Begin typing your search above and press return to search.

ఏమిటీ ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్? దీని ప్రత్యేకతలు ఏమిటి?

By:  Tupaki Desk   |   9 Dec 2021 11:09 AM IST
ఏమిటీ ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్? దీని ప్రత్యేకతలు ఏమిటి?
X
అతనేమీ సాదాసీదా వ్యక్తి కాదు. భారత దేశ త్రిదళాలకు అధినేత. అలాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి ప్రయాణించే హెలికాఫ్టర్ ను ఎంతలా చెక్ చేస్తారు? మరెంతలా దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి హెలికాఫ్టర్ లో ప్రయాణించే వేళలో ప్రమాదం చోటు చేసుకోవటం.. ఏకంగా 14మంది మరణించటం ఇప్పుడు యావత్ దేశానికి షాకింగ్ గా మారింది.

అత్యాధునిక సాంకేతికతను కేరాఫ్ అడ్రస్ గా చెప్పే ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్ భారత సైన్యంలో అత్యంత ప్రత్యేకమైనదిగా చెబుతారు. ప్రతికూల వాతావరణం ఏమీ లేని సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి కారణం పక్కాగా సాంకేతిక లోపంగా చెబుతున్నారు.

ఆకాశం నిర్మలంగా ఉండటం.. కొంత పొగ మంచు తప్పించి.. మరెలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ.. హటాత్తుగా హెలికాఫ్టర్ కు మంటలు అంటుకొని.. కాలిపోయిన వైనం అందరి గుండెల్ని పిండేస్తోంది. ఇంతకూ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఎవరూ సూటి సమాధానాన్ని చెప్పటం లేదు. ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. దీన్ని వంట పెట్టలేమని చెబుతున్నారు. ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్.. ఎంఐ-8/17 కుటుంబానికి సంబంధించినదిగాచెబుతారు.

భద్రతా బలగాల రవాణాకు.. ఆయుధ రవాణాకు.. అగ్నిప్రమాదాల కట్టడికి.. పెట్రోలింగ్.. గాలింపు తదితర ఆపరేషన్ల కోసం వీటిని వినియోగిస్తుంటారు. ఈ హెలికాఫ్టర్లను 80 సరఫరా చేయాల్సిందిగా రష్యాతో ఒప్పందం చేసుకోగా.. 2013 వరకు మొత్తం 36 హెలికాఫ్టర్లు మాత్రమే పంపిణీ చేశారు.

ఈ హెలికాఫ్టర్ లో ప్రత్యేకతలకు కొదవ లేదు.

- ఒకేసారి 36మంది వరకు ఇందులో ప్రయాణం చేయొచ్చు.

- 13 వేల కిలోల బరువును సైతం సునాయాసంగా మోయగలదు.

- 6 వేల మీటర్ల ఎత్తులో 465 కిలోమీటర్ల దూరం నిర్విరామంగా ప్రయాణం చేసే సామర్థ్యం దీని సొంతం.

- గంటకు 225- 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

- అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా పని చేస్తుంది.

- వీఐపీ చాపర్‌ కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.


ఇన్ని ప్రత్యేకతలున్న ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావటమా? అన్నది విస్మయానికి గురి చేస్తుంది. అయితే.. ఈ హెలికాఫ్టర్లకు సంబంధించి గడిచిన కొంతకాలంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నిజానికి ఈ రకం హెలికాఫ్టర్ లో ప్రమాదాలకు తక్కువ అవకాశాలు ఉంటాయి. రెండు ఇంజిన్లు ఉన్న ఈ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురి కావటం జీర్ణించుకోలేకపోతున్నారు. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చా? అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన మరిన్నివిశేషాల్ని చూస్తే..

- ఎంఐ 17వీ5 అనేది రష్యన్ హెలికాప్టర్‌. దీన్ని కజాన్ హెలికాప్టర్స్ తయారు చేసింది. ఈ హెలికాప్టర్ లో 2 ఇంజిన్లు ఉంటాయి. ఒకటి ఫెయిలైనా మరోకటి పని చేయటం దీని ప్రత్యేకత.

- ఎంఐ 17వీ5 హెలికాఫ్టర్లు.. ఎంఐ 8/17లోనే అత్యంత ఆత్యాధునిక సాంకేతికత కలిగినవి. దీని గరిష్ఠ టేకాఫ్ వెయిట్ 13వేల కేజీలు అయితే.. ఒకేసారి 36 మందిని సులువుగా గమ్యస్థానానికి తీసుకెళ్లగలవు. ప్రతి ఎంఐ17వీ5 హెలికాప్టర్‌లోనూ కాంప్లెక్స్ నావిగేషన్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే కేఎన్ఈఐ 8 ఫీచర్లు ఉన్నాయి.

- క్యాబిన్ లోపల కార్గో రవాణకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. వీటికి ఫైర్ సపోర్ట్ ఫీచర్ ఉంది. ప్యాట్రోల్‌కు కూడా ఉపయోగిస్తారు. సెర్చ్ అండ్ రిస్క్యూ మిషన్లకు కూడా వీటిని ఉపయోగిస్తారు. భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 200కు హెలికాప్టర్లు ఉన్నాయి.

- ఎంఐ 17వీ5 హెలికాప్టర్‌లో క్షిపణులు, ఎస్ 8 రాకెట్లు, 23 ఎంఎం మెషీన్ గన్, పీకేటీ మెషీన్ గన్స్, ఏకేఎం సబ్‌మిషన్ గన్స్ వంటివి ఉంటాయి. వీటి ద్వారా పైనుంచి కింద ఉన్న ఏ లక్ష్యాన్ని అయినా టార్గెట్ చేయగలవు. వీటిని మొదటిసారి 2012 ఫిబ్రవరి 17న ఇండియన్ ఎయిర్ ఫోర్సులోకి తీసుకొచ్చారు.