయాల్సి ఉండటం దీనికి ఒక కారణం. అంతేకాకుండా, వారి జీవితాల్లోని ఇతర అంశా లను కూడా పరిగణనలోకి తీసుకుని తుది అంచనా వేయాల్సి ఉంటుంది. పరిశోధనల్లో పాల్గొన్న వారు తరచూ తమ రక్తాన్ని స్వయంగా పరీక్షించుకునే ఏర్పాట్లు చేశారు. మధుమేహ పరీక్ష తరహాలో రక్తంలో మద్యం మోతాదును లెక్కకట్టారు. ఫలితాలు చెప్పే విషయం ఒక్కటే.. మద్యం ఎంత ఎక్కువైతే.. ప్రమాదమూ అంతేస్థాయిలో పెరుగుతోంది అని మార్కస్‌ వివరించారు.

గుండెజబ్బులను నివారించేందుకు జీవనశైలి మార్పులు ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. యూరప్‌ కు చెందిన నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని, కనీసం ఒక్క గ్లాసు అదనంగా తాగినా గుండెసంబంధిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు చెబుతున్నారు. గుండె విఫలమయ్యేందుకు ఉన్న అవకాశాలను నివారించేందుకు లేదా ఆలస్యం చేసేందుకు నీళ్లు చాలా ఉపయోగపడతాయి అంటారు ఈ తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నటాలియా దిమిత్రైవ.