Begin typing your search above and press return to search.

వైసీపీ ఎఫెక్ట్‌: ఏపీ ప్ర‌జ‌లు మార‌తారా.. లేటెస్ట్ సర్వే చెప్పిందిదే..!

By:  Tupaki Desk   |   15 Nov 2021 10:30 AM GMT
వైసీపీ ఎఫెక్ట్‌: ఏపీ ప్ర‌జ‌లు మార‌తారా.. లేటెస్ట్ సర్వే చెప్పిందిదే..!
X
ఏపీలో ఇటీవ‌ల ఒక స‌ర్వే నిర్వ‌హించారు. దీనిలో ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజారిటీ ప్ర‌జ‌లు .. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న న‌వ‌ర‌త్నాల‌ను కొన‌సాగించాల‌ని చెప్పారు. ముఖ్యంగా అమ్మ ఒడి, విద్యాదీవెన‌, ఆస‌రా, చేతి వృత్తుల‌కు ఇస్తున్న నిధులు, అదేవిధంగా ఇంటింటికీ రేష‌న్‌.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ల‌ను వారు అమితంగా ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు పేర్కొన్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు న‌వ‌రత్నాల‌ను ఎంచుకున్నారు. వీటిలో ఆయా ప‌థ‌కాల‌ను చేర్చి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు.

అయితే.. నిజం చెప్పాలంటే.. ఆయా ప‌థ‌కాలు అన్నీ కూడా.. ప్ర‌భుత్వ ఖ‌జానాపై తీవ్ర ప్ర‌భావం చూపుతు న్నాయి. చాలా వ‌ర‌కు భారంగా మారుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఏనెల‌కానెల‌.. నిధులు స‌మ‌కూర్చుకోవ‌డం.. ప్ర‌బుత్వానికి సంక‌ట ప‌రిస్థితిని తల‌పిస్తోంది. దీంతో పైకి మేలు చేస్తున్నామ‌ని చెబుతున్నా.. నిధులు స‌మ‌కూర్చ‌లేక‌.. ఆర్థిక శాఖ వ‌ర్గాలు.. తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఔన‌న్నా.. కాద‌న్నా.. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. వీటిలో కొన్ని ఓటు బ్యాంకును నిర్దేశించ‌నున్నాయి.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఇప్పుడు అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను కొన‌సాగించ‌డం.. త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఎందుకంటే..ఇప్పుడున్న వాటిని కొన‌సాగిస్తామ‌ని చెప్పే పార్టీల‌కే.. ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌న‌డంలో సందేహం లేదు. కాబ‌ట్టి.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈ ప‌థకాల‌ను ఎవ‌రు కొన‌సాగిస్తార‌నే అంశంపైనే ప్ర‌జ‌ల ఓటు బ్యాంకు ఆధార‌ప‌డి ఉంటుంది. ఇదే విష‌యం తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ స్ప‌ష్ట‌మైంది. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌బు్త్వానికి ఆర్థిక భారంగా మారిన విష‌యాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ``అదంతా .. సీఎం గారు చూసుకుంటారు`` అని ప్ర‌జ‌లు ముక్త‌స‌రిగా స‌మాధానం చెబుతున్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి ఇవి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏటా 15 వేల చొప్పున ఇచ్చే అమ్మ ఒడిని ఖ‌చ్చితంగా కొన‌సాగించాల్సినప‌రిస్థితి ఉంది. అదేస‌మ‌యంలో ఆస‌రా పింఛ‌న్ల‌ను కూడా ఎత్తేయ‌డానికి లేదు. నాడు నేడు కింద ఏటా పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, పుస్త‌కాలు.. ఇవ్వాల్సిన అవ‌సరం ఉంది. అదేస‌మ‌యంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టేందుకు అస‌లు ఆస్కార‌మే క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డం.. టీడీపీకి అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో వైసీపీ కూడా ఈ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తామ‌ని.. చెబితేనే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌ని అంటున్నారు.